*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౦౯ - 09)
 శార్దూలము :
*ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం | బంచు న్మహాబంధనం*
*బేలా నామెడ గట్టినాడ విక ని | న్నే వేళ జింతింతు, ని*
*ర్మూలంబైన మనంబులో నెగడు దు | ర్మోహాబ్ధిలో గ్రుంకి యీ*
*శీలామాలపు జింత నెట్లుడిపెదో | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
కాత్యాయనీపతీ, భార్య, పిల్లలు, డబ్బు సంపాదన, కోరిక, కోపం అనే ఇన్ని బంధనాలు నాకు నీవే ఇచ్చావు కదా, స్వామీ!  ఇంక నీ పేరు తలచే అవకాశం లేకుండా చేసావు కదా, మల్లికార్జున.  మనసంతా నిండుగా పేరుకుపోయిన ఈ సుఖాల చుట్టూ తిరుగుతూ, నీవే సృష్టించిన నీ మాయలో కొట్టుకుపోతున్న నేను నీ గురించి ఎలా పలుక గలుగుతాను, దేవా.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ఈ మాయా ప్రపంచంలో మాకు ఇబ్బడి ముబ్బడిగా భవ బంధాలను కలుగజేసింది నీవే కదా, కందర్పజనకా!  మరి, నీ మాయలో వూగి తూగుతూ, నాలో వున్న నిన్ను పూర్తిగా మరచిపోయాను. ఇప్పుడు నాకు ఏది దిక్కు.  నీ స్పురణ, నీవే కలిగించి, ఎల్లవేళలా నిన్ను మరవక, నీతోనే వుండేటట్లు, నీవే అనుగ్రహించాలి, తండ్రీ.  నీవే మా తప్పిదాలను కాయాలి. "అన్యధా శరణం నాస్తి. త్వమేవ శరణం మమ." నీవు, నీవు మాత్రమే మాకు దిక్కు అని నమ్మి వున్నాము, పరేశా!*..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss