బొమ్మ చెయ్యాలి:-కంచనపల్లి వేంకట కృష్ణారావు.9348611445

 ."అమ్మా ,స్కూల్లో ఈ రోజు గుడ్డలు,దూదితో బొమ్మలు చేయడం నేర్పించారు"మెరుపు కళ్ళతో చెప్పింది చిన్నారి గీత.
          "అలాగా అమ్మా,మరి నీవు బొమ్మ తయారు చేశావా?" అడిగింది గీత అమ్మ సుధ.
        "చేశానమ్మా చిన్న కుందేలు బొమ్మ,కానీ అది సరిగ్గారాలేదు...చెయ్యంగ చెయ్యంగ బొమ్మ బాగా చెయ్యడం వస్తుందని మా టీచర్ చెప్పింది"
       "అవును కదమ్మా మీ టీచర్ నిజమే చెప్పింది"
      "అమ్మా,బొమ్మలు చేయడం,పెయింటింగ్ వేయడం,కొన్ని పనికి రాని వస్తువులతో బొమ్మలు చేయడం నేర్చుకుంటే,ఆ కళ ఎప్పటికైనా ఉపయోగపడుతుందనిచెప్పింది మా టీచర్"
        "అవును రా కన్నా దానినే 'హాబీ'తెలుగులో'అభిరుచి' అంటారు. కొందరు ఆ అభిరుచినే నమ్ముకుని దానితో  డబ్బులు సంపాదించుకుంటారు"చిరునవ్వుతో చెప్పింది అమ్మ సుధ.
       "మరి నీవు బొమ్మలు చేయడం నేర్చుకున్నావా?" అమ్మను అడిగింది గీత 
        "నేర్చుకున్నాను,వంట చేయడం,నాన్నమ్మను చూసుకోవడం వంటి ఇంటి పనులతో  బొమ్మలు చేయలేక పోయాను.ఇప్పుడు నీవు కాస్త పెద్దదానివి అయ్యావు కదా! ఇక ఎంచక్కా బొమ్మలు చేస్తాను.నీకు కూడా నేర్పిస్తాను...ఉండు నాన్నమ్మ చేసిన కొన్ని బొమ్మలు పెట్టలో ఉన్నాయి,నీకు చూపిస్తాను అంది.
       గీత ఇంతంత కళ్ళు చేసుకుని అమ్మతోపాటు బొమ్మల పెట్టె వద్దకు వెళ్ళింది.మంచం కింద ఉన్న ఒక పాత పెట్టెను అమ్మ సుధ లాగింది.
      జాగ్రత్తగా ఆ పెట్టె తీసేసరికి కొన్ని పింగాణీ బొమ్మలతో పాటు నాన్నమ్మ చేసిన ఎలుగుబంటి,కుందేలు,రామచిలుక,పావురం మొదలైన బొమ్మలు అందంగా కనబడ్డాయి.అవన్నీ చూసేసరికి గీత ఆనందం రెట్టింపు అయింది.ఆప్యాయంగా ఆ బొమ్మల్ని చేతిలోకి తీసుకుంది.
        "ఈబొమ్మలు అప్పట్లో నాన్నమ్మ తయారు చేసింది"అని బట్ట,దూదితో చేసిన బొమ్మలు చూపించింది.
      "ఇవేనా ఇంకా ఎక్కువ బొమ్మలు చేయలేదా?"అడిగింది గీత.
      "అప్పట్లో నాన్నమ్మ బోలెడు బొమ్మలు తయారు చేసింది.మరి ఇల్లు గడవాలంటే తాతయ్య జీతం ఒక్కటే సరిపొయ్యేది కాదు,నాన్నను చదివించడానికి, కొన్ని బొమ్మల్ని బొమ్మలు అమ్మే షాపు వాళ్ళకి అమ్మింది.నాన్నమ్మ బొమ్మలు చేసే కళను చూసి ప్రజాకళ సంఘం వారు ప్రదర్శనకు బొమ్మలు పెట్టి,అమ్మి నాన్నమ్మకు  డబ్బులు ఇచ్చారట! చూశావా ఒక్కొక్కసారి నేర్చుకున్న కళ ఎంతో ఉపయోగపడుతుంది,డబ్బే కాదు మంచి పేరు వస్తుంది,ఒక మంచి పని చేసిన తృప్తి మిగులుతుంది"చెప్పింది అమ్మ సుధ.
       అమ్మ చెప్పింది విని గీత చప్పట్లు కొట్టింది.
     "అమ్మా నేను కూడా చదువుకుంటూనే  మంచి బొమ్మలు చేయడం నేర్చు కుంటాను"ఆనందంతో చెప్పింది గీత.
       "తప్పకుండా నేర్చుకోరా....మంచి బొమ్మలు నీ చేత చేయించి స్కూల్లో నీ బొమ్మల ప్రదర్శన పెడదాం."
       ఆ రోజునుండే  బొమ్మలు చేయాలనే నిశ్చయానికొచ్చింది గీత.
       'బొమ్మలు ఎలా చెయ్యాలి?' అనే పుస్తకం కొనింది అమ్మ సుధ.
       కృషితో మంచి బొమ్మలు తయారు చేయసాగింది గీత.టీచర్లు, తోటి విద్యార్థులు గీత చేసిన బొమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు.