వీపు విల్లును వంచి
శ్రమశరాలను సంధించే విలుకాడులు!
నవ నాడులను
వింటినారిగ కట్టి
కర్తవ్యాన్ని ఎక్కుపెట్టే సాధకులు!!
చెమట నెత్తురును
అభిషేకిస్తూ
పంటకు పురుడుపోసే మంత్రసానులు!
నాగేటిసాల్లల్లనే
ఆశలను విత్తుకొని
అహరహము నిరీక్షించే అన్నదాతలు!!
యంత్రాలతోనే దోస్తీకట్టి
కందెననే కప్పుకుంటూ
పొగతో పోటీపడుతూ
ఉత్పత్తికై పరుగులిడే ఆటగాళ్లు!
ఊపిరితిత్తుల మూలాల్లో
చెడుగాలి గూడుకట్టినా
క్షణం క్షణం దేహం
మరణానికి చేరువవుతున్నా
ఆకలి ప్రశ్నకు సమాధానం చెప్పలేని అభాగ్యులు!!
దేశభవితనంతా
భుజాన మోస్తూ
పరుల ప్రయోజనాలకై
పాటుపడుతూ
క్రొవ్వొత్తిలా కరుగుతున్న శ్రమజీవులకు వందనం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి