గరుడయ్య ధర్మబుద్ధి:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  కొన్ని వందల సంవత్సరాల క్రితం సింహపురి రాజావారు వివిధ వీధుల్లో గుంజలు పాతించి ఆగుంజలకు సాయంత్రం అయ్యే సరికి లాంతరులు తగిలించి,చీకటిలో పాద చారులకు,బండ్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశాడు.
       ఆ విధంగా గోపురం వీధిలో దీపాలు వెలిగించడానికి గరుడయ్య అనే వాడిని నియమించాడు.
        ఒకరోజు గరుడయ్య ఒక డబ్బాలో నూనె తీసుకుని వెళ్ళి లాంతరులలో నూనె పోయసాగాడు.ఒక బీదవాడు అక్కడికి ఒక చిన్న గిన్నెతో వచ్చి"అయ్యా, నాకు కొద్దిగా నూనె పొయ్యి ఇంట్లో నూనె నిండుకున్నది,నీవిచ్చే నూనెతో దీపం వెలిగించుకుని ఆ వెలుతురులో భోంచేస్తాము"అని అడిగాడు.
        గరుడయ్యది జాలి హృదయం,"సరే ఈకొద్ది నూనె తీసుకుని దీపం వెలిగించుకో"అని వాడి చిన్న పాత్రలో నూనె పోశాడు.
        అలా లాంతరులు వెలిగిస్తూ పోతుండగా, మరొక వృద్ధ స్త్రీ వచ్చి, "బాబూ, నాకు కొద్దిగా నూనె పొయ్యి,నా గుడిసెలో నూనె అయిపోయింది,అసలే పెద్దదాన్ని చిమ్మచీకటి,ఏపురుగో పామో రావచ్చు నీవీచ్చే నూనెతో దీపం వెలిగించుకుంటాను" అన్నది.
        "సరే తీసుకో అవ్వా"అని కొద్ది నూనె ఆమె పాత్రలో పోశాడు.గరుడయ్య దగ్గర నూనె అడుగంట సాగింది.అలా కొన్ని లాంతర్లు వెలిగించాక నాలుగు లాంతరులు మిగిలి పోయాయి!ఎందుకంటే ఆ లాంతరులలో పొయ్యాల్సిన నూనె మొదట వచ్చిన వ్యక్తికి,ఆ ముసలామెకు పోశాడు కదా అందుకని.
      ఇక ఏంచేయలేక ఆ లాంతర్లు వెలిగించలేక వెళ్ళి పోయాడు.
        కొంతసేపటికి  ఆదారిలోనే సైనికాధి కారి వెళుతూ వెలగని లాంతర్లు గమనించాడు.గరుడయ్య నూనె అమ్ము కొన్నాడేమో అనే అనుమానం సైనికాధికారికి వచ్చింది!
       రెండోరోజు గరుడయ్య నూనె తీసుకునేందుకు రాజ కార్యాలయానికి వచ్చాడు.అప్పటికే  వెలగని లాంతర్లను గురించి రాజు గారికి చెప్పాడు సైనికాధికారి.
       అక్కడికి వచ్చిన రాజు"ఏం గరుడయ్యా నిన్న నాలుగు లాంతర్లు వెలిగించలేదు,నూనె సరిపోలేదా,మేము లెఖ కట్టి అన్ని లాంతర్లకి సరిపోయేట్టు ఇఛ్చాము కదా"అని అడిగాడు రాజు.
        "మహారాజా,తమరు నూనె ఇచ్చిన మాట వాస్తవం,కానీ ఆ నాలుగు లాంతర్ల నూనెను ఒక బీద వాడికి,ఒక పండు ముసలిదానికి ఇచ్చాను వాళ్ళ ఇండ్లలో నూనె అయి పోయిందట,చీకట్లో భోంచేయలేరు ఏ పురుగో,పామో వస్తే కష్టం కదా,అందుకే వారి స్థితి చూసి నూనె ఇచ్చాను.నేను చేసిన పని తప్పు అవుతే నన్ను శిక్షించండి"అని నమస్కారం పెట్టి చెప్పాడు.
       రాజుగారు ఆలోచనలో పడ్డారు.గరుడయ్య మంచివాడని రాజుగారికి తెలుసు.
        "చూడు గరుడయ్యా,నీవు చేసింది మంచిపనే,ఇందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను.నీకు ప్రతి రోజూ కొంత నూనె అదనంగా ఇస్తాను,నిన్ను ఏ బీదవారైనా,ముసలి వాళ్ళైనా నూనె అడిగితే ఇవ్వు,కానీ వీధిలో లాంతర్లన్నీ వెలిగించు.దారిలో కాంతి లేక ఎవ్వరూ బాధ పడకూడదు.ఇతర వీధుల్లో లాంతర్లు వెలిగించే వారికి కూడా అదనపు నూనె ఇస్తాను"అని మంచి మనసుతో చెప్పాడు రాజు.
    రాజు గారి మంచి ఆలోచనకు సైనికాధికారి,గరుడయ్య అక్కడ ఉన్న అందరూ సంతోషించారు.
          

కామెంట్‌లు