నా రాతంతా పనికిరాని కోతలే:-- యామిజాల జగదీశ్

 నాకు తేదీలు జ్ఞాపకం లేదు. ఒకప్పుడు ఫేస్ బుక్కులో అదేదో నియమంలా రోజూ ఓ పదో ఇరవయ్యో కవితలని చెప్పను కానీ కొన్ని మాటలు కూర్చి పోస్టు చేస్తుండేవాడిని. అలా కొన్ని వేల మాటలు పోస్టు చేశాను. అవి బాగున్నాయో లేదో అని కూడా ఆలోచించక పోస్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒకరిద్దరి అభిమానాన్ని తెచ్చిపెట్టాయి ఆ పోస్టులు. ఇప్పటికీ ఓ మిత్రుడు నేను పోస్టు చేసిన మాటలన్నీ దాచుకున్నాడు. ఒకరేమో పుస్తకంగా వెయ్యమని సలహా ఇచ్చారు. కానీ ఆ సాహసం చేయలేదు. అందుకు కారణాలు రెండు. ఒకటి, నా దగ్గర డబ్బులు లేకపోవడం. రెండు, అవేమీ పుస్తకంగా వేసుకోవలసిన మాటలు కావు. అందరికీ తెలిసినవే. అవన్నీ మామూలు మాటలే. కనుక ఒకవేళ అప్పో సొప్పో చేసి వేసుకున్నా ఆ పుస్తకాలన్నీ మా ఇంట అటకమీద కట్టలుగా మూలుగుతూ ఉండాల్సిందే. వాటినెవరైనా కొంటారనే ఆశ లేదు. పాతపేపర్లు కొనుక్కునే దుకాణానికి తూకంలో అమ్మొచ్చు కావాలంటే. కొంతకాలం తర్వాత ఫేస్ బుక్కులో ఆ పేజీ శాశ్వతంగా డెలీట్ చేసేసాను. నాకు తమిళంలో మనుష్యపుత్తిరన్ అనే అతని కవితలు చాలా ఇష్టం. ఆయన ప్రత్యేకత ఏమిటంటే రాసిన ప్రతి కవిత కిందా తేజీ, టైము ఇవ్వడం. ఒక్కొక్కప్పుడు ఆయన అర్థరాత్రి తర్వాత రాసిన కవితలు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని ఆయన చెప్పుకున్న టైము చెప్తుంది. ఆయన ఇప్పటికీ రాస్తున్నారు. నేను కొన్ని కవితలు ఆయనవి రాసి పెట్టుకోవడమే కాక కొన్ని పుస్తకాలు కొన్నాను. అవి అప్పుడప్పుడూ చదువుతుంటాను. ఓమారు ఆత్మహత్యకు సంబంధించి ఆయన రాసిన కవిత నన్నెంతగానో కట్టిపడేసింది. నేను కొంతకాలం తర్వాత రాయడం మానేశాను. అందుకు కారణాలు అనేకం. ముఖ్యమైనవి రెండు. ఒకటేమో ఇంట్లో సమస్యలు తలెత్తి మానసిక క్షోభతో నలిగిపోవడం, రెండోది, రాసినట్టు బతకలేకపోవడం. అటువంటప్పుడు రాయడం దేనికి అనే ప్రశ్న తలెత్తింది. అప్పట్లో రోజూ ఎలా రాయాలనిపించేదో ఇప్పుడు రాయకుండా ఉండటం ఎలా అన్నది ఆచరణలో  పెట్టాను. నేనెప్పుడూ సామాజికపరమైన అంశాలతో ఏ రచనా చేయలేదు. నాకది చేతకాలేదు. ఫేస్ బుక్ వల్ల ఏర్పడిన పరిచయాలలో కొందరు ఈ జీవితాంతం మనం మిత్రులుగా ఉందామని, ఈ పరిచయం కలకాలం కొనసాగాలని, ఎప్పుడూ కలిసుందామని వరుసలు కలిపారు. అంతెందుకు నేనూ అలాగే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సామాజిక మాధ్యమాలలో ఏర్పడే పరిచయాలన్నీ తాత్కాలికమేనని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వారికి కోపం వచ్చిన నచ్చకున్నా బ్లాక్ చేసేస్తారు. అలాగే నేనూ బ్లాక్ చేసిన సందర్భాలున్నాయి. కనుక సాగినంత కాలం సాగించడమే ఈ పరిచయపర్వాలను.  ఫేస్ బుక్కు ఇవతలకు వస్తే తగిలిన దెబ్బలూ గాయాలూ బాధలూ చెరగని మచ్చలూ అన్నీ ఇన్నీ కావు. అవన్నీ అనుభవ పాఠాలే. వాటిని నేను మరచిపోవడం కాదు. అవే నన్ను మరచిపోవాలి అనిపిస్తుంటుంది. వాటిని లెక్కిస్తూ కూర్చుంటే అసలు ఒక వాక్యమైనా రాయగలనా అనిపిస్తుంది. బాగుంది, బాగు లేదను అనే రెండు అభిప్రాయాల మధ్య పరవాలేదు అని మొహమాటం కోసం మాటలనిపించుకోవడం అవసరమా అనిపిస్తుంది. అయినా నేను ఎవరి కోసమో రాయడమేమిటి...నాకనిపిస్తే రాయాలి గానీ....బలవంతంగా రాయడం అనేదెప్పుడూ కలిసిరాదు. అయినా నేను రాయనంత మాత్రాన ఎవరికీ ఏ నష్టమూ లేదు. కారణం, అవేమీ సమాజానికో సాటి మనిషికో ఉపయోగపడేవి కావు.


కామెంట్‌లు