డెబ్బై ఏండ్ల కిందటనే
మా ఊల్లె బట్టు పంతులు
సదువు సెప్పిండట.
తక్కువ మందే సదువు నేర్సుకున్నరట.
మా నాన
జంగం సిన్న ముత్తయ్య
గా బట్టు పంతులు దగ్గర
క,కా ల గునితం దాకా సదువుకొని ,
వయిలు సదువుడు
సురువు సేసిండట.
నాకు అయిదేండ్లు పడ్డంక
బడికి పంపిచ్చి ఇంటికచ్చేసరికి
నేను బడిల ఉండకుండ
మా ఇంటికి ఉరికచ్చెటోన్నట.
దినాం గిట్ల సేసే సరికి
మా నాన నన్ను కొట్టకుంట,తిట్టకుంట
ఒక సగం పూట
నాతోనే బడిల కూసున్నడట.
తెల్లారినుంచి
ఇగ దినం తప్పకుంట
బడికి పోయేటోన్నట.
నాకు పొద్దూకి నంక
తిని మంచం మీద పండుకుంటున్నప్పుడు
మా నాన
ఓనువాలు,అంకులు, ఇంది
ఏక్,దో తీన్చార్ లు సెప్పి నాతో అనిపిచ్చేటోడు.
గట్ల మా నాన ఇంట్ల
నేర్పిచ్చే పటికెనే
నేను జెప్ప జెప్ప అ, ఆ లు ,
క,కా ల గుణితం నేర్సుకొని
నా తోటోల్ల కంటే ముందుగాల
ఒక తరగతి
ముందుకు పోయిన.
గందుకే మా పదో తరగతిల అందరి కంటే సిన్నోడు ఎవడ్రా అంటే నేనే అన్నట్టు.
యాబై యేండ్ల కిందట
అయిదేండ్ల దాకా
తల్లి పాలు సీకే టోల్లం.
పాలు మరిపిచ్చి
ఐదేండ్లు నిండినంకనే
పలుక, బలుపం ఇచ్చి
బడికి తోలిచ్చేటోల్లు.
ఒక యాడాది అ,ఆ లు,
ఇంకో యాడాది క, కా ల గుణితం అచ్చినంక
సిన్న బాలసిచ్చ లో ఏసేటోల్లు.
ఆ సిన్న బాలసిచ్చ వయిల
అమ్మ, ఆవు, ఇల్లు,ఈగ,
ఉడుత,ఊయల అని ఉండేది.
పెద్ద సారు
సిన్న బాల సిచ్చల మంచిగ సదివే టోల్లను ఏరు జేసి
పెద్ద బాల సిచ్చ లో ఏసేటోడు.
అది యాడాది సదివినంక
ఒకటో తరగతి పట్టుడు.
అటెన్క
పాసైన కొద్దీ ఒక్కొక్క తరగతి పెరుక్కుంట పోయేది.
మా బల్లే పగటి పూట
గోదుమ ఉకుమ , మక్క పిండి ఉకుమ పెట్టేటోల్లు.
నాకు ఓనువాలు పెట్టిచ్చింది
శెంకరయ్య సారు.
నాలుగో తరగతి దాకా
మా మల్లారం లనే సదువు కొని
అయిదో తరగతికి
అన్మాష్పటకు నడుసుకుంట పోయి
పదోద్దాక అక్కడే సదువుకున్న.
గిప్పుడు గిట్ల కతలు గితలు,కైతలు రాత్తున్ననంటే
కారణం నాకు తెలుగు సెప్పిన
కనపర్తి లచ్చుమయ్య సారు పున్నెమే!
ఔ మల్ల!
ఔ మల్ల!:-- బాలవర్థిరాజు మల్లారం-871 2971 999
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి