ఔ మల్ల!:--- బాలవర్ధిరాజు మల్లారం 871 297 1999
మా మల్లారం ల
గప్పట్ల
గీ ఎండకాలంల
ఎవరింట్ల జూసినా
మాడికాయ తొక్కు, 
నిమ్మకాయ తొక్కు
పెట్టుకునేటోల్లు. 

తెనుగోల్లు 
మాడికాయల పిక్క
గట్టిగ అయినంక 
తొక్కు కాయలని 
అమ్మచ్చేటోల్లు.
ముందుగాల 
మాడికాయలను 
మంచిగ లీల్లతో కడిగి 
ఆరినంక, తోలు తీసి,
పొడుగ్గ కోసి 
పిక్కను పడేసేటోల్లు. 
అటెన్క 
కట్టెల పొయి మీద 
కంచుడు వెట్టి, నూనె వోసి 
బగ్గ కాగినంక
దాంట్ల ఆవాలు,ఎల్లి పాయలు ఏసి, దోర దోరగ ఏగినంక
కొత్తగ పట్టిచ్చిన కారం బోసి,
ఉప్పు కలిపి, ఆరినంక 
మాడికాయ ముక్కలను కలిపేటోల్లు.
గంతే! గిదే తొక్కు అన్నట్టు.
ఈ తొక్కును మర్తవాన్లల్ల 
ఊర వెట్టేటోల్లు. 
ఒగో సారి 
బడికి పోయినప్పుడు 
కూర గాకుంటే
టిఫిన్ల గీ తొక్కే ఏసుకొని పోయేటోల్లం.
పనికి పోయేటోల్లు గుడ
శానా మంది తొక్కే ఏసుకొని సద్ది గట్టుకొని పోయేటోల్లు.
తక్కువ మందే నిమ్మకాయ తొక్కు పెట్టుకునేటోల్లు.

మా అక్క దేవక్క 
రుద్రంగిల ఉంటది. 
మాకు మా దేవక్క
పొరసు తొక్కు గాకుండ
' అక్క తొక్కు'  పెట్టి తెచ్చేది.
అక్క తొక్కంటే.. అక్క పెట్టింది కాదుల్లా!
మాడికాయల తోలు తీయకుండా,
లీల్లతో మంచిగ కడిగి 
ఒక్కొక్క కాయను
పిక్కతోనే నాలుగైదు 
వక్కలు సేసి పెట్టిన 
తొక్కు అన్నట్టు.
మా అక్క 
గా తొక్కుల ఆవాలు,
ఎల్లిపాయలు,కొత్తిమీర్లు 
గుడ ఏసేది.
గీ తొక్కులు యాడాదంత
నిల్వ ఉండేటివి.

నెల అయినంక
ఈ పొరుసు తొక్కును 
లేదా అక్క తొక్కును
ఉడుకుడుకు బువ్వల 
ఏసుకొని తిన్నా,
పెరుగు ఏసుకొని తిన్నా,
పప్పు ఏసుకొని,
నెయ్యేసుకొని తిన్నా... మస్తుగుంటది.కమ్మగుంటది.
అబ్బ! ఆ రుసే రుసి.
ఔ మల్ల!