కరోనా సింహం : - సుకన్య

 

అనగనగా ఒక పెద్ద అడవి . అందులో జింకలు , మేకలు, గాడిదలు , కోతులు రకరకాల జంతువులు ఉన్నాయి .  అవి హాయిగా అడివంతా తిరుగుతూ , ఆడుకుంటూ పాడుకుంటూ, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ,  కాలం గడుపుతున్నాయి .    అలాగే  ఉంటే   కథ ఏముంది .  అందుకే  ఉన్నట్లుండి ఆ అడవికి ఒక మాయా సింహం వచ్చింది .   మాయా సింహం అంటే …..   అది ఎవరికీ కనపడదు .  కానీ దానికి వెనక కాళ్ళు లేవు.  అందుకని అది ఆహారాన్ని వెతికి పట్టి తినలేదు.  అది ఎవ్వరికీ కనపడదు కదా ,  అందుకని దగ్గరకి వచ్చిన జంతువులను పట్టి తినేస్తుంది .   ఒక్క జంతువుని తిన్నదా ,  ఇంక దానికి నెల రోజుల శక్తి వచ్చేస్తుంది . శరీరం  సైజు కూడా  పెరుగుతుంది .  దాంతో  మరొక జంతువును తేలికగా చిక్కించుకుంటుంది . 
అలా ఆ మాయా సింహం చాలా జంతువులను తినేసింది .  పాపం జంతువులన్నీ ఏడుస్తూ ,  ఈ సమస్య ని ఎలా పరిష్కరించాలో తెలియక ఆలోచన లో పడ్డాయి . 
    వాటికి ఒక ముని కనిపించి , జాలి పడి  ఉపాయం చెప్పాడు .    'ఆ సింహం మీకు కనపడదు , అందుకే మీరు దానికి చిక్కుతున్నారు . కానీ దానికి వెనక కాళ్ళు లేవు. అది మీ వెంట పడలేదు .  మీరే తెలియక దాని దగ్గరకు వెళ్లి ఆహారం అయిపోతున్నారు .  ఒక్క జంతువు ని అది తింటే, దానికి నెల  రోజుల శక్తి వస్తుంది .  అసలు ఆహారమే దొరకక పోతే ఒక్క నెల రోజులలో అది చస్తుంది .  కాబట్టి , ఒక నెల రోజులు మీరంతా బయట తిరగకుండా , పొదల్లోనే దాక్కోండి . ఒక్క జంతువు కూడా సింహానికి దొరకకూడదు మరి'.   అని చెప్పి వెళ్ళిపోయాడు. 
  అన్ని జంతువులూ అలాగే అని చెప్పి ,  వెళ్లి పొదల్లో దాక్కున్నాయి . పది రోజులైంది . సింహం  శక్తి తగ్గిపోయింది .  'అరె , ఎవరూ దొరకటం లేదేమిటి ' అని డీలా పడింది .   నీరస పడింది . దాని సైజు తగ్గి పోయింది .  కానీ కదల లేదు కదా . అలాగే చూస్తోంది , ఒక్క   గాడిద అయినా దొరకదా  అని .  గాడిద అంటే పాపం తెలివి కొంచెం తక్కువ కదా అని ఆశ పడింది . 
  అది ఆశ పడ్డట్లే ,  గాడిదలు కొంచెం తలలు  బయట పెట్టి చూస్తున్నాయి .  నెల రోజులు కాకుండానే, వాటికి చిరాకొచ్చింది .  హాయిగా తిరగటానికి ,తినటానికి లేకుండా పోయింది .  ఈ సింహం చచ్చే ఉంటుంది అని బయటకి వచ్చాయి. వాటిని చూసి, కొన్ని జింకలు, కోతులు కూడా వచ్చాయి .  చాలా సేపు హాయిగా ఆడుకున్నాయ్ . తిన్నాయ్ .  నవ్వుకున్నాయ్ . చచ్చింది సింహం అనుకుని , కనపడని సింహం దగ్గరగా వచ్చాయి .  ఇంకేముంది , సింహం ఒక జంతువుని గుటుక్కుమని ఆరగించింది .  దానికి బోల్డు శక్తి వచ్చింది.  సైజు పెరిగింది.  మరొకటి మరొకటి అలా చాలా జంతువులను తినేసింది .  శక్తి బాగా పెరిగి , పేద్ద సింహం అయిపొయింది.  ఇంకేముంది లబో దిబో మని జంతువులన్నీ ఏడవటం మొదలు పెట్టాయి.   సింహం మాత్రం  హాయిగా నవ్వుకుంది. 
     మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, పిల్లలూ,   అర్థమైందా ....   ఆ సింహం పేరు కరోనా.  ఒక్క నెల రోజులు ఏ ఒక్కరూ దానికి చిక్కకుండా, మాస్క్ పెట్టుకుంటూ, చేతులు శానిటైజ్ చేసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ, ఉన్నామంటే, అది చస్తుంది.  అందరూ ఒక్క మాటగా, ఓర్పుగా  నియమాలు పాటించాలి .  అప్పుడే కరోనా పోతుంది .  ఒక్కరు తప్పు చేసినా అది మనుష్యులను వదల కుండా తిప్పలు పెడుతుంది. 

కామెంట్‌లు