*స్ఫూర్తి*: -మంజీత కుమార్--బెంగుళూరు

 ఎవరైనా చిత్రాలు వేస్తుంటే అలా చూస్తుండిపోయేది కావ్య. తనకు కూడా పెయింటింగ్స్ వేయాలని ఆశ .. కానీ అంగవైకల్యం ఆమెకు శాపంగా మారింది.
    
    చేతులు లేకుండా పుట్టిన కావ్య, ఎవరి సాయం తీసుకోకుండా కాళ్ళతోనే అన్ని పనులు చేసేది. ఓసారి స్కూల్లో డ్రాయింగ్ పోటీ పెట్టారు. అందరూ పోటీలో పాల్గొంటుంటే తాను డ్రాయింగ్ చేయలేకపోతున్నానని కావ్య ఒంటరిగా ఏడుస్తూ క్లాసులో కూర్చుంది. అటుగా వచ్చిన వాళ్ళ కొత్త ప్రిన్సిపాల్ ఆమెను చూసి  వివరాలు అడిగారు.
     "కాళ్ళతో అన్ని పనులు  చేస్తావట, రాస్తావట కూడా.. మరి డ్రాయింగ్ ఎందుకు ప్రయత్నం చేయలేదమ్మా?" అని అడిగారు.
      "కాళ్ళతో ఎలా వేయగలను" అంటూ ఏడవసాగింది.
    
    "కళలకు చేతులు కాళ్ళు కాదు మనసు కావాలి, ఊహా శక్తి వుండాలి. నీకు ఉందని నాకు తెలుసు. పద పోటీలో పాల్గొను" అంటూ వెంట తీసుకువెళ్లారు.
  
తొలిసారిగా కాళ్ళతో రంగులను తాకి తన్మయత్వం పొందింది. పోటీలో ద్వితీయస్థానంలో నిలిచింది. "ప్రిన్సిపాల్ సర్ ఇదంతా మీ చలవే" అంటూ నమస్కరించింది.
"నీలో ఆత్మ విశ్వాసం ఉంటే అంగవైకల్యం ఒక లెక్కా? ఇకనుంచి రంగుల లోకంలో విహరించు .. బాగా అభ్యాసం చేయు ... మరోసారి ప్రథమ స్థానంలో నిలవాలి" అన్న ప్రిన్సిపాల్ మాటలకు "సరే సర్" అంటూ ఇంటికి వెళ్ళింది.
కాళ్ళతో పెయింటింగ్ చేయడం అలవర్చుకుని ఎన్నో జాతీయఅంతర్జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీలలో పాల్గొని విజేతగా నిలిచి ... స్కూలుకి ఊరికి పేరు తెచ్చింది.
ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం తోక ముడుస్తుందని కావ్య నిరూపించింది.
  ఎంతోమంది శారీరక వికలాంగులకు ఉచితంగా పెయింటింగ్స్ వేయడం నేర్పుతూ నేడు స్ఫూర్తిగా నిలుస్తోంది.