కొన్ని అవకాశాలు వస్తాయి. వాటిని అందిపుచ్చుకోవడం తెలియాలి. కొందరికే అది చేతనవును. కొందరికి అది కొరుకుడుపడదు. ఎవరెంత చెప్పినా బుర్రకెక్కదు. అదంతే. అలా వచ్చిన ఇచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వినియోగించుకోలేకపోయాను. అందుకొక ఉదాహరణే ఈ కొన్ని మాటలు....
ప్రముఖ హిప్నాటిస్ట్ కమలాకర్ గారు తిరునగరి వేదాంతసూరిగారివల్లే పరిచయమయ్యారు. రాతకోతలకోసం ఈ పరిచయం మొదలైంది. తొలి పరిచయంలోనే ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఓ చిన్నపాటి వర్క్ ఇచ్చారు. రాసిచ్చాను. అందుకు పారితోషికమూ పొందాను ఆనందంతో. కానీ అది అచ్చువేసారో లేదో తెలీలేదు.
ఆ తర్వాత ఓ ఆరేడుసార్లయినా ఆయనను ప్రత్యక్షంగా కలిసాను. ఒకటి రెండు పుస్తకాలు ఇచ్చారు రాసిపెడితే డబ్బులిస్తానని. అందుకోసం ఓ లే ఔట్ పేజీ కూడా పంపారు. పేజీకి నుటయాభై రూపాయలు ఇస్తానన్నారు. అలాగే ఓషో కథలు రాస్తానంటే రాసివ్వమన్నారు. ఓషో పుస్తకానికి సంబంధించి పేజీకి ముప్పై రూపాయల చొప్పున ఇస్తానన్నారు. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. అందుకే కారణం నాదే.
మా ఇంట అనుకోని సమస్య తలెత్తింది. మానసికంగా ఓ మూడున్నరేళ్ళు పడ్డ బాధ ఇంతా అంతా కాదు. ఈ బాధలోనూ ధైర్యంకోసం ఆయనను కలిసాను. ఆయన తనదైన శైలిలో కొన్ని మాటలు చెప్పగా ధైర్యం వచ్చింది. కానీ ఎందుకో ఆయన ఇచ్చిన పని మాత్రం ముందుకుసాగలేదు. రాయలేకపోయాను. ఆయన ఇచ్చిన పని మీద బుర్రపెట్టలేకపోయాను. ఓషో కథలూ రాయలేదు.
అదలా ఉంటే, "వార్త"లోనూ, "సాక్షి"లోనూ నేను రాసినవి అడిగితే అవి తీసుకెళ్ళి చూపించాను. వాటిని పుస్తకరూపంలో అచ్చు వేయిస్తానన్నారు. నేనతికించి ఇచ్చిన నా పుస్తకాలు ఆయన దగ్గరే ఉండిపోయాయి. అవి తెచ్చుకోవాలని అనుకుంటూనే ఎప్పటికప్పుడూ వాయిదా వేస్తూ వచ్చాను. ఇందుకు కారణం, ఆయన రాయమన్న అనువాదాలు మొదలెట్టక పోవడమే. అవేం చేశారని ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలీక వెళ్ళడం మానేసాను. ఏదైతే అదే అవుతుందనుకుని రేపోమాపో వెళ్దామనుకునేసరికి హిప్నాటిస్ట్ కన్నుమూత అనే దుర్వార్త ఈరోజు (22 - 4 - 2021) పత్రికలో చూసాను. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ గుండెపోటుతో స్థానిక ఆస్పత్రి (హైదరాబాద్) లో చికిత్స ఫలించక తుదిశ్వాస విడిచారనే వార్త చదివి బాధపడ్డాను.
ఎవరెవరికో ఏవేవో రాసిచ్చాను. అలాంటిది ఈయన అడిగినా రాయలేకపోయాను. డబ్బులిస్తానన్నా ఆయనిచ్చిన పని చేయలేదు. కమలాకర్ అనే పేరు స్ఫురణకు వచ్చినప్పుడల్లా చెయ్యలేకపోయిన ఆ వర్కే మదిలో మెదులుతుండేది.
పనికొచ్చే పనులు చెయ్యవుగా అనే మాట నా చెవిన పడుతున్నప్పుడల్లా కమలాకర్ గారు డబ్బులిస్తానని చెప్పినా రాయక డబ్బులివ్వని వాళ్ళకు రాస్తే అలాటి మాట కాక మరెలాటి మాటలు అనిపించు కుంటాను.
నన్ను క్షమిస్తుందా కమలాకర్ గారి ఆత్మ?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి