*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౧౦౦ - 100)

 కందము :
*కందర్పకోటి సుందర*
*మందరధర నామతేజ | మధుసూదన యో*
*సుందరవిగ్రహ మునిగణ*
*వందిత మిము దలఁతు భక్త | వత్సల కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
కృష్ణా! నీవు కోటి మంది మన్మధుల అందమైన రూపానికి సరితూగే అందము సొతము చేసుకున్న వాడివి.  మందరము అను పర్వతమును ఎత్తిన వాడవిగా పిలువబడుతున్నావు. మధువనే రాక్షసుని చంపిన వాడవు.  అతి సుందరమైన రూపము కలిగి మునులు, యక్షులు, కిన్నెరుల చేత పూజింపబడిన వాడవు.  భక్తులు నీమీద చూపే ప్రేమకు లొంగి వుంటావు. అటువంటి నిన్ను  తలచుకుంటూ నమ్మి వున్నాను, దేవదేవా! .....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*కస్తూరి తిలకము దిద్ది, కౌస్తభ భూషితుడవై వున్న నీ ముందు, కోటి మంది మన్మధులు అయినా దిగదుడుపే. ప్రపంచానికి వెలుగును ఇచ్చే ఆదిత్యుడు కూడా నీవెలుగు ముందు నిస్తేజమే. అంతటా నీవే. అన్నీ నీవే అయివున్న నిన్నే నమ్మి వున్నాను దైత్యహారి.  మాలోనే వుండి, మమ్మల్ని తప్పుదారి లోకి నడిపించే ప్రయత్నం చేసే మా లోని దుష్ట శక్తలను మా నుంచి తొలగించి, నీ మీద మా నమ్మకం ఎప్పుడూ సడలకుండా చేసి, భక్తసులభుడవు అయిన నీవు మమ్మల్ని కాపాడి కడతేర్చి, నీ సన్నిధికి చేర్చుకో తండ్రీ.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss