ఆధునిక తమిళ సాహిత్యంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకున్న రచయిత జయకాంతన్.
1934 ఏప్రిల్లో పుట్టిన జయకాంతన్ 2015లో అస్తమించారు. ఆయనను అందరూ జె.కె.గా పిలుస్తారు.
ఓ సాధారణ వ్యవసాయకుటుంబంలో పుట్టి పెరిగిన జయకాంతన్ అయిదో తరగతి వరకే చదువుకున్నారు. ఇంటి వాతావరణం నచ్చక బయటకు వచ్చేసిన జయకాంతన్ పై కమ్యూనిజం ప్రభావముంది. గాంధీజీ అంటే ఇష్టం.
జయకాంతన్ కొంత కాలం విల్లుపురంలో ఉండిన తర్వాత చెన్నైకొచ్చారు.
ఆయన జీవితానుభవాలే రచనలో ప్రతిబింబించింది. ఆయన సాహితీ జీవితం 1950లో ప్రారంభమైంది. కలం పట్టిన తొలిరోజుల్లో సరస్వతి, తామరై, గ్రామ ఊయియన్ వంటి పత్రికలలో ఆయన రచనలు విరివిగా వెలువడేవి. ఆ తర్వాత అనేక ప్రముఖ పత్రికలలో ఆయన రచనలు వచ్చాయి.
ఓ కిరాణా దుకాణంలో పని చేసిన ఆయన ఓ డాక్టర్ దగ్గరా సహాయకుడిగా ఉండేవారు.
మధురైలో సినిమా పాటల పుస్తకం అమ్మిన జయకాంతన్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం నుంచి పత్రికలు పుస్తకాలు అమ్ముతుండేవారు. సబ్బుల ఫ్యాక్టరీలోనూ పని చేసిన జయకాంతన్ జట్కావాలా దగ్గర సహాయకుడిగానూ ఉన్నారు. ఆ తర్వాత ప్రూఫ్ రీడరుగా చేరారు. సహాయసంపాదకుడిగానూ పని చేసిన ఆయన రచనలకు జీవితానుభవాలే మూలమయ్యాయి.
చిన్నకథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు రాస్తూ సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్న ఆయన చలనచిత్రరంగంలోనూ ప్రత్యేక గుర్తింపుపొందారు.
ఆయన తన పుస్తకాలకు రాసిన ముందుమాటలనూ విశిష్టమైనవిగా చెప్పుకోవచ్చు.
ఆయన రచనలు రష్యన్, ఫ్రెంచ్, చెక్, ఇంగ్లీష్, జర్మనీ, ఉక్రేనియన్ వంటి విదేశీ భాషలలోనే కాకుండా భారతీయ భాషలలోనూ అనువాదానికి నోచుకున్నాయి.
అనేకానేక అవార్డులూ రివార్డులూ పొందిన జయకాంతన్ అక్షరాలే తన జీవితమని చెప్పుకున్నారు.
ఏ విషయంలోనూ ఎవరితోనూ రాజీపడని మనస్తత్వం కలిగిన చెప్పదలచుకున్నది నిర్మొహమాటంగా చెప్పేవారు. ఎవరికీ తలవంచేవారు కాదు.
ఆయన గురించి ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు.
ఓ రెండు సంఘటనలతో ఈ వ్యాసం ముగిస్తాను.....
తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆ సభా వేదికపై అప్పటి ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి, సీనియర్ మంత్రులు, మరికొందరు ప్రముఖులు ఉన్నారు. ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ "వేదికపై ఉన్నవారిలో నేను నమస్కరించాల్సిన వాళ్ళెవరూ లేరు. అయినా వారెవరికీ ఆ అర్హత కూడా లేదు. కానీ ఒక తమిళుణ్ణి మరొక తమిళుడు అగౌరవపరిచాడనే అపవాదు చరిత్ర చెవులకు వినిపించకూడదనే ఏకైక కారణంగానే ఈ వేదికకు నమస్కరిస్తున్నాను" అన్నారు.
ఆయన ప్రసంగానంతరం కరుణానిధి మాట్లాడుతూ జయకాంతన్ ఈ వేదికమీదున్న వారెవరికీ నమస్కరించాల్సిన అర్హత లేదన్నప్పటికీ నేను ఆయనకు నమస్కరిస్తున్నాను. ఆయన ఒక ప్రముఖ రచయితనో సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీతనో నమస్కరించడంలేదని, కోట్లాదిమంది వోటర్లలో ఆయనొకరనే కారణంగా నమస్కరిస్తున్నానన్నారు.
మరొక సంఘటన.....
ఓ వజ్రాల వ్యాపారి ఎం. రాజగోపాల్ తన భార్యతో జయకాంతన్ ఇంటికొచ్చి ఓ పెద్ద పళ్ళెంనిండా బంగారు నగలు, నగదు కానుకగా ఇవ్వాలనుకున్నారు. అయితే జయకాంతన్ ఇవన్నీ దేనికీ అన్నారు.
ఓ రచయితగా మీరు కష్టపడకూడదని ఇస్తున్నామన్నారు రాజగోపాల్.
అప్పుడు జయకాంతన్ తాను కష్టపడుతున్నట్టు ఎక్కడా ఎప్పుడూ రాయలేదని, ఎవరితనూ చెప్పుకోలేదని, కనుక తనకు అవేవీ అక్కర్లేదని స్వీకరించడానికి తిరస్కరించారు.
అయినా తామిది అభిమానంతో ప్రేమతో ఇస్తున్నామని, వీటిని కాదనక తీసుకోవాలని, మీకెప్పుడైనా తిరిగివ్వాలనిపిస్తే ఇవ్వవచ్చని, అలాగని మీరు తిరిగివ్వాలని ఇవ్వడం లేదని, ఇవి మీరు వాడుకుంటే ఆనందమని రాజగోపాల్ ఎంతో వినమ్రతతో చెప్పారు.
కానీ జయకాంతన్ ససేమిరా అనడంతో రాజగోపాల్ దంపతులు వాటిని వెనక్కు తీసుకుపోయారు. ఈ సంఘటనను జయకాంతన్ ప్రస్తావిస్తూ జీవితంలో తనకెప్పుడూ రాజగోపాల్ వద్ద చెయ్యి చాచవలసిన అవసరం కలగకపోవడం నా అదృష్టమని చెప్పుకున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి