నానమ్మ కొంగు ....!!:- -------శ్యామ్ కుమార్ నిజామాబాద్.

 నాటి,పల్లెటూరు-బోనగిరిలో,మా నాన్నమ్మ మా బాబాయి మధ్య పెరిగాను  .
 నేను రెండు సంవత్సరాల వయస్సు నుంచి పదవ తరగతి పాస్ అయ్యే వరకు అక్కడే ఉన్నాను. ప్రతి విషయంలో  నన్ను మా నానమ్మ చూసుకునేది. మా నానమ్మది , చాలా ఉన్నతమైన విశిష్టమైన వ్యక్తిత్వం. నాకు నాలుగేళ్ళ వయసులో మా తాతగారు పరమపదించారు. 
  హోనాపూర్, సంఘం ,అనే ఊర్లో ,మా తాత గారికి నూరు ఎకరాలకు పైగా  మాగాణి ఉండేది. కొన్ని  పరిస్థితుల వలన మరియు, దురదృష్టకరమైన సంఘటన వలన అవన్నీ నేను పుట్టే సమయానికి  లేకుండా పోయాయి.  భోగ భాగ్యాలతో బంగారు నగలతో తుల తూగిన మా నానమ్మ ఆ తర్వాత కాలంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది.అయితే తను ఏనాడు బాధ పడినట్టుగా కానీ కష్టాలు పడుతున్నట్లుగా కానీ కనిపించలేదు ఎప్పుడూ మంచి నవ్వుతో కళకళలాడుతూ  తృప్తిగా ఉండేది.

 మా నానమ్మ మొలలో ఒక సంచి ఉండేది. అందులో అన్ని డబ్బులు పెట్టుకునేది. తనకు పెన్షన్ కూడా వచ్చేది.  నాకు ఏది కావలసి వచ్చినా నేను ఎప్పుడు అడిగినా ఆ సంచి లోంచి తీసి ఇచ్చేది .  తెల్లని మేని ఛాయ, నెరిసిన జుట్టు మడి చీర కట్టుకుని ఉండేది.  అందరి ఇళ్లకు వెళ్ళేది ,స్నేహంగా ఉండేది, కానీ ఏమీ పుచ్చుకునేది కాదు. కనీసం కాఫీ కూడా తీసుకునేది కాదు .స్నేహంగా ఉండేది కానీ కట్టుబాట్లు కట్టుబాట్లే.  ఎక్కడికి వెళ్ళినా నేను వెంటే వెళ్లేవాణ్ణి. స్నేహితుల ఇళ్లల్లో తినడానికి నాకు ఇస్తే కూర్చునేవాడిని లేదంటే కాసేపటికి  నాకు బోర్ కొట్టి   ఇంక వెళ్ళిపోదాం అని పిలిచేవాడిని , సతాయించే  వాడిని.
మా ఊర్లో సంవత్సరానికి ఒకసారి జాతర జరిగేది, ఆ జాతరకు  నాకు తోడు మా నానమ్మ. మా బాబాయిల కు  వివాహం అయిన తర్వాత మా ఇంట్లో ముగ్గురు కోడల్లుఉండేవాళ్ళు. మా అమ్మ  తమ్ముళ్లను, చెల్లెల్ని తీసుకొని అప్పుడప్పుడూ వచ్చి  కొద్ది రోజులు ఉండి వెళ్ళేది.  బాబాయిలు వేరే ఊర్లో చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ వారానికోసారి వచ్చి వెళుతుండేవారు. ఇంటి బాధ్యత అంతా మా నానమ్మ ది. ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ఇంటి బాధ్యత  నెరవేర్చేది.
 ఇక్కడ గమ్మత్తైన విషయం గుర్తుంది నాకు. ఎవరన్నా బయటి వారు ఇంటికి వస్తే వారికి కాఫీలో గాని టీలో కాని చక్కెర వేసేవారు. ఇంట్లో మాకు అందరికీ బెల్లం కాఫీ ,బెల్లం టీ మాత్రమే.         కెటిల్ ల్లో ఎప్పుడూ కాఫీ గానీ టీ గాని రెడీగా ఉండేది. అది  ఎప్పుడూ, ఆరిపోతున్న పొట్టు పొయ్యి మీద ఉంచి  వేసేవారు.  ఎవరూ  చూడకుండా మెల్లిగా నేను దొంగ లాగా  వెళ్లి  దాన్ని తీసుకొని  పైకి లేపి నోట్లో పోసుకుని  తాగే   వాణ్ని. ఎంతో రుచిగా హాయిగా ఉండేది తాగుతుంటే. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే   ఒకసారి వాడిన టీ పొడి ని మళ్లీ నీళ్లలో వేసి డికాషన్ చేసి పని మనిషికి ఇచ్చేది. కొన్నిసార్లు  కోడళ్లకు  కూడా అదే ఇచ్చేది. వీలు కుదిరినప్పుడల్లా సమయం ఉన్నప్పుడల్లా లేదా ప్రతిరోజు రాత్రి  పక్క న పడుకున్నప్పుడు నాకు మహాభారత, రామాయణ కథలు చాలా విశదీకరించి చెప్పేవారు.  ఎంత విపులంగా చెప్పారు  అంటే,ప్రస్తుతం ఎన్ని పుస్తకాలు చదివినా కూడా నాకు తెలియని రామాయణ మహాభారత కథలు లేవు.  1915 వ సంవత్సరంలో తాను పుట్టాను అని చెప్పేవారు. ఆ రోజుల్లో ఎంత వరకూ చదివారో తెలియదు కానీ తాను హిందీ కన్నడ తెలుగు పుస్తకాలు విరివిగా చదివేవారు.  పండగలకు నేను కోరిన వంటలు చేసే  వారు మా నానమ్మ. అవి పూర్తి అయ్యే వరకు నేను వంటింట్లో తన పక్కనే కూర్చునేవాడిని. వంటలో సాయం చేసే వాడిని అందుకే నాకు వంటలు-పిండివంటలు అన్ని వచ్చు. పరీక్షల సమయంలో ఉదయాన్నే నాలుగు గంటలకు అలారం పెట్టి నన్ను నిద్ర లేపే వారు.  మా  బంధువుల ఇంట్లో అన్ని శుభకార్యాలకు పెళ్లిళ్లకు  , ఇంకా అన్ని రకాల కార్యాలకు మా నాన్నమ్మ నన్ను వెంటబెట్టుకుని వెళ్లేవారు, అందుకని మా బంధువులతో నాకు ఇప్పటికీ విడదీయరాని బంధం ఉంది. అలా వెళ్ళిన దగ్గర  ఉండే మా అక్కలు చెల్లెల్లు అన్నలు తమ్ములు అందరి తోటి హాయిగా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపి వచ్చేవాడిని. మొహం  కడుక్కున్నాక తుడుచుకోవాలి అన్నా, అన్నం తిన్నాక చేయ కడుక్కున్నాక  తుడుచు కోవాలన్నా మా నాన్నమ్మ కొంగే నాకిష్టం, తువ్వాలు గానీ తుండుగుడ్డ గాని వాడే వాన్నే కాదు.  ఎవరైనా బంధుమిత్రులు స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నమ్మ తన ముగ్గురు   కోడళ్ళను   కూర్చోబెట్టి పాటలు పాడించేది . ఆ ముగ్గురి లో ఒకరికి  శాస్త్రీయ సంగీతం లో సర్టిఫికేట్ ఉండేది.  వారు పాడుతుంటే చూసి మా నాన్నమ్మ తెగ మురిసిపోయేది. నేను ఎన్ని అల్లర్లు చేసినా ఎంత  మొండితనం చేసినా ఎవరూ ఏమీ అనక పోయేవారు ,దానికి కారణం మా నానమ్మ అంటే భయం. చాలా  క్రమశిక్షణ తో సాంప్రదాయ పద్దతిలో అందరినీ కట్టుబాటు తో  నడిపించారు.
 నాకు  పుట్టబోయే కొడుకుని  అంటే ముని  మనుమడిని  చూడాలని ఒక నెల ముందు నిజామాబాద్  కు వచ్చి ,  ఆ కోరిక తీరకుండానే  పక్షం రోజులకు ముందే నా  రెండు చేతులలో పడుకొని స్వర్గస్తులయ్యారు. కళ్ళముందే ప్రాణాలు పోతుంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూశాను. నాకు జీవితంలో ఉండే తియ్యదనం  సగం  మా నానమ్మ తో టే పోయింది. బాల్యంలో అనుభవించిన ఆనందం అంతా మా నాన్నమ్మ గుర్తు రాగానే ఎటో పోతుంది.  మా నాన్నమ్మ  తోనే నా బాల్యం కూడా పోయింది.  నాకు ఇష్టమైన అమ్మాయి ని పెళ్లి చేసుకోవడానికి ముందుగా అంగీకరించి మా ఇంట్లో  అందరినీ ఒప్పించింది మా   నానమ్మ మాత్రమే,లేకుంటే మా వివాహానికి ఎవరూ ఒప్పుకునే వారే కాదు. ఇప్పటి కీ నేను, నా భార్య ప్రశ్నలు వేసుకుంటాం అసలు ఆవిడ ఎందుకు ఒప్పుకుంది అని.  మా 35 సంవత్సరాల  వివాహ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకటి అర్థం అవుతుంది, బహుశా మా  నానమ్మ కి తెలిసే ఉంటుంది ,మేము ఇద్దరం   ఒకరికొకరం సరిగ్గా  కుదురు తామని  హాయిగా సంసార జీవితాన్ని కొనసాగిస్తామని,  అందుకే మాకు వివాహం చేసింది.