"సమ్మెట ఉమాదేవి కథానికలు" : జ్యోతి . పి

 "సమ్మెట ఉమాదేవి కథానికలు" అనే ఈ సంకలనంలో రచయిత్రి రాసిన 14 కధానికలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ పత్రికలలో 
 ప్రచురించబడిన కథలు. రచయిత్రి  తన స్వీయానుభవాల ఆధారంగా చాలా వరకు కథావస్తువును ఎంచుకున్నట్లు అర్ధం అవుతుంది. మనుష్యుల పట్ల మానవ సంబంధాల పట్ల వీరికి చాలా నమ్మకం ఉందని, ప్రతికూల పరిస్థితులలో కూడా మానవత్వపు పరిమళాలను వెతుక్కుంటారని అనిపించింది కొన్ని కథలు చదువుతుంటే. బహుశా అధ్యాపకులకిది సహజ లక్షణం ఎమో.
సంపుటిలో మొదటి కథ "తడి" నీటి కరువు మానవ సంబంధాలను ఎలా కలుషితం చేస్తున్నది చెబుతూ ప్రధాన పాత్ర చంద్రం ద్వారా అతి మానవీయ కోణాన్ని, మానవత్వాన్ని చూపే ప్రయత్నం చెసారు రచయిత్రి. నీళ్ల కొరత కారణంగా మనుష్యులు స్వార్ధంతో ప్రవర్తించడం, మంచితనాన్ని మరచిపోవడం చూసి బాధపడే చంద్రం, భార్య నగలను తాకట్టు పెట్టీ బోరు తవ్వించి ఆ నీరు దొంగలించే వారిని కూడా క్షమించి కావలసిన నీరు తీసుకెళ్ళండి అని చెప్పడం నిజంగా చాలా గొప్ప మానవీయ కోణం. చాలా బాగా వచ్చిన కథ ఇది. "వెన్నెల  లోగిలి" లో హిందూ ముస్లిం కుటుంబాల మధ్య ప్రేమను బాగా పండించారు. హైదరాబాదు లాంటి నగరాలలో ప్రస్తుతం ఇలాంటి కుటుంబాలు ఇంత సఖ్యతగా ఉంటున్నాయా అన్నది మాత్రం ప్రశ్నే..
"నీ వాకిట తులసినోయూ.." అనే కథలో ఒక సైనికునిభార్యతో మరో స్త్రీ చేసిన ఫేస్బుక్ స్నేహం, ఇద్దరు స్త్రీల మధ్య ఏర్పడిన స్నెహబంధం, భర్త సైనికునిగా దేశ సరిహద్దులలో పని చేస్తూ ఉంటే ఆ భార్య పడే ఒంటరితనంలో మానసికంగా ఓదార్పుని ఇచ్చే ఒక మంచి ఫేస్బుక్ స్నేహితురాలు కనిపిస్తారు. "జీవన హేల" కథలో తమ ఇంట అద్దెకు దిగిన కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకున్న ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ ఇంటి ఆడపిల్ల మృత్యు ముఖంలో ఉంటే కదలిపోయి ఆ అమ్మాయికోసం తల్లడిల్లుతున్న ఒక తల్లి మనసు కనిపిస్తుంది. అద్దె ఇళ్ళల్లో ఇప్పుడు ఇలాంటి ప్రేమలు ఉన్నాయా అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే. ఈ కథలన్ని నా చిన్నప్పటి రోజులను గుర్తుకు తీసుకువచ్చాయి. కాని ప్రస్తుతం ఇటువంటీ స్వచ్చమైన ప్రేమలు, అనుబంధాలు తగ్గిపోయాయన్నది నా అభిప్రాయం. అయినా కథలుగా ఇవి చదువుతుంటే గడిచిన బాల్యపు రోజులు తిరిగి వచ్చిన అనుభూతి పొందుతాం. 
"పంచుకునేందుకు" అనే కథలో జర్మనీ దేశంలో బిడ్డ ప్రసవ సమయంలో అక్కడి పరిస్థితులను గమనించిన రచయిత్రి కనిపిస్తారు. ఇండియా నుండి బిడ్డ కోసం జర్మనీ వెళ్ళి అక్కడి పరిస్థితులకు కొంత ఆశ్చర్యం కొంత అబ్బురం చూపెడుతూ ఒంటరిగా డెలివరీ కోసం చేరిన ఒక స్వీడిష్ అమ్మాయి అవస్థ చెప్పే ప్రయత్నం చేసారు రచయిత్రి. పక్కన పెద్దవారు లేక ఆ జంట పడే బాధ. తెలిసీ తెలియని తనంతో పుట్టిన బిడ్డ అనారోగ్యం పాలు అవడం కథావస్తువు. అయితే అంత పెద్ద ఆసుపత్రిలో అక్కడి నర్సులు ఇలాంటి తప్పిదం ఎలా జరగనిచ్చారు అన్నది అర్ధం కాలేదు. ఇది రచయిత్రి స్వీయానుభవం అనిపించింది. 
"చర్విత చర్వణం" అనే కథ నాకు ఈ సంపుటిలో బాగా నచ్చిన కథ. ఒక ఒంటరి మహిళ జీవితాన్నిచాలా నిజాయితీతో చర్చించారు రచయిత్రి. ఎంతో మారిందనుకుంటున్న ప్రస్తుత సమాజం కూడా ఒంటరి మహిళను చూసే దృష్టికోణంలో పెద్ద మార్పు రాలేదు. సహాయం పేరుతో ఎంత మంది ఆమెను మానసిక హింసకు గురి చేస్తున్నారో, ఎంత బాధను ఒక ఒంటరి మహిళ అనుభవించవలసి వస్తుందో చాలా బాగా చెప్పారు ఈ కథలో. ముఖ్యంగా అర్ధికపరమైన కష్టాలు, దాని ద్వారా భరించవలసిన కొన్ని విషయాలు స్త్రీ మనసును ఎంత గాయపరుస్తాయో ఈ కథలో చూడవచ్చు. 
తాగుబోతు తండ్రిని మార్చే ప్రయత్నం చేసిన ఒక పద్నాలుగు సంవత్సరాల బాలిక కథ "పితృదేవోభవ' ఇది కొంచెం ఎక్కువ మోతాదు ఆదర్శవాదంతో రాసిన కథలా అనిపించింది. ఒక చిన్న పాప అంత మెచ్యూరిటితో సమస్యను డీల్ చేయగలదా అన్న విషయం పట్ల కొన్ని అనుమానాలున్నాయి నాకు. "నా కంటి నీటీ ముత్యమా.." అనే కథలో పాతబడిన సంసారంలో చప్పబడుతున్న అనురాగాలు, కమ్యూనికేషన్ అవసరం మర్చిపోతున్న భార్యాభర్తల పేలవమైన జీవితాలలో మార్పు కోసం ఏం చేయవచ్చో చెప్తారు రచయిత్రి. ఈ కథనం బావుంది. 
"ఓ అబ్బాయి పెళ్ళి కథ" లో రచయిత్రి సమస్యను చర్చించిన కోణం బావుంది. నిజంగా సింపుల్ గా, బాధ్యతగా ఉండే మగపిల్లవాన్ని పెళ్ళి చేసుకోవడానికి ఆడపిల్లలు ప్రస్తుతం ముందుకు రావట్లేదన్నది నిజం. విదేశాలకు వెళ్ళకుండా కుటుంబంతో ఉంటానన్న పిల్లవానికి పిల్ల దొరకడం చాలా కష్టం. ఆడపిల్లల తల్లీ తండ్రులే కుటుంబంలోకి పిల్లనివ్వడానికి సిద్దంగా లేరు. పెళ్ళి సంప్రదాయ పద్దతిలో జరగాలి, భార్యా భర్తలు ఏ అమెరికానో ఇంగ్లండో వెళ్ళీపోవాలి అది ప్రస్తుత రెక్వైర్మెంట్. దీనికి భిన్నంగా జీవించే వారే తక్కువ, ఉన్న ఒకరిద్దరినీ చవటలుగా చిత్రీకరిస్తుంది సమాజం. అలాంటి ఒక అబ్బాయి తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే కథ ఇది. 
"బురద" అనే కథలో ఒక రేప్ విక్టీమ్ ను తెలివిగా రక్షించిన ఒక స్త్రీ కనిపిస్తుంది. కొంత నాటకీయ ఫక్కీలో ఉన్నా కథనం బావుంది. "అంతా ప్రశాంతం" ఎన్నికల నేపద్యంలో రాసిన కథ. ఎన్నికల డ్యూటిలో అధ్యాపకుల కష్టాలు చూపిస్తూ ఒక తల్లి చేత బలవంతంగా ఓటు వేయించిన విషాద సంఘటనను చూపిస్తూ ఓటు వెనుక ఎంత క్రూరత్వం ఉండే అవకాశాలు ఉన్నాయో చెప్పిన కథ ఇది. ఆక్సిడెంట్ లో చనిపోయిన కొడుకు పేర దొంగ ఓటు వేస్తుంటే మౌనంగా ఉండవలసిన నిస్సహాయ తల్లి కథ ఇది. కాని ఇది ఎలా సాధ్యం అనిపించింది. హాస్పిటల్ నుండి ఆ తల్లిని ఓటు కోసం తీసుకువెళ్లారా? అలా చేయవచ్చా అన్నది నాకున్న మరో ప్రశ్న. 
"హృదయమనే కోవెలలో" చాలా సినిమాటిక్ గా నడిచే కథ. రచయిత్రీ ఊహా కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్నట్లనిపించింది ఈ కథ చదువుతుంటే."నిన్ను నిన్నుగా ప్రేమించుటకు" ఈ సంపుటిలో ఉన్న  మరో చక్కని కథ. తన గోంతుతో అందర్ని భయపెట్టి అరచి సాధించుకునే ఒక స్త్రీ మనసును చూపించిన కథ ఇది. నాకు బాగా నచ్చిన కథ. "ప్రవాహం" కథ చిద్రమవుతున్న ఉమ్మడి కుటుంబాల నేపద్యంలో రాసినది. చాలా చిన్న సంఘటనలే కుటుంబాలను ఎలా చిద్రం చేస్త్గాయి, ఆ చిన్న సంఘటనలను సరిగ్గా బాలెన్స్ చేయలేనప్పుడు జరిగే ప్రమాదాలను సూచించిన కథ.
రచయిత్రికి భాష మీద మంచి పట్టు ఉన్నది అన్నది నిజం. అన్ని కథలలో ఆమె ఒక ఆదర్శవాదిగా కనిపిస్తారు. స్వచ్చమైన ప్రేమ, సహజమైన నవ్వులు, ఆమె ప్రతి ఒక్కరి నుండి ఆశిస్తారు కాబోలు. ప్రతి కథలో ఈ వెతుకులాటె కనిపిస్తుంది. చదివించే శైలి ఆవిడ సొంతం. ఇవి గొప్ప కధలు అని చెప్పలేను కాని ప్రేమను పంచే కథలు ఇవి. ప్రపంచం అంతా స్నేహ పరిమళాలు, నమ్మకాలు పరుచుకుని ఉండాలని బలంగా కోరుకుంటున్న రచయిత్రి మనసు అర్ధం అవుతుంది ఈ కథల ద్వారా.