బాబాయ్ -సన్నిధి లో...!!:- -----శ్యామ్ కుమార్--నిజామాబాద్.

 చిన్నతనంలో జరిగిన ప్రతి సంఘటన కూడా చాలా ప్రత్యేకమైనదే! బాల్యంలో జరిగిన విశేషాలు- విషయాలు , తలచుకొని ఆనందించని వాళ్లు ఎవరూ ఉండరు. నేను నా బాల్యమంతా, మా నానమ్మ -బాబాయ్ ,మధ్య గడిపాను .మా బాబాయి స్నేహితులంతా నాకు మామయ్య లే. నాకు వారు అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే వారు అందరూ సైకిల్ మీద   వచ్చేవారు


 ఆ సైకిల్ ని బయట పెట్టే వాళ్లు. ఇంటి బయట పెట్టిన సైకిలు ,చాలా ముద్దుగా ఉండేది. నేను అప్పుడప్పుడే  సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను.  సీటు ఎక్కి  నడపడం రాకపోయేది.
 
 కుడి భుజం కింద సైకిల్ సీట్ నొక్కిపట్టి, ఎడమ చేతితోటి సైకిల్  నడిపే వాళ్ళం. ఆ రకంగా నడిపే దాన్ని మా ఊర్లో  ' కైమోచి'   అనే వారు .  సైకిల్ నేర్చుకోవడం అన్నది పెద్ద గగనంగా ఉండేది. ఆ రోజుల్లో సైకిల్ నేర్పించే వారు ఎవరూ ఉండేవారు కాదు, అన్నీ మన నేర్చుకోవలసిందే .మొదట్లో ఎన్నో సార్లు కింద పడే వాడిని. 
  మోకాళ్ళు -మోచేతులకు, దెబ్బలు తగలని రోజు అంటూ ఉండేది కాదు. చర్మం చెక్కుకు పోయి  ఎర్రగా వుండే ఆ గాయం మీద సన్నని మట్టిని ఊదే వాళ్లము . ఫినిష్, ఆ గాయం అలాగే మాని పొయ్యేది. లేదంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లితే కాటన్ తో  టీoచర్ అయోడిన్ లేదా  బెంజిన్ పెట్టే వారు. మా  బాబాయ్ ని కలిసేందుకు వచ్చే ఫ్రెండ్స్ సైకిల్ బయటపెట్టి ఇంట్లోకి వెళ్లేవారు.  ఇంకేముంది వాల్లువచ్చేవరకు పండగే. నేను మెల్లిగా బయటకు వెళ్లి ,ఆ సైకిల్ తీసుకొని రెండు రౌండ్లు కొట్టి ,మళ్ళీ తీసుకువచ్చి ఇంటిముందు పెట్టేవాడిని.  కొన్నిసార్లు సైకిల్  చైనువూడి పోయేది.  అది పెట్టడానికి రాదు కదా !అలాగే తీసుకొని వెళ్ళు ఇంటిముందు పెట్టేవాడిని.  మా బాబాయ్ కి ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న సైకిల్ ఉండేది.  కొన్ని రోజుల తర్వాత సీటు ఎక్కి సైకిల్ నడపడం వచ్చింది, కానీ అది నేర్చుకోవడానికి నానా  తిప్పలు పడ్డాను.  ఎక్కి నడపడం అయితే వచ్చింది కానీ, దిగడం రాకపోయేది.  దిగవలసిన చోటు వచ్చేసరికి సైకిల్ వదిలేసి కింద దూకేసేవాణ్ణి.   గంటకు పది పైసలు కిరాయి సైకిల్ తీసుకొని నడిపేవాళ్ళం.
ఒక  రోజు పొద్దున్నే  ఆరు గంటలకు మా
  సైకిల్ తీసుకొని  ఊరు బయటకు వెళ్ళా.  దారులన్నీ ఖాళీగా ఉన్నాయి ,ఎవరు లేరు, హాయిగా సైకిల్ నడుపుకుంటూ వస్తున్నా.  ఇంతలో ఉన్నట్టుండి ,పక్కనుంచి ఒక  భయంకరమైన కుక్క పెద్దగా అరుస్తూ పైకి వచ్చింది. నేను ఇంకా స్పీడ్ గా నడిపా, అది మరీ స్పీడ్ తో నావెంట పడింది.  దాంతో  భయపడి పోయి,  బ్యాలెన్స్ అవుట్ అయి  రోడ్డు ప్రక్కనే   వున్న కంకర రాళ్ళ గుట్ట పైన పడిపోయా.  అప్పుడు ,ఇంక తన   పని అయిపోయింది అన్నట్టు కుక్క పారి పో యింది. లేచి చూసుకుంటే, తలకి దెబ్బ తగిలింది . కనుబొమ మీద రాయి  గుచ్చుకొని ,విపరీతమైన రక్తస్రావం అవుతోంది.  ఆ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో  వరుసకి మేనమామ  డాక్టర్ గా ఉన్నారు. ఆ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక  డాక్టర్   మాత్రమే ఉండేవారు.  ఏం చేయాలో తెలీక ఆయన  ఉండే క్వార్టర్స్కు వెళ్లాను. ఉదయాన్నే నిద్ర   లేవలేదు ఇంకా పాపం తను. అక్కడ కట్టుకట్టించుకుని ఇంటికి వచ్చి దాచుకున్నాను . ఎందుకంటే మా బాబాయి చూస్తే అది ఒక ప్రాబ్లం మళ్ళీ. ఈ దెబ్బలు తినడమే కాక ఆయనతో తిట్లు మరి తినాలి .కానీ గమ్మత్తేమిటంటే రెండవ రోజు తెలిసిన తర్వాత మా  బాబాయి నన్ను ఏమీ అనలేదు  కానీ బాధ పడ్డారు. కొద్ది రోజుల తర్వాత మా ఇంటి ముందు పెట్టిన ,మా ఆ ముదురు ఆకుపచ్చ సైకిల్ పోయింది ,ఎలా పోయింది ఎవరికీ తెలియదు. చాలా ఫీల్ అయ్యాను నేను .    ఆరు నెలల తర్వాత మా చిన్నాన్న ,ఒకరోజు ఆ సైకిల్ తీసుకొని ఇంటికి వచ్చారు .  ఎలా దొరికింది ,ఎక్కడ దొరికింది, అని  మా  నానమ్మ అడిగింది. అప్పుడు మా చిన్నాన్న చెప్పారు ,ఆ సైకిల్ మా ఇంటి దగ్గరలో ఉన్న   సమద్ -షాపు  దగ్గర  ఆరు నెలల కింద  ,ఎవరో వదిలేసి వెళ్లారట. ఆ షాపు ఓనర్ చూసి దాన్ని తీసి తన  గోడౌన్ లో పెట్టేసుకున్నారు. ఈరోజు మా బాబాయ్ ఆ షాపు ఓనర్ కు ,  తన సైకిల్ గురించి మాట్లాడితే  ఆయన చెప్పాడుట,  మా దగ్గర ఒక సైకిల్ ఉంది చూడండి అది మీదేనా అని . తీరా చూస్తే ఏముంది అది మాదే. మా చిన్నాన్న సంతోషంతో సైకిల్ తీసుకొని వచ్చేశారు. నాకు అప్పుడు చటుక్కున స్పురించింది. ఆరోజు  ఇంటికి సరుకుల గురించి నేనే ఆ సైకిల్ మీద   వెళ్లాను. ఆ సరుకులు తీసుకుని సైకిల్ అక్కడే వదిలేసి ,హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ,ఇంటికి వచ్చేసా. నా ఆటల్లో పడి ఆ సైకిల్ గురించి మర్చిపోయా. అసలు గుర్తు లేదు. అప్పుడు చెబుదామనుకున్నా అసలు సంగతి ,కానీ నాకు తెలుసు ,అది చెబితే వీపుమోత మోగుతుంది.  ఆ తర్వాత ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పటికీ చెప్పలేదు.  నేను రెండు సంవత్సరాల వయసున్న అప్పటి నుంచి, పెంచిన మా బాబాయి, అసలు నా తల్లిదండ్రులు గుర్తు లేకుండా ప్రేమ గా చూసుకున్నారు.  నన్ను భయంతో పెంచారు, కానీ ఏనాడు కొట్టలేదు తిట్టలేదు. చిన్నప్పుడు నా ధైర్యానికి ఆయనే కారణం. తాను చక్కగా పాడే వారు. బొమ్మలు  గీసేవారు.  నాకూ అవి  వచ్చాయి.    మా  బాబాయి ఆ ఊరిలో ఉపాధ్యాయునిగా జీవితం  మొదలు పెట్టి అక్కడే రిటైరయ్యారు. ఆయన  క్రమశిక్షణలో పెరిగిన నేను నా జీవితాన్ని సక్రమంగా నడిపించుకున్నాను.  నా చిన్నతనం అంతా సంతోషంగా గడపడానికి ఒక యువరాజు లా  నన్ను  చూసుకున్న మా బాబాయి కారణం.  ఆయన నాకు ఇంకొక దేవుడు.
                   ***