మన భాష తెలుగు తెలుసుకుంటే వెలుగు తెలుగు ఒడిలో...6--మందారపూవు:-వ్యాసకర్త:-రాజావాసిరెడ్డిమల్లీశ్వరి

 భక్తజన మందారమా, దీనజనమందారమా, 
“మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు బోవునే మదనములకు” – (పోతన) – అంటూ
మందారం అనేపదం ఎన్నోచోట్ల వాడబడింది. మందారం అనే పదం శ్రేష్ఠ వాచకంగా  వాడబడటం మనకు తెలుసు.
 అందమైన అమ్మాయి ని ముద్దమందారంలా ఉంది అని అంటారు. సిగ్గుపడే అమ్మాయి గురించి చెప్తూ ఎఱ్ఱమందారంలా ఉంది అంటారు. చూశారా మందారం అనేమాట ఎంత గొప్పగా వాడబడిందో. 
రేక మందారం, ముద్దమందారం, జూకా మందారం, పత్తి మందారం, పంచముఖ మందారం, మిరప మందారం ...ఇలా పలు రకాల మందారాలు ఉన్నాయి. 
మందారం అనే పదానికి – ఒక కల్ప వృక్షము, మేఘ వర్ణము, జిల్లేడు, బూడిదము అనే అర్థాలున్నాయి.  చూడగానే చూపరులను ఆకట్టుకునే మందారం మాలో అనే కుటుంబానికి చెందినా హైబిస్కస్ అని పిలువబడుతూ కోవిదార, కాంచనము, దాసాన – అంటూ రకరకాలుగా ఉంటుంది. ఎరుపు, తెలుపు,  పసుపు మొదలైన రంగులలో ఉండే మందారాల రకాలు వందల్లోనే ఉన్నాయట. 
చెట్టుకున్నా, చెట్టు నుండి కోసినా ఎన్నో గంటల సమయం వాడకుండా నిండుగా కళకళలాడుతూ ఉండే మందార పుష్పం సంపూర్ణ పుష్పానికి నిదర్శనంగా చెప్తారు పరిశీలకులు.
 వినాయకుడికి, విష్ణువుకి, సూర్యుడికి, కాళికకు, సరస్వతీదేవికి మందారపూవులంటే చాలా ఇష్టమట. అందుకే ఆయా దేవుళ్ళ, దేవతల పూజలలో ఈ పూలను ప్రత్యేకించి వాడతారు.
 
తోటలలో ఇండి పెరళ్ళలో పెంచబడుతూ కనువిందు చేసే ఈ మందారపూవే కాదు, మందార ఆకులు కూడా కళాత్మకంగా ఉంటాయి. అందుకే చిన్న చిన్న మందార ఆకుల్ని పిల్లలు తమ అరచేతిలో ఉంచుకుని దాని మీద గోరింటాకు పెట్టుకుని ఆనందిస్తారు. పిల్లలకు గోరింటాకు పెడుతూ – మందారం లాంటి మంచి మొగుడొస్తాడు – అంటూ పరాచికాలాడతారు పెద్దవాళ్ళు. ఈ విషయం అందరికీ తెల్సిందే కదా...
ఉష్ణమండల ప్రాంతంలో పెరిగే మందారం వివిధ రకాలలో ఉండే మందారాలు, వాటిరే మకులు (ముఖ్యంగా జూకామందారం పూరేకులు) ముచ్చట గొలుపుతాయి. అబ్బురపరుస్తాయి. ఈ రేకులు, ఆకులు రకరకాల ఆకారాలలో ఉండి వాటి గురించిన విశేషాలను తెలుసుకోటానికి దోహదపడతాయి. 
మందార చెట్టు వేళ్ళు, బెరడు, పూలు, ఆకులు అన్నీ ఔషధాలుగా పని చేస్తాయి. అది ఉదరకోశ, జీర్ణకోశ, చర్మ, మూత్ర వ్యాధులను నయం చేస్తాయి. అతిసార వ్యాధిని నిరోధిస్తాయి. కురుపులు, పుండ్లు మొదలైన వాటిని తగ్గించటానికే కాక మరెన్నిటినో నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి ఉపయోగపడతాయి. 
ఇతర దేశాలైన దక్షిణ కొరియా, మలేషియా వంటి దేశాలలో జాతీయ పుష్పంగా ఉన్న ఈ మందార పూవు, మందార ఆకులు మొదలైనవి సౌందర్య పోషకాలుగా ఉపయోగపడతాయి. కేశపోషణలో వీటి స్థానం ఎన్నదగినది. 
చూశారా! మందారపూవుకెంత చరిత్ర ఉందో. 
" దారం కాని దారం – మందారం "– వంటి పొడుపు కథలున్నాయి. 
దేవేంద్రుని నందనోద్యానవనంలో మందారం ఉన్నదని అది కల్పవృక్షాలలో ఒకటని చెప్పబడింది.