ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం -871 297 1999
 నా సిన్నతనంల
బడికి రాని బడి పోరగాన్ని
' బడి దొంగ ' అని ,
బోడ గుండు సేసుకున్న పోరన్ని 'గుండోడు' అని 
సదువు సక్కగ రానోన్ని
' మొద్దు ' అని,
బక్కగా, సన్నగ  ఉండేటోన్ని   
' బక్కోడు ' అని,
దొడ్డుగ, పోతుకు పోతు ఉండేటోన్ని ' మొద్దోడు ' అని  
ఎక్కిరిచ్చేటోల్లం.
ఎవలన్న 
ఉన్నది,లేనిది సెపితే..
ఏతులు గొడుతుండని,.
బగ్గ మాటలు సెప్పుతుంటే
బాతాలు గొడుతుండని,
దేనికన్నా సరే! బయపడేటోన్ని
' పిరికి పిత్తులోడు' అని
అనేటోల్లం.
ఎవలన్నా 
పిస పిస జేత్తే ' పిసోడు' అని,
బిత్తిరి బిత్తిరి జేత్తే 
' బిత్తిరోడు ' అని,
అబద్ధాలు ఆడుతూ, మోసం జేసేటోన్ని ' లంగ ' అని,
ఊకూకెనే మంది తోని
లొల్లి వెట్టుకొని, కొట్లాడేటోన్ని
' మోరుదోపు ' అని ,
ఏమీ తెలియనోన్ని,
ఏ పని సేయకుండా
ఉత్తగ తిరిగేటోన్ని గుడ
' సన్నాసి ' అని అనేటోల్లం.
గదెందో గని
ఎవలన్న ఆవులిత్తే 
పక్కనున్నన్నోల్లు గుడ
నోల్లు తెరిసి ఆవులించేటోల్లు.
గట్లనే 
ఎవలన్న  ఓన గాయ గాని,
సింత కాయ గాని, 
సింత పండు గాని
సప్పరిత్తుంటే...
దగ్గరున్నోళ్ళకు కుడుక
నోట్లె లీల్లు ఊరేటివి.
సెక్కరి గోలి గాని, మాడి కాయ గాని, ఏదన్న తినేటిది 
ఒకటే ఉన్నప్పుడు
సోపతి గానికి అంగిల వెట్టి కొరికి ఇచ్చినప్పుడు
'కాకి ఎంగిలి' అనిఇచ్చేటోల్లం.
గా దినాలు బంగారమమసోంటి దినాలు.
ఎంత తండ్లాడినా మల్ల రావు.
సిన్నప్పటి ముచ్చట్లైనా, 
ఊరి ముచ్చట్లైనా 
ఎన్ని సెప్పిన  గని 
ఇంక ఇంక తవ్విన కొద్దీ ఊరుతనే ఉంటయ్!
ఔ మల్ల!