పగ పట్టవు!:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  గిరికి చిన్నప్పటినుండి భయం ఎక్కువ.బొద్దింకను చూసినా,గోడమీద బల్లిని చూసినా,కప్పను చూసినా వాడికి బోలెడంత భయం!
       ఒకరోజు గిరి అమ్మగారు పక్కవీధిలో కూరల అంగడికి వెళ్ళి కరివేపాకు తెమ్మనమని ఐదు రూపాయలు ఇచ్చింది.
         రోడ్డు చవిర ఒకచోట జనం గుంపుగా నిలబడి ఏదో చోద్యం చూస్తున్నారు.చిత్రంగా అక్కడ డప్పు శబ్దం వినబడుతోంది.గిరి జనం మధ్యలోనుండి వెళ్ళి ఏంజరుగుతోందో అని ఆసక్తిగా చూడ సాగాడు.
        అది ఒక గారడీ ప్రదర్శన. కూటికోసం కోటివిద్యలు కదా! గారడీవాడు కొన్ని గవ్వలు చేతిలోకి తీసుకుని "బరబంప బరబంప"అని రెండు మార్లు జపించి గవ్వలు మాయం చేశాడు.కొందరి దగ్గర డబ్బులు తీసుకుని వాటిని గవ్వలుగా మార్చాడు.మరలా డబ్బులుగా మార్చి ఎవరి డబ్బులు వారికిచ్చాడు.అందరూ చప్పట్లు కొట్టారు.తరువాత ఒక పాముల బుట్టను తెరచాడు,అందులో నుండి ఒక నాగుపాము బుస్సు మంటూ పడగ విప్పి పడగ నిలిపింది!
         "అయ్యలారా,అమ్మలారా,ఇదిమేలు జాతి నాగుపాము,నా పాము బుర్ర పాటకు తల ఆడిస్తూ నాట్యం చేస్తుంది చూడండి అంటూ తన పాము బుర్ర తీసి లయబద్దంగా ఊదుతూ మోచేతిని దాని పడగకు చూపిస్తూ దానిని ఆడించ సాగాడు.గబుక్కున బుర్ర వాయించడం ఆపి,"అయ్యలారా,అమ్మలారా ఎక్కడికీ వెళ్ళకండి,మీకు చేతనైనంత ఆ పరచిన గుడ్డ మీద వేసి నా కడుపు,నాగు తల్లి కడుపు నింపండి,తృణమో పణమో ఇవ్వకుండా వెడితే పగ బడుతుంది నా నాగు"అని బిగ్గరగా నవ్వుతూ అన్నాడు వాడు.
       అంతే గిరి వాడి మాటలకు భయపడి పోయాడు.డబ్బులెయ్యకపోతే ఎక్కడ పాము వెంట పడుతుందో అని కూరల అంగడికి పరుగు పెట్టసాగాడు.వాడి మొహంలో ఆందోళన,భయం కనబడ సాగాయి!
        అప్పుడే గిరికి ఎదురుగా వస్తున్న మహీపతి మాస్టారు గిరి పరుగు,వాడి మొహంలో ఆందోళన చూసి గబుక్కున గిరిని ఆపాడు.
       "ఎందుకు పరిగెడుతున్నావు?ఆ భయమేమిటి?"అని అడిగాడు.
       అక్కడ పాములవాడి గారడీ విద్య మొదలు,పామును చూపించి డబ్బులు వెయ్యకపోతేఅది వెంట పడుతుందని గారడీ వాడు చెప్పినదంతా మహీపతి మాస్టారుకు వివరించాడు.
        "అమాయక గిరీ,పాములు డబ్బులు వెయ్యకపోతే పగపట్టవు.కేవలం అందరి దగ్గర డబ్బులు గుంజడానికి గారడీ వాడు ఆ విధంగా మాయ మాటలు చెప్పాడు.నిజానికి వాడు చెప్పినట్టు పాము వెంటబడితే అందరూ కలసి వాడిని తంతారు.పాముకే కాదు,తేలు,బొద్దింక,జర్రి అన్నింటికీ మనుషులంటే భయమే! మనం వాటి దగ్గరకు వెళ్ళి ఏమైనా చేస్తే మనల్ని వాటి ప్రాణ రక్షణ కోసం కుడతాయి,లేక పోతే వాటి పాటికి అవి వెళ్ళి పోతాయి.మన శరీర పరిమాణంతో పోలిస్తే అవి చాలా చిన్నవి,మనకన్నా తెలివిలో కూడా చాలా తక్కువ కదా! ఆలోచించు ఎప్పుడైనా అటువంటి జీవుల్ని చూస్తే భయపడకుండా వెళ్ళాలి,తేలు,పాము వంటివి కనబడితే పెద్దలతో చెప్పాలి...అంతేగాని భయపడి పరుగెత్త కూడదు.ఆ చిన్న జీవులు మనల్ని ఏంచేస్తాయి? అవి కనబడితే మనమే చంపేస్తాము కదా!ఆలోచించు"అని మహీపతి గిరికి తగిన విధంగా చెప్పి గిరిలోని భయాన్ని తొలగించాడు!
       గిరి కరివేపాకు కొనుక్కుని గారడీ వాడి గారడి భయం లేకుండా చూసి,ఒక రూపాయ గారడీ వాడి బట్ట మీద వేసి భయం పోగొట్టుకున్న గిరిగా ఇంటికి చేరాడు.