మణిపూసలు -బల్లి :- --ఎం.వి.ఉమాదేవి.
గోడమీద బల్లి ఉంది 
పురుగు కొరకు పొంచి ఉంది 
దగ్గరికి రాగానె, ఇక 
లటుక్కుమని మింగుతుంది 

 రెండు బల్లుల మాటలే 
విన్నార వింత సడులే 
బల్లి పడే శాస్త్రమునూ 
చదివితిర తమాషాలే 

 తలమీద పడిన కలహము 
పాదముపైన ప్రయాణము 
ఇలా చెప్పి ఉంటాయివి 
మనిషినదుపు చేయు విధము 

 బంగారు,వెండి బల్లులు 
గోడమీద తాపడాలు 
కంచిలోను ఉన్నవండి 
తాకివచ్చు నమ్మకాలు 

 మూతలేని ఆహారము 
బల్లి పడిన విషభరితము
నిజమో కాదో తెలియదు 
జుగుప్సయేను కారణము 

 ఊరికి శకునము చెప్పిన 
బల్లి కుడితి తొట్ల పడిన 
సామెతగా చెపుతుంటరు 
పెద్దమనిషి దెబ్బ తినిన !

 వేల ఏళ్ళ క్రిందటేను 
రాకాశి బల్లులుండెను 
డైనోసారు పేరుతో 
భారీ ఆకారమునను 

 జురాసిక్ పార్కు పేరును 
సినిమాగా అలరించెను 
అస్థిపంజరములున్నవి 
ఆనాటికి ఋజువుగాను 

 ఆబాలగోపాలమును 
ఉర్రూతలనూగించెను 
బల్లికూడ గొప్పదనును 
ఆసినిమా నిర్మాతను !


కామెంట్‌లు