ఎంత ఆశ..!?:-యలమర్తి అనూరాధ-హైద్రాబాద్-చరవాణి:9247260206

 నీ సున్నితమైన పాదాలు
అలలతో ఆడుకుంటుంటే 
ఆ అల అయినా బాగుండేదనుకున్నా 
నీతో ముచ్చట్లు ఆడుకునే వాడిని 
నీ లావణ్య హస్తాలు
పూలను పరామర్శిస్తుంటే
ఆ పువ్వునైనా బాగుండేదనుకున్నా
నీ స్పర్శానుభూతిని అనుభవించేవాడ్ని
నీ పలుకు 
రాగమై ప్రవహిస్తుంటే 
ఆ పాటనైనా బాగుండేదనుకున్నా 
సరాగాలతో ఊసులాడుతూ
నీ గొంతులో మిళితమయ్యేవాడ్ని
నీ కనులలో
ఆ వెలుగు విరజిమ్ముతుంటే
ఆ వెలుగునైనా బాగుండేదనుకున్నా
కలల గూటిలో కౌగిళ్ళను పంచుకునే వాణ్ని 
నీ అక్షరాలు 
ప్రవాహమై పరిగెడుతుంటే
ఆ పదాన్నైనా బాగుండేద నుకున్నా 
నీ చెంతే నిలిచిపోయేవాడ్ని
నీ ప్రేమ 
చందమామలా ఊరిస్తుంటే
ఆ మామనైనా బాగుండేద నుకున్నా
నిన్నలా చూస్తూ గడిపేసేవాడ్ని!


కామెంట్‌లు