బహుమతి వద్దు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  కందర్ప దేశ రాజు గారికి కళలంటే మక్కువ.కవులు,శిల్పకారులు,చిత్రరకారుల్ని సన్మానించేవాడు.
       ఒకరోజు రాజుగారు సభలో కొలువు తీరి ఉండగా, ద్వార పాలకుడు ఒక వ్యక్తిని సభలోకి తీసుక వచ్చాడు.అతని చేతిలో ఒక చిన్న బరిణె ఉంది.ద్వారపాలకుడు ఈ విధంగా చెప్పాడు.
       "మహారాజా,బట్టలు కళాత్మకంగా నేయడంలో ఈయన నేర్పరి.ప్రత్యేకంగా మీ కోసం ఈ బరిణె లో మీ తలపాగకు సరిపోయే బట్ట తీసుకవచ్చాడు,అది మీకు సమర్పిస్తాడట"చెప్పాడు ద్వారపాలకుడు.
      "అంత చిన్న బరిణెలో అంత పెద్ద తలపాగ గుడ్డనా!"అని రాజు గారు ఆశ్చర్యపోయి "ఏది చూపించు"అని ఆసక్తిని కనబరిచాడు.
        నేత కళాకారుడు బరిణె మూత తీసి అతి పలుచనైన అందమైన పెద్ద వస్త్ర్రాన్ని బయటకు తీశాడు.
         రాజుగారితో పాటు సభికులందరూ ఆశ్చర్యపోయారు.రాజుగారు అతని కళాత్మక పనితనాన్ని పొగిడి,తన మెడలోని ముత్యాలు పొదిగిన బంగారు హారం ఇవ్వబోయాడు.
       "మహారాజ మీ బహుమానం వద్దు"అన్నాడు ఆ కళాకారుడు.
       రాజుతో పాటు కళాకారులందరూ అతని తిరస్కరణను చూసి ఆశ్చర్యపోయారు.
         "ఎందుకు వద్దంటున్నావు"అడిగాడు రాజు.
        "ఎందుకంటె మీరిచ్చిన బహుమతి నా ఒక్కడికే తృప్తినిస్తుంది,దయచేసి తమరు మా చేనేత కళాకారులందరినీ గుర్తించి తగిన చేయూతనిస్తే వారు మరిన్ని కళాత్మకమైన వస్త్రాలు నేయగలుగుతారు,అదిగాక మన వస్త్రాలు విదేశాల్లో అమ్మితే విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుంది.ఆ ధనంతో ప్రజలకు ఉపయోగ పడే పనులెన్నో చేయవచ్చు"అని వినయంగా చెప్పాడు.
   "నీ ఆలోచన అధ్బుతం,ఇన్నాళ్ళు నేను కొన్ని కళలకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాను.ఇక మీదట చేనేత కళాకారుల్ని కూడా ప్రోత్సహిస్తాను.అయినా నీవు ఈ బహుమతి తీసుకో,మీ చేనేత కళాకారులందరినీ నన్ను  కలవమను,వారి సూచనలుకూడా తీసుకుని చేనేత కళ అభివృద్ధికి ప్రణాళిక రచిస్తాను"అని చెప్పాడు రాజు.
        రాజు గారికి జేజేలు పలికి చేనేత కళాకారుడు వెళ్ళి తోటి కళాకారులకు చెబితే వారు అతని నిస్వార్థతను పొగడడమే కాకుండా,తమందరికి మంచి జరగడం గురించి ఎంతో సంతోషించారు.