పసిడి మొగ్గలు:- సత్యవాణి

 పాప పాలు పారబోసింది
పిచ్చ కోపం వచ్చింది నాకు
పాపని పట్టుకొని బాదేశాను
పాపం పాప రోదించింది
పసిడి బుగ్గలపై కన్నీళ్ళు
జల జలా ముత్యాల్లా రాలి ధారగా పడుతున్నాయి
ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది
పనిష్మంటూ మనసును రాయిచేసుకున్నాను
లాలిస్తానేమోనని ఆశగా చూసింది నావైపు
పంటి బిగువున ఆగి పోయాను నేను
ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే బడికెళ్ళింది పాప 
తప్పు చేశావు 
అని మనసులోని బాధ
మెలిబెట్టింది
నువ్వెన్ని నీ చెేతులతో పగులగొట్టేవు
మరెన్ని పారబోశావు నీవు
అడిగిందా పాపనిన్ను
"అదేమమ్మా "అని
నిలదీస్తోంది మనసు
నిగ్గదీసి అడుగుతోంది
సిగ్గుతో చితికిపోయాను నేను
చిన్నారిపై నేను చూపిన ప్రతాపానికి
నా  ముఖాన్ని అద్దంలో చూసుకోలేకపోయాను నేను
పడమటి సంద్యకు ఇల్లు చేరింది పాప 
పరుగులతో ఉరకలతో
"అమ్మా !"...అంటూ పరుగున వచ్చి నన్ను
హత్తుకు పోయింది నన్ను
అంతవరకూ గిల్టీగా ఫీలవుతున్న
నేను
ఆప్యాయంగా నాపాపను గుండెకు హత్తుకున్నాను
పక పకా నవ్వింది పాప
నాపాపం ప్రక్షాళనమైయ్యేలా