ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం -871 2971 999

 నా సిన్న తనంల 
ఏరే ఊర్లల్ల దూరం ఉన్నోల్లకు,
బొంబాయి, బీవండిల ఉన్నొల్లకు  ఏమన్న ముచ్చట్లు గని, మతలావులు గాని జెప్పాల్నంటే కాయిదం రాసేటోల్లం.
ఉత్తుత్త ముచ్చట్లు, 
తక్కువ ముచ్చట్లు ఉంటే
15 పైసలకచ్చే కారట్ల ,
కొంచెం ఎక్కువ ముచ్చట్లు 
గిట్ల ఉంటే
చారానకచ్చే ఇంగ్లాండ్ లెటర్ల, 
ఇంక బగ్గ ముచ్చట్లు ఉంటే గనుక ఆఠానకు అచ్చే 
లిపాపల రాసెటోల్లం.
నలబై యేండ్ల కిందట మా ఊర్లే సదువువుకున్నోల్లు తక్కువనే ఉండేటోల్లు.
బతుకు తెరువు కోసరం
కొందరు 
ఎయ్యి రూపాయలకు
ఎయ్యిన్నర అడ్డి తీసుకొని
పదివేలు,ఇరువై వేలు కట్టి
మస్కట్టు, దుబాయ్,
ఇరాక్, బేరన్,దువ్వ కత్తెర పోయేటోల్లు. 
ఆల్లు  ఇంటికి నెలకు ఒకటి,రెండు కాయిదాలు ఏసేటోల్లు.
గట్ల  బతుక పోయిన
కొద్ది మందే 
నాలుగైదు యేండ్లకు  
తీసుక పోయిన బాకి తేరి బాగుపడ్డరు గని
శానా మంది మోసపోయి, సావలేక,బతుక లేక
ఉన్నయి అమ్ముకున్నరు.
మస్కట్ నుంచి అచ్చినోల్లు
బట్టలు,చెడ్డీలు,లుంగీలు,
తువ్వాల్లు సెద్దర్లు,పరుపులు, బూరు దుప్పట్లు,సెత్తిర్లు సబ్బులు,పౌడర్లు,సెంట్లు,అంగి బట్టలు, దోతులు, ఆడొల్లకు సీరెలు,జాకెట్ కనుములు,
లవంగాలు, యాలకులు, సేతి లైట్లు,సిన్న రేడియ, పెన్నులు,గడియారాలు, సెప్పులు,బూట్లు, పైటాబులు,
టేప్ రికార్ట్  తెచ్చేటోల్లు.
ఆల్లకు కావాల్సినోల్లకు
ఏదో ఒక అస్తువ ఇచ్చేటోల్లు.
నాకు గుడ
మా మ్యాన మామలు, సిన్నాన,బావలు ఏదో ఒకటి
తెచ్చి ఇచ్చేటోల్లు.
నాకు లేని అస్తువ లేకుండే.
మనిషినే ఇక్కడోన్ని.
తినే తిండి తప్ప అన్నీ ఏరే దేశం అస్తువలే.
గట్ల ఐదేండ్లు అయినంక
గాంది తాత మాటలు 
సదివినంక గ్యానం అచ్చి
ఏరే దేశం అస్తువలను  ఆడుకునుడు  బందు వెట్టిన.
నాతోని శానా మంది కాయిదాలు రాపిచ్చుకునేటోల్లు.
నేను రాసినన్ని ఉత్తురాలు
మా ఊల్లే ఎవల్లు గుడ రాయలేదు. అవునుల్లా!
రాయంగ రాయంగ నాగ్గూడ రాసుడు బగ్గ అలువాటు అయిందుల్లా.  
నాకు రోజుకు  పది నుండి
యాబై లెటర్ల దాకా అచ్చేటివి.
గట్ల ఉత్తురాలు రాసుడు జేయవట్టికనే
నాకు లగ్గం గుడ అయింది.
ఔ మల్ల!

కామెంట్‌లు