మంచి సలహా!:-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  అచ్యుతాపురం రాజు కనకవర్మ నీతి,నిజాయితీతో రాజ్యం పరిపాలిస్తూ,ప్రజలకు ఉపయోగకరమైన అనేక పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్నలను పొందాడు.
      అచ్యుతవర్మ పరరాజ్యకాంక్ష లేకుండా తన దేశం లో విజ్ఞానానికి పెద్ద పీఠ వేశాడు.అనేక విద్యాలయాలు,గ్రంథాలయాలు,వృత్తి విద్య నైపుణ్య శిక్షణా కేంద్రాలు అభివృద్ధి చేశాడు.అందువలన ప్రజలు కేవలం డబ్బు సంపాదించడమే కాక విజ్ఞానంలో కూడా అభివృద్ధి చెందారు.అందుకే అచ్యుతాపురంలో శాంతి,సౌభాగ్యాలు వర్ధిల్లుతున్నాయి.
           అచ్యుతాపురం అభివృద్ధి చూసి పక్క రాజ్యం ద్రోణపురం రాజు భుజంగవర్మకు కన్నుకుట్టింది!తనకు మెండుగా సైనిక బలం ఉన్నది కనుక కనకవర్మను భయపెట్టి అచ్యుతాపురం లోని కొంత ప్రాంతాన్నో,లక్ష బంగారు నణేలనో అడగాలనే దుష్ట బుధ్ధి భుజంగ వర్మకు కలిగింది.
      తాను సూచించిన ప్రాంతంగానీ,లక్ష బంగారు నాణేలు గానీ ఇవ్వాలనీ లేక పోతే అచ్యుతాపురం మీద దండయాత్ర చేస్తానని ఒక లేఖ వ్రాసి దూత ద్వరా కనకవర్మకు పంపాడు.
     నాలుగురోజుల గడువు ఇవ్వమని తానొక లేఖ వ్రాయించి భుజంగవర్మకు పంపాడు కనకవర్మ.
      రెండోరోజే కనకవర్మ అత్యవసర సభ ఏర్పాటు చేసి మంత్రులతో సైనిక అధికారులతో యుద్ధం లేకుండా, రక్తపాతంలేకుండా ఆ దేశంతో శాంతి ఒప్పందం చేసుకునే సూచన లేక సలహా ఇవ్వమని సభను కోరాడు కనకవర్మ.
        ఎవరు ఎంత ఆలోచించినా వారి బుర్రలకు తగిన ఆలోచన తట్టలేదు.
        "మహారాజా,రెండురోజుల సమయం ఇవ్వండి బాగా ఆలోచించి చెబుతాము"అని విన్నవించారు సభికులు .
          ఆస్థానంలోని గుణశేఖరుడనే మంత్రి ఇంటికి వెళ్ళి ఈవిషయంమీద తీవ్రంగా ఆలోచిస్తూ భోజనం కూడా చెయ్యలేదు.గుణశేఖరుడి కొడుకు  సృజనవర్మ తండ్రి ఆలోచనా తీవ్రతను గమనించి ఆలోచనకు కారణం అడిగాడు.
       "పక్కరాజ్యం రాజు భుజంగవర్మ  దండయాత్రకు సన్నాహం చేస్తున్నాడు కానీ మన రాజ్యం రాజు గారు మటుకు శాంతియుతంగా సమస్య పరిష్కరించాలని,రక్తపాతం జరగకూడదని చెప్పాడు,ఈవిషయాన్ని గురించే ఆలోచిస్తున్నాను"అని చెప్పాడు.
        కళ్ళు మూసుకుని రెండు నిముషాలు ఆలోచించి"నాన్నా,ఈ సమస్యను ఒక ఉపాయంతో పరిష్కరించవచ్చు" చెప్పాడు సృజనవర్మ.
        "ఏమిటో చెప్పు"ఆసక్తితో అడిగాడు గుణశేఖరుడు.
          తాను ఒక గ్రంథంలో చదివిన విషయాన్ని వివరించాడు సృజనవర్మ.
        "నీవు చెప్పిన విషయం ఆలోచింప చేసేదిగా ఉంది,నీవు రేపే సభకు వచ్చి రాజు గారికి అధికారులకు వివరించు"చెప్పాడు గుణశేఖరుడు.
       రెండోరోజు సృజనవర్మ సభకు వచ్చి తన ఆలోచనను ఈ విధంగా వివరించాడు.
    "మహారాజానమస్కారాలు,నేను ఒక గ్రంథంలో చదివిన ఓ విషయంతో భుజంగవర్మ వలన సంభవించబోయే కష్టానికి అడ్డుకట్టవేయవచ్చు"
          "ఏమిటది?" అడిగారు రాజు.
      "రాజా,ఆ భుజంగవర్మ తన సైనిక బలం చూసుకుని విర్రవీగుతున్నాడుకదా,మన యుక్తితో అతన్ని భయపెట్టవచ్చు,ఎలా అంటే మన కోట మీద అనేక చెక్క ఫిరంగులు పెట్టి,మనకు ఎన్నో ఫిరంగులు ఉన్నట్టు బ్రాంతి కలిగించవచ్చు,అదిగాక అనేక సైనిక చెక్క బొమ్మలు చేసి కోట పైన పెడితే మనకు అపార ఆయుధ,సైనిక బలం ఉన్న భ్రమ భుజంగవర్మకు కలుగుతుంది,తద్వారా అతను యుద్ధం ఆపవచ్చు,తరువాత మన దూతలద్వారా శాంతి సందేశం పంపడమే కాకుండా,వారి దేశ అభివృద్ధికి పాటుపడతామని,మన దేశంలో ఉన్న నిపుణుల్ని,సాంకేతికతను వారి దేశానికి ఇచ్చి శాంతియుతంగా ఇరు దేశాల అభివృద్ధికి అందరం పాటు పడతామని మన సందేశంలో చెబుతాం,ఇదే నా సలహా"అని వివరించాడు సృజనవర్మ.
        రాజు గారికి,సభలో అందరికీ సృజనవర్మ ఆలోచన ఎంతో నచ్చింది.
       సృజనవర్మ ఆలోచనను అమలు పరిచారు,దండయాత్రకు వచ్చిన భుజంగవర్మ,అతని సైనిక పటాలం కనకవర్మ కోట మీద సైనిక బొమ్మలు,ఫిరంగులు చూసి కనకవర్మ శక్తిని తక్కువగా అంచనా వేసినట్టు తలవంచుకుని వెనుతిరిగారు.
       తరువాత కనకవర్మ ఒక శాంతి బృందాన్ని భుజంగవర్మ వద్దకు పంపి రెండు రాజ్యాలమధ్య సుహృత్ భావననెలకొల్పి ఇరు రాజ్యాల అభివృద్ధికి పాటు పడ్డాడు.
        అంతమంచి సలహా ఇచ్చినందుకు సృజనవర్మ కు భవిష్యత్తులో మంత్రి మండలిలో ఉన్నత స్థానం కల్పిస్తున్నట్టు ఆజ్ఞ జారీ చెయ్యడమే కాకుండామంచి సన్మానంకుడా చేశాడు కనకవర్మ.