మిద్దెతోట పరిచయం!--(ఆరవ ప్రచార సంవత్సరం- 1312 వ రోజు!)-'మిద్దెతోటలు- చిన్న పిల్లలు':-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 మనవరాలు ఆద్య క్రమంగా మిద్దెతోటలోకి వస్తోంది.
తోటలో ఉన్న రకరకాల పువ్వులను రకానికి ఒకటి చొప్పున తెంపుకుంటుంది.అలా తెంపుకోవడంలో తోట అంతా తిరుగుతుంది. ఆ పువ్వుల పేర్లు ఏమిటి అని అడుగుతూ ఉంటుంది.
మొన్న ఒకరోజు అలాగే తిరుగుతూ చూస్తూ ,ఒక ఆకుకూర మడి దగ్గర ఆగి " ఇది నేను పెట్టిందే కద తాతయ్య " అంది.
నాకూ జ్ఞాపకం వచ్చింది.
ఓ రెండు సంవత్సరాల క్రితం అయుండాలి, నేను పొన్నగంటి ఆకుకూర కాడలను నాటుతూ ఉంటే ,తను వచ్చి 'నేను కూడా నాటుతాను' అని కొన్ని కాడలను మట్టిలో నాటింది! అది తనకు జ్ఞాపకం ఉంది.
నేనే మరిచిపొయ్యాను. 
ఆద్య వయసు అయిదు గడిచి మొన్న ఆరులోకి‌ ప్రవేశించాయి.అంటే నాలుగు సంవత్సరాల వయసులో నాటిన మొక్కల గురించి జ్ఞాపకాలు ఉన్నాయి. మొక్కల మాదిరిగానే జ్ఞాపకాలు కూడా చివుళ్లు తొడుగుతాయి.
మా అమ్మాయి అనే కాదు,ఏ పిల్లలు అయినా అవకాశాలు కల్పిస్తే ,ఇలాగే పరిజ్ఞానాన్ని పొందుతారు. ప్రకృతికి సకల జీవులకు ఉన్న సంబంధం క్రమంగా పిల్లలకు అర్థం అవుతుంది. 
తగిన వాతావరణం సృష్టించడం పెద్దల పని- అందులోంచి పిల్లలు ఎన్నో నేర్చుకుంటారు. ఇలా చేస్తే , అలా వస్తుంది అని! మనం అనుభవిస్తున్న ఫలితాలు అన్ని కూడా ఓ క్రమపద్ధతిలో రూపొందుతూ ఉంటాయి అని.
కృషి గురించి తెలుస్తుంది. కృషి ఉంటేనే కద ,మనిషి రుషి అయ్యేది.రుషి అంటే జ్ఞాని అని.
పెద్దలు తప్పకుండా మిద్దెతోటల నిర్మాణం చెయ్యాలి, పిల్లల సవ్యమైన ఎదుగుదలకు సహకారం అందించాలి!