ఆడపిల్ల చదువు:---కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 చండీవనంలో శ్వేతాదేవి ఒక గురుకులాన్ని నడుపుతున్నది.ఆ గురుకులం కేవలం ఆడవారికి మాత్రమే.అప్పటి కాలంలో ఆడపిల్లలను ఎక్కువ చదివించేవారు కాదు.చదువు కేవలం మగ పిల్లలకే అనే సంకుచిత ఆలోచనతో ఉండేవారు. ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేసి,చిన్నవయస్సులోనే పెండ్లి చేసి పంపేవారు!
         కానీ,శ్వేతాదేవి చండీవనం పక్కనున్న ఊర్లలో తిరిగి అనేక కుటుంబాల వారికి ఆడపిల్ల చదువును గురించి,చదువుకుంటే వారికి జరిగే మేలును గురించి వివరించి అనేక మంది మనసులు మార్చి వారిలో చైతన్యం తెచ్చింది. అందుకే చాలా కుటుంబాల వారు ఆడపిల్లలను శ్వేతాదేవి గురుకులంలో చేర్చారు.
         శ్వేతాదేవి వారికి కేవలం ప్రాధమిక విద్యే కాకుండా పురాణాల్లో వీరగాథలు, శాస్త్రాలు, విలు విద్య, కత్తి తిప్పటం  వంటి విద్యలు,చిత్రకళ, శిల్ప కళ
లో నిష్ణాతులైన స్త్రీ గురువుల్ని నియమించి కళలు కూడా బోధించ సాగింది.
        శ్వేతాదేవి గురుకులంలో శర్వాణి అనే విద్యార్థిని చాలా చురుకైన పిల్ల,ఏ విద్య అయినా అట్టే ఆకళింపు చేసుకునేది.చిత్రకళలో కూడా మంచి పట్టు సాధించింది.
       ఒకసారి చండీవనానికి దగ్గరలో ఉన్న అడవికి రాజుగారి కుమారుడు శక్తిసింహ వేటకు వచ్చాడు.అతనితో పాటు ఇద్దరు విలుకాళ్ళను మటుకే తెచ్చుకున్నాడు.శర్వాణి తన తోటి విద్యార్థినితో అడవిలో కొన్ని చిదుగులు(కట్టెలు) సేకరించేందుకు వచ్చింది.
       ఇంతలో ముగ్గురు దొంగలు శక్తిసింహుడి మీద విరుచుక పడ్డారు.కానీ,శక్తిసింహుడు,అతని విలుకాళ్ళు చాక చక్యంగా వారి మీద తిరగబడ్డారు.వారి ధాటికి తట్టుకోలేక దొంగలు పలాయనం చిత్తగించారు! ఇదంతా చెట్ల చాటునుండి శర్వాణి గమనించింది.దొంగలు పారి పోయాక తాను ధైర్యంగా శక్తిసింహుడి వద్దకు వెళ్ళి అతని వీరత్వాన్ని పొగిడి,తాను ఆ దొంగలను బాగా గమనించినట్టు చెప్పి,వారి చిత్రాలను తాను గీసి ఇస్తానని,తద్వారా అడవిని,ఊర్లను జల్లెడ పట్టి వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పింది.
       శర్వాణి చెప్పిన మాటలు శక్తిసింహుడికి నచ్చి వెంటనే వారి చిత్రాలు చిత్రించమని చెప్పాడు.
      రెండవరోజు అతి శ్రద్దగా తాను గమనించిన దొంగల చిత్రాలు గీచింది.శ్వేతాదేవి సహాయంతో చండీ నగరానికి వెళ్ళి శక్తిసింహునికి ఆ చిత్రాలు చూపించింది.ఆమె చిత్రకళా నైపుణ్యం చూసి శక్తిసింహుడు ఆశ్చర్యపోయాడు.
          తన గూఢచారులకు ఆ చిత్రాలు ఇచ్చి ఆదొంగలు ఎక్కడ తారసపడినా వారిని బంధించి తెమ్మని చెప్పాడు.
        గూఢచారులు ఆ చిత్రాలతో అనేక చోట్ల తిరుగసాగారు.అనుకున్నట్లుగానే  ఒక కంసాలి వద్దకు దొంగ నగల మూట తెచ్చి నగలను అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు.ఆ దొంగ పోలికలు తమ వద్ద ఉన్న శర్వాణి చిత్రీకరినచిన చిత్రంతో సరి పోయాయి.అంతే ఆ దొంగను  గూఢచారులు బంధించి శక్తి సింహుని వద్దకు తీసుకవెళ్ళారు.శక్తి సింహుని విచారణలో ఆ దొంగ ఆ రోజు తమ మీద దాడి చేసిన దొంగలలో దొంగే అని తెలిసింది!
         వెంటనే శక్తిసింహుడు గూఢచారులతో సైనికులను ఆ దొంగల స్థావరానికి పంపి అందరినీ బంధించి,దొంగసొత్తు తెప్పించాడు.
        రాజసభకు శ్వేతాదేవిని,శర్వాణిణి పిలిపించారు.వారికి సన్మానం చేసి,సభలో శక్తిసింహుడు ఈ విధంగా చెప్పాడు.
       "ఈ రోజు నుండి మన రాజ్యంలోని ఆడపిల్లలు అందరూ బాగా చదువుకోవాలి,ఇది నాశాసనం.చూడండి శర్వాణి చదువుకోవడమే కాకుండా చిత్రకళ కూడా నేర్చుకుంది.అందువలన ఆమె దొంగల చిత్రాలు గీసి వారి ఆటలు కట్టించి ప్రజలకు దొంగల బెడద తప్పించింది.ఆడపిల్ల చదువుకుంటే ఆమె కుటుంబమే కాదు రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది."అని చెప్పాడు.
        శక్తి సింహుని మంచి ఆలోచనకు సభ చప్పట్లతో దద్దరిల్లింది!
          శక్తిసింహుడు ఆడపిల్లల చదువును గురించి అందరికీ అవగాహన కల్పించినందుకు శ్వేతాదేవి అనేక కృతజ్ఞతలు తెలిపింది.