కైతికాలు:--రమేశ్ గోస్కుల--కైతికాల రూపకర్త
మాయదారి గాలిని
తాకాలను ఆశకన్న
విరబూసిన పూ నవ్వుల
స్వచ్ఛత గాంచుట మిన్న
దూరపు నును కొండ కన్నా
ఇంటి పునాది రాయి ఘనం
 
అడవైన అయోధ్యైనా
ఒకటనెను రాముడు
తండ్రి మాటకు తలంచిన
ఆదర్శం  అభిరాముడు
పెద్దల మాటెంచినాడు
దీప్తి తోడ వెలుగైనడు

అసహ్యించు అలసత్వం
ప్రేమించు జవసత్వం
నీకు నీవు విన్నవించు
నిలబెట్టె బతుకు తత్త్వం
నిద్రమత్తు వేకువకన్నా
నిరంతరం వెంటుండే అలికిడి ఘనం

గుడ్డు సొనను పెంకు
సున్నితంగుంచినట్లు
మనిషి తనపు విషాలను
దాచు వ్యక్తిత్వ మట్లు
నిరంతరం చేయు కృషే
మన జీవన జ్యోతికి క్షేత్రం

చీకట్లో కూర్చుని 
కదలకుండ మూల్గులా!
కడుపు చల్ల కదలకుండ
ఊహల్లో బతుకులా!
వెలుగు పంచు శ్రమవిడుచి
కలలు కనుట పాపం కదా!

దౌర్జన్యం క్రూరత్వం
అమానుషిత ధీనత్వం
స్వార్థంతో కరుడు గట్టి
గాలి తిత్తి మోహత్వం
ఇక పొందిన దేముంది
జంతు జాల బుద్ధి తప్ప

లక్ష్యమెంచుకో ముందు
చేరుటకది రక్షరా!
సోయిలేక పరుగెడితే
మాయరోగం చిక్కురా
ముందు చూపు మరచి నాక
ముందడుగు లేదురా!

మూసివున్న మేడిపండ్ల
పైపై మెరుగుల హేల
తక్కువేమి కాదు కదా
పందిటాడు ద్రాక్ష కేల
కనురెప్ప మాటు నీలం కన్న
కసిరే మెరుపుల తళుకులు సున్న కదా!
కామెంట్‌లు