యవ్వనం లో అడుగు పెట్టె వరకూ ‘ ఉగాది ‘ గురించి తెలియలేదు . అది తెలుగువాళ్ళ కొత్తసంవత్సరాని కి ,ఆది అన్న విషయం తెలీదు . మామూలుగా ,మనకున్న అనేక పండగల్లో ,ఇదొక పండుగ ,అనుకునేవాడిని.
బహుశః ,ఇంటి నాస్తిక వాతావరణం దానికి ప్రధాన కారణం కావచ్చు !
బాల్యంలో ,హైదరాబాద్ -అన్నయ్య (స్వర్గీయ కె . కె . మీనన్ )దగ్గర ఉండడం వల్ల ,కొంత పండుగులగురించిన అవగాహన వస్తూ వచ్చింది . అయితే ,ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం తో పాటు ,సాహిత్య పరమైన ,’ కవిసమ్మేళనా లు ‘ ఎక్కువ మక్కువ ఏర్పడింది . అప్పట్లో కవి --
సమ్మేళనాలు ,ఉగాదికి -రిపబ్లిక్ -డే ,కి ఆకాశవాణి మాత్రం నిర్వహించేది .
అందుచేత దానికి ఒక ప్రత్యేకత ఉండేది . టెలివిజన్ గాని ,ఇతర అంతర్జాల
సంబంధమైన సమాచార మాధ్యమాలు లేనందున ,రేడియోకు చాలా
ప్రాముఖ్యత ఉండేది . పెద్ద -పెద్ద కనీ -వినని కవుల కవిత్వాన్నిరేడియో లో ,వినే అవకాశం ఉండేది . లైవ్ -ప్రసారాలు ఉండేవి . ఉగాదినాడు జరిగే కవిసమ్మేళనం కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూడడం అలవాటు అయిపొయింది. భవిష్యత్తులో నేను కవిత్వం రాస్తానని గాని ,కవి సమ్మేళనాలలో కవిత్వం చదూతానని గాని ఎప్పుడూ అనుకోలేదు !అయితే దీనికి అంకురార్పణ ,అన్నయ్య ఇంట్లోని వాతావరణమేనని ఈ రోజు గట్టిగా చెప్పగలను . హైదరాబాద్ లో (ముఖ్యంగా రవీంద్ర భారతి లో )ఎలాంటి
సాహిత్య ,సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా అన్నయ్య ‘ ఫ్రీ -పాస్ ‘ తెచ్చి నాకు ఇచ్చేవాడు (ఆయన ఏ . జీ . ఆఫీసులో రంజని సంస్థలో ప్రముఖ పాత్ర ,వహిస్తుండడం చేత ,ఆయనకు పాస్ -లు ,వచ్చేవి )వాటికోసం కాలి నడకన ,విజయనగర్ కాలనీ నుంచి ,రవీంద్ర భారతి వరకు నడిచి వెళ్లి -వచ్చేవాడిని . అప్పటి ఆ .. ఉత్సాహం నా చేత అలా చేయించేది .
కవిసమ్మేళణంలలో ,గొప్ప కవులను -పండితులను ,వారి కవితలను వినే అవకాశం కలిగింది . అలాంటి వారిలో -శ్రీ శ్రీ ,విశ్వనాథ సత్యన్నారాయణ ,గుంటూరు శేషేంద్ర శర్మ ,బోయిభీమన్న ,కరుణశ్రీ జంధ్యాల-పాపయ్య శాస్త్రి ,డా . సి . నారాయణ రెడ్డి ,దాశరధి ,కుందుర్తి ఆంజనేయులు ,యశోధరా రెడ్డి ,శశాంక ,శార్వరి ,ఆరుద్ర ,ముకురాల రామారెడ్డి ,రాజన్నకవి, పోతుకూచి సాంబశివరావు ,ఇలా ఎంతోమంది నాకు గుర్తున్నంత వరకూ . ఈ కవిసమ్మేళనాలకు ,డెకరేషన్ అక్కర లేకుండానే ,పండగ వాతావరణం కనిపించేది . వారి .. వారి ప్రత్యేకతకులను బట్టి ,డా . సి . నా . రే ,కుందుర్తి ,బోయి --భీమన్న ,కరుణశ్రీ ,రాజన్న కవి ,కవితల కోసం నేను ఎదురు చూసేవాడి
ని . భీమన్న గారి ‘ గుడిసెలు కాలిపోతున్నాయ్ ‘ కవిత ,ఇలాంటి కవి సమ్మేళనం లో విన్నదే . సి . నా . రే -కవిత్వమూ ,చదివే విధానమూ చాలా వినసొంపుగా ఉండేవి . వచన కవితా పితామహుడు కుందుర్తి గారి
కవిత్వమూ, చదివే విధానము ,ప్రత్యేకతను కలిగి ఉండేది . రాజన్న కవి
పద్యం కడు పసందుగా ఉండేది . శ్రీమతి యశోదారారెడ్డి కవిత్వం పూర్తి
తెలంగాణా మాండలీకం లోవుండి ,శ్రోతలను అమితంగా ఆకర్షించేది .
ఎంత సేపు అయినా విసుగు వచ్చేది కాదు .
ఇప్పుడు ,ఇన్ని ప్రసారమాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక ,వాట్స్ ఆప్ ,గ్రూపులు కుక్కగొడుగుల్లా లెక్కకు మించి వచ్చాక ,కవిత్వమూ -కవి సమ్మేళనాల విలువ పడిపోయినట్టు అనిపిస్తుంది నాకు . బహుశః అంత మంచి కార్యక్రమాలు చూసిన తర్వాత ,ఇప్పుడు- ఆ తరం వారికి అలానే అని పిస్తుందేమో !దానికి నేను అతీతుడిని కాదు కదా !!
అందరికీ
ఫ్లవ -నామ సంవత్సర
ఉగాది (2021)
శుభాకాంక్షలు !
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి