మేలు చేసే విషం!:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  "రాజారావ్ ఈ మధ్య మన యూనివర్సిటీ విద్యార్థి శేషు నల్లమల అడవులకెళ్ళి కొన్ని రకాల సాలీళ్ళను తెచ్చి మన ఎంటమాలజీ(entomology=పురుగుల్ని గురించి అభ్యసించే శాస్త్రం) డిపార్టుమెంట్ లో ప్రయోగశాలలో గాజు సీసాల్లో పెట్టాడు.వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే రెండు సాలిళ్ళు ఆఫ్రికా,దక్షిణ అమెరికాల్లో  ఉండే black widow(విష పూరిత సాలె పురుగు) రకం వంటివి.ఇవి కుడితే విపరీతమైన అలర్జీ వచ్చి నరాలు దెబ్బతిని మనిషి చని పోవడానికి అవకాశం ఉంది.అందుకే మనం  అన్నీ సమకూర్చుకుని,అంటే పురుగుల నుండి రక్షణనిచ్చే డ్రస్, పురుగులకు మత్తు లేక చంపివేసే రసాయనపు స్ప్రే తీసుకుని నల్లమల అడవులకు వెళ్ళాలి,ఎక్కువ సంఖ్యలో వాటిని తెస్తే వాటిని గురించి మనం పరిశోధన చేయవచ్చు"చెప్పాడు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ముకుందరావు.
         "మంచి విషయం చెప్పారు సార్,ఆ రకం సాలీళ్ళు దొరికితే మనం అదృష్టవంతులమే,మనుషులకు ఉపయోగ పడే బోలెడు మందులు మనం తయారు చేయవచ్చు,విషం కూడా ఆవిధంగా ఉపయోగ పడుతుంది"అన్నాడు రాజారావ్.
        విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ముకుందరావు,రాజారావులకు సాలీళ్ళ ప్రాజెక్టు కోసం నిధులు, రసాయనాలు,మిగతా పరికరాలు ఇచ్చాడు.ఆయనకు కృతజ్ఞతలు చెప్పి రెండురోజుల తరువాత విద్యార్థి శేషుతో కలసి నల్లమల అడవికి వెళ్ళారు, అడవి రక రకాల చెట్లతో పచ్చగా  ఉంది. 
అన్ని చెట్లు ఉండే సరికి అక్కడ స్వచ్చమైన ప్రాణ వాయువు మనసుకు,మెదడుకు ఎంతో హాయినిచ్చింది. అది పెద్ద అడవి కాబట్టి పులులు, ఎలుగు బంట్లు ఉండవచ్చు.వాటినుండి రక్షణ పొందడానికి ఒక రకమైన మత్తునిచ్చే గాస్ గన్ కూడా తీసుక వెళ్ళారు,ఎందుకంటే అడవి జంతువులను చంపకూడదు కదా! అందుకని.
       ముకుందరావు,రాజారావు,వాన్ డ్రైవర్,శేషు వాళ్ళ పరికరాలతో అడవిలోపలికి వెళ్ళారు.ప్రతి చెట్టును,చెట్ల కాండాల్లో ఉన్న తొర్రలను గ్లోవ్స్ ధరించిన చేతులతో పరిశీలించ సాగారు. ఒక చెట్టుకు చాలా చిక్కగా సాలె గూడు ఉంది! ఇంకా విశేషమేమిటంటే ఆగూటిలో ఒక చిన్న పక్షి చిక్కుకుని ఉంది దాని ప్రాణాలు ఎప్పుడో పోయాయి,ఎందుకంటే సాలె పరుగు దానిని కాటు వేసింది దాని విష ప్రభావం వలన చచ్చి పోయింది పక్షి,ఇక మెల్లగా సాలె పురుగును  ఆరగిస్తుందన్నమాట!
       పక్షిని చంపేంత విషం ఉన్న సాలె పురుగంటే అది ఖచ్చితంగా  'బ్లాక్ విడో'సాలె పురుగే అయి ఉంటుందని ముకుందరావు చెప్పాడు.వెంటనే రాజారావు చిన్న సిలెండర్ లోని మత్తు వాయువుని చెట్టు తొర్రలోకి పంపాడు, అంతే పది సాలీళ్ళు గబ గబా బయటికి వచ్చి మత్తుగా పడి పోయాయి.శేషు జాగ్రత్తగా వాటిని పట్టకారుతో తీసి తాము తెచ్చి ప్రత్యేక మైన పెట్టెలో వేశాడు. అందరూ కలసి మరి కొంత దూరం వెళ్ళే సరికి వెదురు చెట్లమీద సాలె పురుగు గూళ్ళు కనిపించాయి,బూతద్దం తో పరిశీలిస్తే అవికూడా బ్లాక్ విడో సాలీళ్ళు లాగే కనబడ్డాయి,వాటిని కూడా ప్రత్యేకంగా సేకరించి మరొక పెట్టెలో వేసుకున్నారు.
       అలా చాలా రకాలు సేకరించి  అందరూ తెచ్చుకున్న ఫలహారాలు తిని విశ్వవిద్యాలయం వైపు బయలు దేరారు.
               ******************
      అన్ని సాలెపరుగుల్ని ప్రయోగశాలలో భద్ర పరిచారు. ఇక వాటి విషాన్ని ప్రత్యేక పరికరం ద్వారా సేకరించడం మొదలు పెట్టారు.
    ఒక్కొక్కసారి పొరపాటు జరగవచ్చు కదా,ఆ విషం సేకరించే సమయంలో ఒక సాలీడు తప్పించుకుని ప్రయోగశాల బయటికి వెళ్ళి పోయింది.అలా వెళ్ళిన సాలీడు ఇటు అటు తిరిగి ఓ ఇంటి కప్పు మీదకు వెళ్ళింది.కప్పు మీద ఉన్న పగులులోకి వెళ్ళి కిందికి దిగి గూడు కట్టింది,ఒక రాత్రి  అది తన సాలె పురుగు దారం కిందికి వదలి దాని ద్వారా కిందకు దిగి అప్పుడే అటు వచ్చిన ఇంటి యజమానిని కుట్టింది అంతే ఆయనకు వంటినిండా దద్దుర్లు,మత్తు వచ్చాయి! వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుక వెళ్ళారు.డాక్టర్లకు ఏ పురుగు కుట్టిందో అర్థం కాలేదు,అయినా విషం విరుగుడుకు ఒక ఆంటీబయోటిక్, ఆంటీవెనిన్(విషవిరుగుడు మందు)ఇచ్చారు. ఆయన మెల్లగా కోలుకోసాగాడు.
         ఈ లోపల విశ్వవిద్యాలయంలోఅడవి నుండి తెచ్చిన సాలీళ్ళలో ఒకటి తక్కువ ఉన్నట్టు రాజారావు గమనించాడు.ఒక్కటి బయటకు వెళ్ళినా అది గుడ్లు పెట్టి దాని సంతతిని పెంచితే ప్రమాదకరం,అందుకనే ఆసుపత్రులకు ముకుందరావు,రాజారావులు హెచ్చరికలు జారీ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరు పురుగు కాటుకు గురిఅయ్యి చికిత్సతో కుదుట పడినట్టు తెలిసి,వెంటనే ఆసుపత్రికి వెళ్ళి ఆవ్యక్తి చిరునామా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిశీలిస్తే కప్పు లోపల సాలె పురుగు గూడు, అడవిసాలె పురుగు కనబడ్డాయి.వెంటనే దానిని పెట్టెలోకి జాగ్రత్త గా పెట్టాడు శేషు.
     "సార్, సాలె పురుగు మీద పరిశోధనలెందుకు?వాటివలన ఉపయోగం ఏమిటి?" అడిగాడు సాలెపురుగు కాటునుండి కోలుకున్న ఆ ఇంటి యజమాని.
        "సాలె పురుగు విషంగానీ, పాము విషంగానీ,సముద్రంలో దొరికే కొన్ని రకాల చేపల విషం గానీ మందులలో ఉపయోగ పడతాయి,కొన్ని రకాల కాన్సర్లు, కీళ్ళ నొప్పులు,చర్మవ్యాధుల్లో ఉపయోగ పడే మందుల్లో వాడతారు.అందుకే మన నల్లమల అడవుల్లో కొత్తగా కనుక్కున్న బ్లాక్ విడో అనే సాలె పురుగుల్ని తెచ్చి పరిశోధనలు చేస్తున్నాం"వివరించాడు శేషు.
       "అవురా, విషం కూడా మేలు చేస్తుంది కదా!" అని ఆశ్చర్య పోయాడు ఆయన.
(Arachnid అనే సినిమా చూశాక వచ్చిన ఆలోచనే ఈ కథ)