ఆరోగ్యం మన చేతుల్లోనే..!': --సుజాత.పి.వి.ఎల్,

 ప్రతి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతో కూడుకున్న జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక ఈనాటి ప్రజలకు కొరవడింది.  డబ్బు ఎలా సంపాదించాలనే ధ్యాస తప్ప ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టట్లేదు. ఆరోగ్యం కాపాడుకోవడమే మహాభాగ్యమన్న విషయాన్ని గుర్తిస్తే..ఇన్ని కార్పోరేట్ హాస్పిటల్స్.,సందుకో దవాఖానాలు ఉండవు. ఆరోగ్యంగా ఉండటానికి  కొన్ని నియమాలను నిత్యం పాటిస్తే సరి. 
ఉదయం నిద్రలేవంగానే అర లీటర్ స్వచ్ఛమైన నీటిని సేవించాలి. 
ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు యోగాసనం లేదా వ్యాయామం చేయాలి.
వారానికి ఒక రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాస సమయంలో నీటిని, పండ్ల రసాన్ని, లేదా పండ్లను ఆహారంగా తీసుకోండి.
మనం తీసుకునే ఆహారంలో పులుపు, కారం, ఉప్పు, మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలు లేకుండా చూసుకోవడం ఉత్తమం.
మౌనంగా ఆహారాన్ని భుజించటం మేలు. తినేటప్పుడు టి.వి.చూడకపోవడం, సెల్ ఫోన్ లో మాట్లాడక పోవటం ఉత్తమం.
భోజనంలో సలాడ్, ఆయా ఋతువుల్లో లభించే పండ్లు తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి.
సమతుల ఆహారం, తేలికపాటిదై సులభంగా జీర్ణమయ్యేలా ఉంటే ఆరోగ్యానికి వరప్రసాదిని. 
నిద్ర మాత్రలతో నిద్రను కొనుక్కోకూడదు. గోరు వెచ్చని పాలు తాగి పడుకుంటే సుఖ నిద్ర పట్టడమే కాకుండా శారీరక, మానసిక విశ్రాంతికి దోహదం చేస్తుంది. రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా భుజించ కూడదు. అలాగే రాత్రుళ్ళు ఎక్కువ సమయం మేల్కొని ఉండకూడదు.
ఉదయం మాత్రమే కాదు రాత్రి పడుకునే ముందు కూడా దంతధావనం చేసుకోవాలి.
నిత్యకృత్యాలకు సమయపాలన చాలా ముఖ్యం.
బయటి ఆహార పదార్థాలకి ఎంత దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి కంచె కట్టి రక్షించుకున్నట్టు.
దుర్వ్యసనాలకు బానిస అవకపోతే దీర్ఘాయుష్యుని పొందినట్టే!
కరోనా వచ్చిన తరువాత వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లపై  అవగాహన కల్పించిందనవచ్చు. సంప్రదాయరీతులు మనలను చక్కబరచడానికే అన్నది అర్థమైంది.
మహమ్మారి కరోనా   బారిన పడకుండా మూతికి మాస్కు వేసుకుని, శానిటైజర్  వెంట తీసుకుని బయటకు వెళ్ళాలి. అప్పుడప్పడు బలంగా ఊపిరి తీసుకోవడం కోసం, ఎవరితోనైనా మాట్లాడటానికి తొలగించకూడదు. మాస్క్ ధరించని వారికి మాస్క్ యొక్క ఆవశ్యకత తెలియపరచాలి. వినని పక్షంలో వారికి దూరంగా ఉండాలి. తరచూ చేతులను శుభ్రంగా  కడుక్కోవాలి.