వక్ర గీతలు ..!!:- --_డా.కె.ఎల్.వి.ప్రసాద్--హన్మ కొండ .

 నీకూ _ నాకూ 
స్నేహం ఏర్పడ్డాక ,
అది విడదీయలేని ,
బంధం అనితెలిసాక ,
నీలోని...
సాహితీపిపాసను ,
మరింతంగా ...
ప్రోత్సహించాలనుకున్నా!
సాహితీ చరిత్రలో ,
నువ్వొక 
ముఖ్యమైన పుటగా ,
మిగిలిపోవాలని ,
కలలెన్నో కన్నా ...!

కానీ ....
నావేగాన్ని 
నువ్వు తట్టుకోలేని ,
సంసారిక సుడిగుండంలో ,
చిక్కుకుపోవడం ,
నీ రచనా వ్యాసంగం ,
నత్తనడక లా సాగడం,
నాలో నిరుత్సాహాన్ని ,
నిలువునా ...
నింపేసింది ..!

అయినా ___
అపార్దాల 
అడ్డుగోడలు _
దాఁటుకుంటూ ,
మొక్కవోని దీక్షతో 
నీలో ..
సాహిత్య చైతన్యంకోసం ,
నిత్యం 
కేటలిస్టులా _
నీకోసం కష్టిస్తూనే ఉన్నా ,
నాకు తెలిసిన 
ప్రముఖులనెందరినో ,
నీకు ...
పరిచయం చేస్తూనే ఉన్నా !
అంతేకాదు ..
వాళ్లతో నీ పరిచయం ,
పచ్చగా కొనసాగుతుంటే ,
చెప్పొద్దూ ....
నాకెంత జెలసీనో ..!
అది ___
నువ్వునాకు ,
దూరమైపోతావనేమో !
నా ..జీవితంలో _
చీకట్లు సృష్టిస్తావనేమో !!