మంచివాడిగా మారు...:- కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  టప టప చినుకులు పడసాగాయి,వాన పెద్దదయ్యేటట్టు ఉంది. ఆవు దూడను పాక లోపలికి కడితే మంచిది,అదిగాక వాన నీరు పశువుల కొట్టంలోకి రాకుండా కాస్త మట్టి వేసి,కాలువ లాగ కడితే మంచిది కదా అని ఆలోచించి ధర్మయ్య గుణపం,పార,లాంతరు తీసుకుని మూడు ఇళ్ళ అవతల ఉన్న తన స్థలంలో గల పశువుల కొట్టం కేసి బయలు దేరాడు.
     అలా బయలుదేరిన ధర్మయ్యను ఆవీధిలో ఉండే గురవయ్య చూశాడు.గురవయ్యలో దుర్గుణాలు ఎక్కువ.మోసం,దొంగతనం చేసి బ్రతుకు ఈడుస్తున్నాడు.ధర్మయ్య అంతరాత్రి గుణపం,పార పట్టుకుని ఎందుకు వెళుతున్నాడో గురవయ్య అర్థం చేసుకోలేదు.బహుశా బంగారమో, డబ్బో పాతి పెట్టడానికి వెళుతున్నాడేమోనని అని అనుమానించాడు. ఒకవేళ ధర్మయ్య బంగారం కానీ,డబ్బు కానీ పాతిపెడితే అతనికి తెలియకుండా వాటిని కాజెయ్యాలని గురవయ్య దుష్టపన్నాగం పన్నాడు.ధర్మయ్యకు తెలియకుండా గురవయ్య దూరంగా అతనిని వెంబడించాడు!
        ధర్మయ్య పశువుల కొట్టందగ్గరకు వెళ్ళి చూస్తే అనుకున్నట్లు వాన జల్లు దూడమీద పడటం లేదు.ఎందుకైనా మంచిదని కొట్టం మధ్యలో దూడను కట్టేందుకు గుంజ పాతడానికి ధర్మయ్య త్రవ్వాడు.ఆ చీకటిలో ధర్మయ్య త్రవ్వుతున్నట్టు చూశాడు.కానీ, చీకటి వలన గుంజను పాతుతున్నట్లు చూడలేదు.ధర్మయ్య ఆపని సక్రమంగా చేశాక,ఆవుకు కొంత మేత వేసి గుంజ పాతిన చోట కాళ్ళతో బాగా తొక్కి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు.ధర్మయ్య కొంతదూరం వెళ్ళాక ,గురవయ్య ఆత్రంగా ఆ గుంజ పాతిన దగ్గరికి వెళ్ళి దానిని పీకాడు.అలా గుంజ పక్కన పడిఉన్న గడ్డిలో కాలు పెట్టాడు.అంతే గడ్డిలో ఉన్న ఎర్రతేలు కుట్టడం వలన "కెవ్వు" మని కేక పెట్టి,పెడబొబ్బలు పెట్టసాగాడు.
        చుట్టూ వాతావరణం నిశ్శబ్దంగా ఉండటం వలన గురవయ్య పెట్టిన కేక ధర్మయ్య చెవిన పడింది!
        అంతే ధర్మయ్య పరుగు పరుగున పశువుల కొట్టం వద్దకు వచ్చేసరికి బాధతో మెలికలు తిరిగిపోతూ  ఏడుస్తూ కనబడ్డాడు తనకి పరిచయం ఉన్న గురవయ్య.
         "అదేంటి గురవయ్యా ఇక్కడ ఏంచేస్తున్నావు?ఏదైనా కరిచిందా?"అని అడిగాడు ధర్మయ్య.
          "అవును తేలు కరిచింది"అంటూ మంట పుడుతున్న కాలును ఊపసాగాడు.ధర్మయ్య తేలును చంపి వేశాడు.
         గురవయ్య దొంగ బుద్ధి తెలిసినా,ధర్మయ్య పశువుల కొట్టం పక్కనే ఉన్న తన ఎడ్లబండిలో గురవయ్యను ఎక్కించుకుని ఊరి వైద్యుడు ధన్వంతరి వద్దకు తీసుకవెళ్ళాడు.
       ధన్వంతరి ఆకు పసరు కట్టి,ఏవో ఏవో గుళికలు మ్రింగించి"సకాలంలో తీసుకవచ్చావు ధర్మయ్యా,ఎర్రతేలు విషం చాలా ప్రమాదకరం...ఇతనికి విశ్రాంతినివ్వాలి"అని చెప్పాడు.
        కొంతసేపటికి నొప్పి తగ్గి,గురవయ్య కుదుట పడిన తరువాత "అసలు ఆ కొట్టం లోకి ఎందుకు వెళ్ళావు"అడిగాడు ధర్మయ్య.
      "అయ్యా,నా బుద్ధి గడ్డి తినింది.తమరేదో బంగారం పాతి పెట్టడానికి వెళుతున్నారని పిచ్చిగా ఆలోచించి మిమ్మల్ని వెంబడించాను.మీరు త్రవ్విన చోట గుంజ దగ్గరకు వెళ్ళి అక్కడ గడ్డిలో అడుగు వేశాను అందులో ఉన్న ఎర్రతేలు కుట్టింది,నాకు తగినశాస్తి జరిగింది"అని ఏడుస్తూ చెప్పాడు గురవయ్య.
        "చూడు గురవయ్యా, ఇప్పటికైనా పాడు బుద్దులు మాను.కష్టపడి సంపాదించు,గౌరవం ఉంటుంది,తేరగా మోసం,దొంగతనం తో సంపాదించుకోవాలనుకుంటే భగవంతుడు ఊరుకోడు.తగిన విధంగా శిక్షిస్తాడు, అది తెలుసుకో"అని మర్యాదగా చెప్పాడు ధర్మయ్య.
       "నా కళ్ళు తెరిపించావు ధర్మయ్యా, ఇక ఈ రోజునుండి నాలో మార్పు చూస్తావు.నేనూ నీలాగే కష్టపడి  నా బతుకు మార్చుకుంటాను"అని రెండు చేతులు జోడించి చెప్పాడు గురవయ్య.
        "నీవుమంచి వాడిగా మారితే అందరికన్నా ముందు సంతోషించేది నేనే,నీ బతుకుకి బంగారు బాట నీవే వేసుకో"అని చెప్పి ధర్మయ్య గురవయ్యను అతని ఇంటివద్ద దింపి వెళ్ళిపోయాడు.