*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౦౩ - 03)
 శార్దూలము :
*అంతా మిధ్య తలంచిచూచిన నరుం | డట్లౌటెరింగిన్ సదా*
*కాంతల్పుత్రులు నర్ధముల్ తనువు ని | క్కంబంచు మోహార్ణవ*
*భ్రాంతింజెంది చరించుగాని, పరమా | ర్ధంబైన నీయందు దా*
*చింతాకంతయు చింతనిల్పడు కదా | శ్రీకాళహస్తీశ్వరా* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
మేము, నీవు ఇచ్చిన ఈ శరీరము, డబ్బు, భార్య, సంతానము ఇవే శాశ్వతము అనుకుని, వాటి మీద మమకారం పెంచుకుని, వాటి వెంటే పరుగెత్తు తున్నాము.  నిన్ను తలచుకుని, ఒక్క క్షణము మేము ఆలోచించి చూస్తే ఇవి అన్నీ కూడా నశించేవే అని అర్ధం అవుతుంది. కానీ, శాశ్వతమైన ముక్తిని ఇచ్చే నిన్ను గుర్తు వుంచుకోడానికి, అతి చిన్నదైన చింతాకు  అంత ప్రయత్నం కూడా మేము చేయడం లేదు.... అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*పరమాణు రూపా పరాత్పరా, నశ్యంకరా,  నీ మాయా కల్పితాలై, నశ్వరాలైన దేహ, ధన, దారా సుతులు నిత్యలు, సత్యము అనుకుని, నీవే కల్పించిన మోహంలో పడి కొట్టుకు పోతున్నాము.  మన్మధ రూపంలో వున్న కామ, క్రోధ, మద, మత్సర్యాలను రూపు మాపిన నీవు, మాలోని మత్సరాలను తొలగించలేవా, స్వామీ.  నిన్నే నమ్మి వున్న వారము. నీ వారము. ఆదుకో, కరుణాకరా...... మార్కండేయ రక్షకా!*..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss