*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౦౭ - 07)

 మత్తేభము :
*దివిజక్ష్మారుహ ధేనురత్న ఘనభూ | తిన్ ప్రస్ఫురద్రత్న సా*
*నువు నీవిల్లు, నిధీశ్వరుండు సఖు, ఁడ | ర్ణోరాశి కన్యావిభుం*
*డు విశేషార్చకుఁడింక  నీకెన ఘనుం | డున్ గల్గునే నీవు చూ*
*చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
ఎన్నో కోరినన్ని సంపదలను ఇచ్చే కల్పవృక్షం, కామధేనువు, చింతామణి వున్నటువంటి మేరు పర్వతము నీకు విల్లుగా వుంది.  అన్ని సంపదలకు రాజుగా వున్న కుబేరుడు నీకు స్నేహితుడు. సముద్రుడికి కూతురు అయిన లక్ష్మీ దేవి భర్త నీకు అత్యంత ప్రియమైన భక్తుడు. ఇంత గొప్ప వాడివైన నీవే నన్ను, నా లేని తనం గురించి ఆలోచించక పోతే ఇంకెవరు ఆలోచిస్తారు, నీలకంఠా!....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ఎల్లప్పుడూ భక్తుల కోరికలు తీర్చడానికి ముందు వుండే శ్రీ మహావిష్ణువు నీకు పరమ భక్తుడు.  వివాహం చేసుకోవడానికి, శ్రీ నివాసునికే అప్పు ఇచ్చిన కుబేరుడు నీ ఆప్త మిత్రుడు. ఇన్ని ఎందుకు చంద్రకళాధరా! దేవతలకే వరాలొసగే కల్పవృక్షం, కామధేనువు కొలువున్న మేరు పర్వతం నీ విల్లగా వుంది. ఇంతటి సౌభాగ్యం నీ వద్ద వుంచుకుని కూడా, మా లోని చంచలత్వాన్ని, దౌర్బల్యాన్ని పోగుట్టకుండా,ఇంకా ఆలోచిస్తన్నావు స్వామీ.  నిన్నే నమ్మి వున్నాము కదా, గంగాధరా! దారీ తెన్నూ తెలియక నీ మాయలో పడి కొట్టుకు పోతున్నాము, చేయి అందించి, నీ దగ్గరకు చేరే దారి చూపించు, అర్ధనారీశ్వరా!*..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss