మామిడి కాయలు - యామిజాల జగదీశ్

 ప్రతి వేసవిలోనూ అందులోనూ ప్రత్యేకించి మామిడిచెట్లలో గుత్తులు గుత్తులుగా మామికాయలు కనిపించినప్పుడల్లా కుర్రాడైపోయుంటే ఎంత బాగుండేదో అనిపించింది. ఎందుకంటే చెట్లకు వేలాడే మామిడికాయలు చూసినప్పుడల్లా వాటిమీద రాయి విసిరి అవి కిందపడితే పరుగున తీసుకుని ఓ మూల తినాలనిపిస్తుంటుంది. 
నా చిన్నప్పుడు మేము మద్రాసులో ఓ మరాఠీ వాళ్ళింట అద్దెకుండేవాళ్ళం. ఆ కాంపౌండులో మూడు రకాల మామిడిచెట్లుండేవి. వాటిలో రుమాణీ, మంజనార్ (తెలుగులో దీనిని ఏమంటారో నాకు తెలీదు. కానీ ఇవి కాస్త వాసనవేసేవి. వగరుగా ఉండేవి. పండితే బాగుండేవి.) చెట్లు విపరీతంగా కాయలుండేవి. 
ఈ కాయలకోసం కావాలనే ఆ చెట్లకింద క్రికెట్ ఆడేవాళ్ళం. చెట్ల కాండానికి స్టంప్స్ లా సుద్దముక్కతో మూడు గీతలు గీసి క్రికెట్ ఆడేవాళ్ళం. ఇలా ఆడుతున్నప్పుడు బంతిని కావాలనే మామిడికాయలమీదకు విసిరేవాళ్ళం. కొన్నిసార్లు గురి తప్పినా మరికొన్నిసార్లు బంతి తగిలి మామిడి కాయలు కిందపడేవి. అలా పడిన కాయలను నలుగురం దొంగచాటుగా తినేవాళ్ళం. ఒక్కొక్కప్పుడు ఇంటివాళ్ళ కళ్ళపడి తిట్లు తినేవాళ్ళం. అయినేసరే మా ప్రయత్నాన్ని మానుకునేవాళ్ళం కాదు. తిట్లు తిన్నప్పుడు తినే కాయలు మరింత మజాగా ఉండేవి. ఇంట్లో అమ్మ ఊరగాయలకోసం మామిడికాయలు కోస్తుంటే వాటిలో ఒకటి రెండు ముక్కలు తీసుకుని తిన్నా చెట్ల కాయలను అప్పటికప్పుడు కోసుకుతినడంలోని రుచే వేరు. హిమాలయ శిఖరాన్ని ఎక్కినంత సంబరం.
ఇప్పుడు వయస్సు అరవై ఏడేళ్ళు. కానీ బజారుకి వెళ్తున్నప్పుడల్లా దారిలో మామిడి చెట్లకు వేలాడుతూ కనిపించే కాయలు చూస్తున్నప్పుడల్లా నా వయస్సు నన్ను కాయలకోసం రాళ్ళు విసరనివ్వడం లేదు. ఎవరైనా చూస్తే "తల పండినా బుద్ధులు మారలేదు" అని చూసినవారెవరైనా మాటలంటారేమోనని భయము. సిగ్గు. అప్పుడనిపిస్తుంది కుర్రాడి వయస్సులో ఉన్నట్లయితే ఎవరన్నా చూసినా పడిన కాయను తీసుకునిపారిపోవచ్చు. కానీ ఇప్పుడీ వయస్సులో పారిపోయే శక్తి లేదు. కారణం మోకాళ్ళ నొప్పి. అందుకే చెట్లకు వేలాడే మామిడికాయలు చూస్తున్నప్పుడల్లా అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే మాటే గుర్తుకొస్తుంటుంది. ఏదేమైనా గతించిన రోజులు ఇక రావు. ఏం చేయను. వేలాడే కాయలవంక చూసి తిన్నంతగా ఫీల్ కావడం తప్ప చేసేదేమీ లేదు.

కామెంట్‌లు