ఒక నర్సు నరకయాతన... .:--- పోలయ్య కవి కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్...9110784502
రారా కన్నా రారా నా చిన్నా అంటూ
అమ్మ కమ్మగా పిలుస్తుందే, కాని
పడిలేస్తూ పరుగుపరుగున వస్తున్న, ఆ 
చిన్నారికి అమ్మ దూరదూరంగా వెళ్తుందే,కాని

ఎందుకో ఎప్పటిలా ముందుకు రావడంలేదు
ముద్దు పెట్టుకోవడం లేదు,లాలి పాడడం లేదు
బుజ్జగించడంలేదు, బువ్వపెట్టడంలేదు,తన
ఒడిలో పడుకోబెట్టుకొని చనుబాలనివ్వడంలేదు

గుక్కపెట్టి ఏడుస్తున్నా ఎత్తు కోవడం లేదు
ఎదకు గట్టిగా హత్తుకోవడంలేదు
అమ్మకేమైందో ఆ పసి పాపకర్థం కావడంలేదు

ఆమె ఆసుపత్రిలో రాత్రింబవళ్ళు
కరోనా పేషెంట్ల చుట్టే తిరుగుతూ
నిద్రాహారాలు మాని నిస్వార్థంగా
సేవలు చేస్తున్న "ఓ నర్సు" ఓ కన్నతల్లి...
ఎక్కడ కరోనా వైరస్ తన చంటిపాపకు 
అంటుకుంటుందోనని ఆమెవేదన ఆవేదన

ఔను ఏడుస్తున్న తనబిడ్డను ఎత్తుకోలేక
తన చనుబాలు బిడ్డకు పట్టలేక
ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆడించలేక
ఎత్తుకొని ఎదకు హత్తుకోలేక,పోతున్నందుకు
ఆ తల్లి మనసు ఎంతగా తల్లడిల్లుతుందో...

తానొక్కతే ఒంటరిగా 
ప్రక్కగదిలో పడుకున్నప్పుడు
ఆ తల్లి మనసు ఎంతటి క్షోభకు గురౌతుందో... 
ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపిందో...
ఎవరికి తెలుసు ఆ చల్లని తల్లిదేవతకు తప్ప...

ఒకవైపు ఆసుపత్రిలో వుద్యోగం
ఒకవైపు శ్వాస అందక కొనవూపిరితో 
కొట్టుమిట్టాడుతున్న కరోనా రోగులు
ఒకవైపు కన్నబిడ్డ అమ్మకోసం
అమ్మపాల కోసం అమ్మ స్పర్శ కోసం
అమ్మ వెచ్చనిఒడికోసం ఎంతగానో తపిస్తున్నా

ఉద్యోగమే ఊపిరిగా తన ప్రాణాలను
తన బిడ్డ ప్రాణాలను ఫణంగా పెట్టి...
పాలకోసం ఏడ్చేబిడ్డకు డబ్బాపాలు పట్టి...
ఎన్నో బాధలను, పంటికింద బిగబట్టి...
ఎన్నో కన్నీటి వర్షాలను కారుచీకటిలో
కనురెప్పల మాటున దాచుకొని...

ఎన్నో ఆవేదనా అగ్నిపర్వతాలను
గుండెల్లో గుట్టుగా నిక్షిప్తం చేసుకొని... 
చెరగని చిరునవ్వుతో కరోనారోగులకు... 
నిర్భయంగా...నిశ్చింతగా...నిర్మలంగా
సేవలందించే "ఆ నర్సు" కన్నతల్లే కాదు
కరోనా రోగుల పాలిట కల్పవల్లి కూడా

దేవతలకే దేవతైన ఆ తెల్లని చల్లనితల్లికి...
వందనాలు, శతకోటి వందనాలు అర్పిస్తున్న...
కనిపించే ఆదేవతకు పాదాభివందనం చేస్తున్న...

(అంతర్జాతీయ "నర్సు దినోత్సవం" సందర్భంగా)