వైద్య విద్య:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445


  గరివిడిలో ఆనందుడు మంచి విద్యార్థి,ఆలోచనా పరుడు.పాఠశాలలో మంచి పేరు తెచ్చుకున్నాడు.

       ఒకసారి ఆనందుడి తాతయ్యకు జ్వరం వచ్చి బాగా నీరస పడ్డాడు.చికిత్స కోసం ఆయనను పక్కఊరి వైద్యుడు వద్దకు తీసుక వెళ్ళాల్సివచ్చింది.గరివిడిలో మంచి వైద్యుడులేడు!

       అందుకే  తను భవిష్యత్తులో వైద్య విద్య అభ్యసించి గరివిడిలో మంచి వైద్యశాల నిర్మించి ప్రజలకు మంచి వైద్యం అందివ్వాలని  ఆలోచన చేశాడు.అతని ఆలోచనను పాఠశాల ఉపాధ్యాయులు కూడా మెచ్చుకున్నారు.

        అలా ఆనందుడు బాగా చదివి మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు. విజయనగరం వెళ్ళి ధన్వంతరి అనే ప్రముఖ వైద్యుడి వద్ద శిష్యరికానికి చేరాడు.

         ధన్వంతరి ఆనందుణ్ణి అనేక విధాల పరీక్షించి వైద్య విద్యకు అతను తగిన వాడని నిర్ణయించి వైద్య విద్యను బోధించ సాగాడు.విద్య త్వరగా నేర్చుకోవాలనే ఆతృత ఉన్నట్టు గ్రహించాడు ధన్వంతరి.

     "నాయనా,వైద్యవిద్య త్వరగా నేర్చుకోవాలనే తొందర పనికి రాదు.ఒకే రోగం ఉన్న ఇద్దరు రోగులకు వారి శరీర తత్వాన్ని బట్టి చికిత్స చేయవలసి ఉంటుంది.వైద్య విద్య కంటే ముందు శరీర నిర్మాణం,మన శరీరాల్లో జరిగే మార్పులు మొదలైన ఎన్నోవిషయాలు తెలుసుకోవాలి"వివరించాడు ధన్వంతరి.

      "తప్పకుండా మీరు చెప్పినట్టు నడచుకుంటాను"అని నమస్కారం పెట్టి చెప్పాడు ఆనందుడు.

      ఆరోజు నుండి ధన్వంతరి వైద్యంలోని అనేక సూక్ష్మాలను బోధించసాగాడు.వచ్చిన రోగుల రోగ విషయాలను వివరిస్తూ ఏమందులు వాడాలో వివరంగా తెలుప సాగాడు.శిష్యులందరూ ఆయన చెప్పినవి ఆకళింపు చేసుకుంటూ పుస్తకాలలో వ్రాసుకుంటున్నారు.

        ఒకరోజు ధన్వంతరికి పక్క పట్టణంలో ఏదో పని పడింది.

        శిష్యులందరినీ పిలిచి," నేను పట్టణానికి పని మీద పోతున్నాను,రేపు వస్తాను,ఈ లోపల మీరు వైద్యగ్రంథాలు చదువుకోండి రోగులు వస్తే రేపు రమ్మని మని చెప్పండి"అని చెప్పి గుర్రబండీలో వెళ్ళిపోయాడు.

        రెండోరోజు పొద్దున్నే  కొందరు వైద్యశాలకు ఒక రోగిని తీసుక వచ్చారు.శిష్యులు వెళ్ళి"మా గురువుగారు ఊరెళ్ళారు,బహుశా మధ్యాహ్నానికి రావచ్చు"అని చెప్పారు.

        ఆ మాటలు విన్న ఆనందుడు లోపలనుండి పరుగున వచ్చి వారిని,"ఏమిటి సమస్య?" అని అడిగాడు.

       "కుడి భుజంలో అమిత నొప్పిగా ఉండి,చెయ్యి ఎత్తలేక పోతున్నాడు"అని రోగిని చూపించి చెప్పారు.

        "అయ్యా,ఇటువంటి చెయ్యినొప్పికి మా గురువు గారు చికిత్స చేస్తుంటే బాగా గమనించాను. మందులు కూడా నాకు తెలుసు.నేను మీకు మంచి చికిత్స చేస్తాను"చెప్పాడు ఆనందుడు.

      మిగతా శిష్యులు  ఆనందుణ్ణి పక్కకు తీసుకవెళ్ళి

"వద్దు,ఆనందా నొప్పి చికిత్సలు మనకు పూర్తిగా తెలియదు,ఏమైనా అవుతే గురువుగారు కోప్పడతారు"చెప్పారు.

      "అలా భయపడకూడదు,మనం ప్రయత్నిస్తేనే కదా మనకు విద్య మీద పట్టు వచ్చేది"గబగబా తనకు తెలిసిన మూలికలు నూరి రోగికి పట్టు వేశాడు.ఒక కషాయం కూడా రోగి చేత మింగించాడు.

        కొంచెం సేపటిలో భుజం ఎర్రగా వాచింది,తీవ్రమైన నొప్పితో రోగి ఆహాకారాలు చెయ్యసాగాడు. ఆ హఠాత్పరిణామానికి ఆనందుడు,శిష్యలు బెదిరి పోయారు! అలా సంభవిస్తే ఏంచేయాలో తెలియక ఆనందుడు వైద్య గ్రంథాలు తిరగెయ్యసాగాడు.దానికి విరుగుడు చికత్స కనబడలేదు.

       "అయ్యో, సగం జ్ఞానంతో చికిత్స చేశానే"అని ఆనందుడు భయపడసాగాడు.

      అదృష్టవశాత్తు అప్పుడే ధన్వంతరి తిరిగి వచ్చాడు. ఆనందుడి చికిత్సను గురించి తెలుసుకున్న ధన్వంతరికి చాలా కోపం వచ్చింది.అయినా తన కోపాన్ని అదుపులో ఉంచుకుని ఆనందుడు,మిగతా శిష్యులతో ఈ విధంగా చెప్పాడు.

      "వైద్యం ఒక్కొక్క రోగికి ఒక్కొక్క విధంగా అతని శరీర తత్వాన్ని పట్టి ఉంటుంది, ఇష్టమొచ్చినట్టు మందులు ఇస్తే విపరీతమైన పరిణామాలు సంభవించ వచ్చు,అప్పట్లో నేను చికిత్స చేసిన రోగికి ఎడమ చెయ్యి నొప్పి,ఇతనికి కుడి చెయ్యినొప్పి,కొంత గుండె సంబంధమయిన  వ్యాధి కూడా ఉంది.అందుకే మందు మార్చి ఇవ్వాలి,ఈ సూక్ష్మం తెలియక ఆనందుడు చికిత్స చేశాడు" అని వేరే గుళికలు,పసరు మందు ఇచ్చాడు.కొద్ది సేపటిలోనే ఆరోగి కోలుకున్నాడు.వైద్య వృత్తిలో తొందర పనికి రాదని,అవగాహన ముఖ్యమని  ఆనందుడు మిగతా శిష్యులు తెలుసుకున్నారు.అందరూ గురువుగారి వద్ద వైద్యవిద్యలో ఎన్నో మెళకువలు తెలుసుకుని నిష్ణాతులయ్యారు.

        ఆనందుడు ఐదు సంవత్సరాల తరువాత గరివిడికి వెళ్ళి మంచి వైద్యశాల స్థాపించి ప్రజలకు అత్యుత్తమ సేవ చేయసాగాడు.