ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 2971 999

 యాబై యేండ్ల కిందట
మా మల్లారం 
పాడి పంటలకు
పెట్టింది పేరుల్లా!
మా ఊల్లే అడ్లు,మిరుపకాయలు ,పత్తి
ఎక్వ పండేటివి.
గట్లనే పాలు, పెరుగు గుడ
బగ్గనే ఉండేటివి.
మాకొక బర్రె ఉండేది.
బర్రె ఈనినంక
మొదట్ల పాలు, జున్ను అయ్యేటివి.
గా జున్నును తింటే 
కమ్మగ ఉండేటిది.
మా బర్రె  పొద్దు, మాపు
బుడ్డెడు, బుడ్డెడు పాలిచ్చేది.
గా పాలను మా అవ్వ  
పాల కుండల కాగవెట్టేది.
కాగిన పాలల్ల సెక్కరేసుకొని 
రెండు రెండు గిలాసల 
పాలు తాగేటోన్ని. పాలకుండను కడిగేటప్పుడు
అడుక్కున్న  కొంచెం మాడిన
పాల గోకును కసికె తోని
గీకి నాకు పెట్టేది.
గా పాల గోకు గుడ 
కమ్మగ, తియ్యగ ఉండేది.
పాలను బగ్గ మరిగిచ్చినంక
గా పాలను తోడు ఏత్తే పెరుగయ్యేది.
పాలున్న కుండను, పెరగున్న గురిగిని పిల్లికి అందకుండ 
మా అవ్వ ఉట్టి మీద పెట్టేది.
పెరుగులో  ఏ తొక్కేసుకొని తిన్నా మస్తుగుండేది.
నాలుగైదు దినాల పెరుగును
జమ జేసినంక ఒక కుండల వోసి కవ్వంతో సిలికితే
సల్ల అయ్యేది,ఎన్న అచ్చేది.
పచ్చి ఎన్నను సిన్న గురిగిల కూడవెట్టి , దాన్ని 
పొయి మీద కరుగవెడితే నెయ్యి అయ్యేది.
గా నెయ్యిని 
ఉడుకుడుకు బువ్వల మాడికాయ తొక్కేసుకోని తింటుంటే కమ్మగా,
తిన్నా కొద్ది 
తిన బుద్ది అయ్యేది. 
మా ఇంట్లో పాలువెరుగు మస్తుగుండేది.
మా అవ్వ 
చాలా మంది లెక్క
పాలను కేంద్రానికి పోసేది కాదు.
దగ్గెరోల్లకు, బగ్గ కావాల్సినోల్లకు
అట్టిగనే సిన్న గిలాసెడు  
పాలు వోసేది.
అట్లనే సల్ల గుడ అడిగినోల్లకు
పోసేది.
సల్ల   
బువ్వల కన్నా మక్క గటుకల పోసుకొని తింటే మంచిగుంటది.
మా ఇంట్ల పాలువెరుగు
బగ్గ ఉండుట్ల 
నాకు చాయ్ తాగుడు అలువాటు కాలేదుల్లా! గిప్పటికీ చాయ్ తాగను
పాలే తాగుతా!
ఔ మల్ల!