అతనొక సైనికుడు. పెళ్ళయింది. కొత్తపెళ్ళికొడుకవడంతో కొన్ని రోజులు సెలవు తీసుకున్నాడు. భార్యతో కొన్ని ప్రదేశాల సందర్శనకు బయలుదేరాడు. ఓ చోట ఈ నవవధూవరులు మరొక ప్రాంతానికి పోవడానికి మధ్యలో ఉన్న నదిని దాటడం తప్పనిసరైంది.
ఇవతలి వైపు నుంచి అవతలి వైపునకు వెళ్ళడానికి నదీతీరాన ఓ పడవెక్కారు. సగం దూరః వరకూ పడవప్రయాణం సాఫీగానే సాగింది. నది మధ్యలోకొచ్చేసరికి మబ్బులు కమ్మడం, రావడం రావడమే భారీ వర్షం వచ్చింది. దానికితోడు ఉరుములు. పిడుగుల మోత. దాంతో భార్యలో భయం పట్టుకుంది. భయమంతా ముఖాన కనిపిస్తోంది. ఉండబట్టలేక భర్తతో భయాన్ని చెప్పింది. కానీ భర్త జవాబు చెప్పక ఓ చిర్నవ్వు నవ్వి పడవను ముందుకు పోనిస్తున్నాడు.
ఇంకాస్సేపటికి వర్షం మరింత భారీగా మారింది. దాంతో భార్య "వెనక్కు వెళ్ళిపోదామండి. నాకెందుకో భయంగా ఉంది. మన ప్రయాణం సాఫీగా సాగుతుందా?" అని మనసులోని భయాన్నంతా చెప్పుకుంది.
భార్య మాటలన్నీ విన్న భర్త తన దగ్గరున్న ఒరలోని కత్తిని ఇవతలకు తీసి భార్య మెడ దగ్గర పెట్టాడు.
అంతట భార్య "నేనేం చెప్తున్నాను, మీరేం చేస్తున్నారు?" అని అడిగింది. ఆ ప్రశ్నలో ఎక్కడా భయంలేదు. తన మెడమీద భర్త కత్తి పెట్టినా ఆమెలో ఎలాంటి భయమూ కనిపించలేదు.
అప్పుడు భర్త "ఇదేంటి, నేను కత్తి తీసి నీ మెడ మీద పెట్టినా ఏమాత్రం భయపడలేదేంటీ?" అని అడిగాడు.
అప్పుడామె "నా కెందుకు భయమండి. మీరు నా భర్త. నన్నేం చేస్తారు? మీరు నన్ను కాపాడటానికే ఉన్నారు తప్ప నన్నేదో చేస్తారని నేనెందుకు భయపడతాను" అన్నది.
ఆ మటలన్నీ విన్న భర్త "నీకు నేను రక్ష అని ఎలా నమ్ముతున్నావో అట్టగా ఈ దేశ రక్షణ విభాగంలో ఒకడినై సరిహద్దులో కాపలా ఉండే నన్ను ఆ దేవుడే రక్షిస్తాడని నా నమ్మకం. నాకే ఆపదా రాకుండా సజావుగా తీరం చేరుస్తాడనే నమ్మకం నాది....అందుకే హోరున వర్షం పడి నువ్వు భయపడుతున్నా నా నమ్మకం నాది. ఆ పైవాడే చూసుకుంటాడని అతనిపై ఎనలేని నమ్మకం" అంటాడు.
నిజమేగా, ఆ సైనికుడు చెప్పినట్టు మన ఆలోచనలూ చేతలూ సక్రమంగా ఉంటే ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మడం మనకో శక్తిగా భావించాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి