మరుగుజ్జు రాక్షసుడి విద్యలు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445


  ఒక కీకారణ్యంలో ఒక రాక్షస  గుంపు ఉండేది.ఆ గుంపులో ఒక మరుగుజ్జు రాక్షసుడు ఉండేవాడు. వాడు మిగతా రాక్షసుల మోస్తరు సింహం,పులి వంటి జంతువులను వేటాడలేక పోయేవాడు!ఆకారంలో పెద్దగా ఉన్న రాక్షసులతో పోటీ పడి పరుగెత్తలేక పోయేవాడు. పెద్దరాక్షసులకు మరుగుజ్జు రాక్షసుడంటే చులకన.తరచూ వాడిని పెద్ద రాక్షసులు ఏడిపింఛే వారు!

       మరుగుజ్జు ఎంతో కాలం అవమానాలను భరించాడు, ఇక వాడికి ఓపిక నశించి,ఏది ఏమైనా ఆ రాక్షస గుంపు నుండి విడిపోయి విడిగా బతకాలనుకొని మిగతా ఎవ్వరికీ తెలియకుండా అడవిలో నడచుకొంటూ వెళ్ళి ఒక ఊరుకు చేరుకున్నాడు,ఎవరి కంటా పడకుండా జాగ్రత్తగా చెట్ల చాటున నక్కి ఒక దేవాలయం వద్దకు వెళ్ళాడు.అక్కడమంటపంలో ఒక మరుగుజ్జు మనిషి నిలబడి చుట్టూ ఉన్న మనుషులకు భగవంతుడి లీలలను గురించి ప్రవచనాలు,పద్యాలు చెబుతున్నాడు. చుట్టూచేరిన జనం చప్పట్లు కొడుతున్నారు!

       మరుగుజ్జు రాక్షసుడు ఆ మరుగుజ్జుమనిషిని చూసి ఆశ్చర్యపోయాడు,ఎందుకంటే చుట్టూ ఉన్న ఎత్తైనమనుషులకన్నా మరుగుజ్జు ఎంతో తెలివిగల వాడుగా ఉన్నట్టు మరుగుజ్జు రాక్షసుడు గ్రహించాడు.ఏదైనావిద్య ఉంటే చుట్టూ ఉన్న వారు గౌరవిస్తారని కూడా వాడుతెలుసుకున్నాడు.

        తన తోటి రాక్షసుల నండి గౌరవం పొందాలంటే తనుకూడా  అడవిలోని రాక్షసులకు తెలియని విద్యలు నేర్చుకోవాలని నిశ్చయించాడు.

       దేవాలయం లో జనం వెళ్ళి పోయాక జాగ్రత్తగా ఎవరి కంటా పడకుండా ఆ మరుగుజ్జు మనిషి వద్దకు వెళ్ళాడు మరుగుజ్జు రాక్షసుడు.వాడిని చూసి భయపడి పోయాడు ఆ మరుగుజ్జు మనిషి.

       "అన్నా, నన్ను చూసి భయపడకు నీకు ఏ హానీ తల పెట్టను. మా తోటి పెద్ద రాక్షసులనుండి అవమానాలు భరించలేక అడవినుండి పారి పోయి వచ్చాను,నీవు కూడా మనుషుల్లో మరుగుజ్జువి అయినా నీ తెలివి అపారం, అందుకే నీకు తోటి మనుషులనుండి గౌరవం లభిస్తోంది.నిన్ను చూసాక నేను కూడా ఏవైనా విద్యలు నేర్చుకోవాలని అను-కొంటున్నాను" అని ఎంతో నమృతగా చెప్పాడుమరుగుజ్జు రాక్షసుడు.

        వాడు చెప్పిన మాటలకు మరుగుజ్జురాక్షసుడిపై మరుగుజ్జు మనిషికి సదభిప్రాయం కలిగింది.వాడిని గ్రామ పెద్దకు పరిచయం చేసి విద్యలు  నేర్చు కుంటాడని,రాక్షస జాతి వాడైనా మంచివాడని గ్రామ పెద్దకు తెలిపాడు మరుగుజ్జు మనిషి.

        "రాక్షసుడైనా మంచి బుద్ధితో విద్యలు నేర్చు కోవాలనుకున్నాడు కనుక విద్యలు నేర్పించు" అని గ్రామ పెద్ద తన అనుమతి ఇచ్చాడు.

        నేర్చుకోవాలన్న తపనతో సంవత్సరంలోనే కొంత చదువు,పద్యాలు, తాడుతో ఉచ్చువేసి జంతువులను పట్టడం, శాఖాహార ప్రాముఖ్యత,అడవిలో జంతువులను కాపాడితే జరిగే మేలు వంటి ఎన్నో మంచి విషయాలు వాడు నేర్చుకుని తన మరుగుజ్జు గురువు దగ్గర శెలవు తీసుకుని,అడవిలోకి వెళ్ళి పెద్ద రాక్షసులను కలసి తన విద్యలు ప్రదర్శించి, ఎన్నో మంచి విషయాలువారికి చెప్పాడు.

      వాడి విద్యలు చూసి ఆ రాక్షసులు ఆశ్చర్య పోయారు. వాడు విద్యలతో మిగతా రాక్షసులకంటే ఎంతో ఉత్తమంగా కనబడ్డాడు.

      అప్పటినుండి వాడిని గేలి చేయకుండా మిగతా రాక్షసులు గౌరవించడం మొదలు పెట్టారు.

      చూశారా రంగు,ఎత్తు,గౌరవం తీసుకరావు.మంచి గుణం,విద్య మాత్రమే సంఘంలో తగిన గౌరవం తెస్తాయి.