మనసులో ని మాట ..!!:- ------శ్యామ్ కుమార్,-నిజామాబాద్.


 "అసలు బుద్ధుందా నీకు ఏంట్రా మాటలు? నీ వయసెంత ?నువ్వు చదువుకున్న చదువు ఏంటి? ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను",అoది మా పక్కింటి శశిరేఖ అక్క. నాకు తల తిరిగి పోయింది. నా వయస్సు అప్పుడు  13 సంవత్సరాలు అనుకుంటాను. ఆరోజుల్లో ఒక శోభన్ బాబు సినిమా చూశాను అందులో ఆ  హీరో  వయసు దాదాపు 12 ,14 మధ్య ఉంటుంది తన తో ఆడుకుంటున్న  అమ్మాయిని చూసి 

 అమ్మాయిని పెళ్లి చేసుకుందామని  అనుకుంటాడు.  నేను ఆ సినిమా చూసి

వుత్తేజితుడై ,నేను అలాగే అనుకున్నాను, . తప్పేముంది? అదే విషయం  పక్కింట్లో ఉండే శశిరేఖ అక్కయ్య కు చెప్పాను . కానీ ఈ రకంగా చీవాట్లు తింటా అనుకోలేదు అసలు ఎందుకు తిట్టింధో నాకు ఆ వయసులో అస్సలు అర్థం కాలేదు ."నువ్వు ముందు బాగా చదువుకొని పెద్ద వాడివై ఉద్యోగం   సంపాదించుకొని ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలి .,ఈ చిన్న వయసులో ఏంటి  ఈ ఆలోచనలు? అసలు ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ" అంది. అప్పుడే మొదటి సారి  ఒక సత్యం తెలిసింది. అదేమిటి  అంటే ,  మనసులో మాట ఎవరికీ చెప్పకూడదు, నోరుమూసుకొని ఉండాలని. తర్వాత  పొరపాటున గాని ఈ విషయం ఎప్పుడూ ఎత్తలేదు  ఎవ్వరి దగ్గర.

 నేను సెలవులకి నిజాంబాద్ వెళ్లి మా నాన్నగారు అమ్మ వద్ద  గడిపి తిరిగి స్కూల్స్ తెరిచే సమయానికి భువనగిరికి వచ్చి మా నానమ్మ బాబాయ్ దగ్గర ఉండే వాడిని. నిజాంబాద్ లో మేము ఉండే ప్రాంతం  కంటేశ్వర్. మా ఇల్లు చర్చి కాంపౌండ్ పక్కనే ఉండేది. ఆ చుట్టుపక్కల అంతా క్రిస్టియన్స్ ఇల్లు కట్టుకుని సెట్ అయ్యారు. అక్కడ నాతో ఆడుకునే ప్రతి ఒక్కరూ దాదాపుగా క్రిష్టియన్  మతస్తు లే. చలికాలం సెలవులకి నిజాంబాద్ వచ్చినప్పుడల్లా నా క్రిస్మస్  సంబరాలు  వారితో గడిచేవి . ఆ పండగ సందర్భంగా వారు చేసే కేకులు మురుకులు కజ్జికాయలు, ఇంట్లో చేసే బిస్కెట్లు అన్ని హాయిగా తినేవాణ్ణి. మా ఇంట్లో చేసే వంటల కు  ఇవి చాలా విభిన్నంగా ఉండేవి. శశిరేఖ  ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉండే వాళ్ళు పెద్ద అక్క కూతురులు అన్నమాట . ఒకరి పేరు రేచల్ డారతి, ఇంకొక అమ్మాయి ముద్దు పేరు,టకం.  ఒకరు ఆరో తరగతి ఇంకొకరు ఏడవ తరగతి చదివారు.  నాతో ఎక్కువగా ఆడుకున్నారు వీరె. శశిరేఖ అక్కయ్య రేడియో డిపార్ట్మెంట్లో పని చేసేది. వాళ్ళ అమ్మ గారు లేనప్పుడు ఆవిడ  ఇంటికి బావ  వచ్చేవారు.  వారిద్దరూ చాలా ప్రేమగా ఉండే వాళ్ళు .వాళ్ళని చూసి నేను మురిసిపోయా.  ఆ తర్వాతి కాలంలో వారి పెద్ద వాళ్ళు  వారి వివాహానికి

  ఒప్పుకోలేదు.  చాలా కష్టపడి పెద్ద వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఆ బావ గారి పేరు దినకర్.  చాలా స్మార్ట్ గా ఉండేవాడు. ఆ తర్వాత అతనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసి అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగాలు సంపాదించుకుని అక్కడే వుండి పోయారు .

ఇక్కడ  క్రిస్టియన్ మతస్తుల ఇళ్లల్లో నేను చూసిన ఒక ప్రత్యేకత ఏంటంటే, అందరి ఇళ్లల్లో ప్రత్యేకంగా సంగీత కళాకారులు ఉంటారు. ఏదో ఒక సంగీత పరికరం మీద వాళ్లకు పట్టు ఉండేది. వాళ్లు అందరూ కలిసి ఒక ఆర్కెస్ట్రా లాగా కూడా పెట్టుకునేవారు. ఇక అక్కడ ఇళ్లల్లో ఏ ఫంక్షన్ జరిగిన ఏ కార్యక్రమం జరిగినా ఆర్కెస్ట్రా తప్పనిసరి ఉండవలసిందే.   ఆర్కెస్ట్రాలో శ్యాంసుందర్ అని మంచి అందగాడు ఉండేవాడు. దాదాపు మిథున్ చక్రవర్తి లాగే ఉండేవాడు అనుకోండి.  చక్కటి డ్రెస్ వేసుకుని.  ఇంషర్టు ,   బెల్-బాటం ప్యాంటు  వేసుకుని ,  స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉంటే అందరూ  ఊగి పోయేవారు.  అతను పాట మొదలుపెట్టగానే చప్పట్లతో మొత్తం గ్రౌండ్ అంతా మారు మోగి  పోయేది.  చర్చిలో కానివ్వండి వివాహాలు కానివ్వండి ఎటువంటి ప్రోగ్రాం  లో  అయినా అతను పాడాల్సిందే.  అమ్మాయిలల్లో మాత్రం అతను అంటే ఒక రకమైన క్రేజీ ఉండేది. అబ్బాయిలు మాత్రం ఒక రకమైన జలసీ తో చూసే వారు.  అబ్బా !    ఎంత     అదృష్టవంతుడు ! అని అనుకునే వాణ్ని .   కొన్నాళ్ల తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ అతను భక్తిమార్గం  లో  వెళ్ళి, ఫాదర్ గా ఒక చర్చి కి వెళ్లి పోయాడు.  బ్రహ్మచారి గా వుండి పోయాడు. కొందరు అంటుంటే విన్నాను ,అతను ఇష్టపడ్డ అమ్మాయిని వివాహం చేసుకొలేకపోయి చాలా బాధపడ్డాడు, అందుకే అలా అయిపోయాడు అని.  ఎవర్ని అడిగినా అందరూ బాధతో అలాంటి సమాధానమే   చెప్పారు.  

మా ఇంటి దగ్గర లోనే  ఆర్థర్ అని ఒకతను  ఉమెన్స్ కాలేజీ లో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతని ఇంట్లో అతని పిల్లలందరికీ రక రకాల సంగీత వాయిద్యాలు వచ్చేవి.  ఇంటికి అతిథులు వచ్చినా లేదా ఇంకెవరు స్నేహితులు వచ్చినా అతని పిల్లల్ని అందర్నీ కూర్చోబెట్టి ఏదో ఒక చిన్న సైజు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేయించేవాడు. ఆ రోజుల్లో  నిజామాబాద్ పట్టణంలో భార్యను సైకిల్ మీద కూర్చోపెట్టుకుని తీసుకెళ్లేవాడు అతనొక్కడే .  

నేను చాలాసార్లు చర్చి కు వెళ్ళాను, వారందరితో కలిసి, ఏమైనా ప్రసాదాలు పెడతారేమో అని. ఆ రోజుల్లో అమెరికా నుంచి మంచి  లాంగ్ వులెన్   కోట్స్   వచ్చే వి ఫాదర్ కు.  చలికాలంలో వాటి గురించి మేమంతా ఎంతో ఆశగా అక్కడికి వెళ్లేవాళ్లం.  అక్కడ ఫాదర్ ఎంపిక చేసిన కొందరికి  అవి ఇచ్చేవారు.  బాల్యంలో  నాతో ఆడుకున్న వాళ్ళు చాలామంది వాయిద్య పరికరాలు ,పాటలు మాత్రమే కాక స్పోర్ట్స్ లో కూడా చాలా ప్రావీణ్యం సంపాదించి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. అప్పుడప్పుడు వెళ్లి  అందరిని  చూసి వస్తుంటాను కానీ చాలామంది పెద్ద వాళ్లు , నన్ను ప్రేమగా  ఆప్యాయంగా చూసిన పెద్దవాళ్లు ఎంతోమంది  స్వర్గస్తులయ్యారు.  కొందరేమో అనారోగ్యంతో బాధ పడుతున్నారు.  ఇప్పుడు   అక్కడి వీధుల్లో తిరుగుతున్నప్పుడు అవి చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో.      మేము అక్కడ ఆడుకుంటున్న రోజుల్లో , ఎందుకో ఏమో గాని అవి చాలా పెద్దగా కనిపించేవి. ఒక్కసారి ఆలోచిస్తే  అక్కడ క్రిస్టియన్ లందరూ  ప్రేమ ఆప్యాయత ఆదరణ  కలిగి శాంతికాముకులు గా వుండేవారు. వారి మధ్య తగాదాలు కూడా చాలా తక్కువగా కనిపించాయి ఇక అమ్మాయిలు అబ్బాయిలు  ఎప్పుడూ ఆటపాటలతో కాలం గడిపేవారు.  నా బాల్యం చాలా వరకు భువనగిరిలో మా నాన్నమ్మ దగ్గర ముస్లిం  స్నేహితులతో మరియు స్కూల్ సెలవుల లో మా నాన్న గారి ఊర్లో నిజామాబాద్ లో క్రిస్టియన్  పిల్లలతో గడిచిపోయింది. నాతో ఆడుకున్న  రేచల్ డారతి  అనే అమ్మాయి , చిన్నప్పటి నుంచి ఉండే గుండె సంబంధిత అనారోగ్యంతో యుక్తవయసు లోనే పోయింది.   రెండు భిన్నమైన మత జీవన విధానాలను  చూస్తూ,  బాల్యంలోని   తిరిగిరాని తీయదనాన్ని అనుభవిస్తూ గడిపేశాను. నాకే తెలియకుండానే నా బాల్యం వెళ్ళి పోయింది.