మా ఊర్లోనే పుట్టింది:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445
   ఆలూరు,ఆస్పిరి  గ్రామాల మధ్య కోళాంగిణీ దేవి గ్రామ దేవత ఆలయం ఉంది.ఆ దేవత చాలా మహత్తు గల దేవత అని ఇరు గ్రామాలవారి నమ్మకం.నిజానికి ఆ దేవతకు మొక్కుకుని తమ కష్టాలు చెప్పుకుని ముడుపు చెల్లిస్తే ఆ దేవత కరుణతో వారి కష్టాలు సమసి పోతాయని ఇరు గ్రామాల ప్రజల  అనుభవ పూర్వక నమ్మకం.
        ఇలా ఉండగా ఆలూరులో ఒకతను పురాతన ఇంటిని బాగు చేయించడానికి గోడను పగుల గొట్టించాడు.అందులో అతనికి ఒక ఇత్తడి పెట్టె దొరికింది,దాని మూత జాగ్రత్తగా తీసి చూస్తే అందులో ఒక తాళపత్ర గ్రంథం దొరికింది.అందులో సంస్కృతంలో ఏదో వ్రాసి ఉంది.
        తనకు తెలిసిన పరమేశ్వర శాస్త్రి చేత చదివిస్తే అందులో కోళాంగిణీ దేవి ఆలూరు కొండ గుహలో కొన్ని వందల సంవత్సరాలక్రితం తపస్సు చేసినట్టు శ్లోకాలు ఉన్నాయని చెప్పాడు.
          కోళాంగిణీ ఆలయం పూజారి ఆలూరులోనే ఆమె పుట్టిందని, ఆ దేవత తమ ఊరు దేవతే అని అందరికీ చెప్ప సాగాడు.ఈ విషయం కర్ణాకర్ణిగా ఆస్పిరిలో కోళాంగిణీ దేవి భక్తుడయిన వీరన్నకు తెలిసింది.అంతే అతనిలో ఆలూరు గ్రామం మీద ఒక విధమైన ఈర్ష్య ఏర్పడింది! కోళాంగిణీ దేవి ఆస్పిరిలోనే పుట్టిందని అతని ప్రగాఢ నమ్మకం.మరి తనకు కూడా ఒక సాక్ష్యం దొరుకుతే బాగుండు అనుకున్నాడు.ఈ విషయం తన స్నేహితుడు,పండితుడైన శివరామయ్యతో చెప్పాడు.ఆయన కూడా  కోళాంగిణీ దేవి భక్తుడే! 
        "అదేమిటి?కోళాంగిణీ దేవి ఆస్పిరిలోనే పుట్టింది,పద నీకు సాక్ష్యం చూపిస్తాను అని వీరయ్యను తీసుకుని ఆస్పిరి పొలిమేరలో ఉన్న శిరకోన కొండ దగ్గరకు తీసుక వెళ్ళాడు.కొంచెం కొండ ఎక్కగానే ఒక గుహ ఉంది అందులో గుహ గోడకి కోళాంగిణీ దేవి చిత్రం(విగ్రహం కాదు) చెక్కి ఉంది.
       "అది చూపించి శివరామయ్య ఇంతకన్నా సాక్ష్యం ఏంకావాలి?ఆమె మన ఊర్లోనే పుట్టి ఇక్కడే ఆడుకుని ఈకొండ గుహలోనే ఆధ్యాత్మిక ఊహలతో దేవతా రూపం పొందింది,తరువాత కొండ దిగి వెళ్ళి మనగ్రామం ఆలూరు మధ్యలో ఉండిపోయింది,అందుకే అక్కడ దేవాలయం కట్టారు"అని వివరించాడు శివరామయ్య.
       "ఈ విషయం తేల్చాల్సిందే"అని వీరయ్య ఆవేశంగా అన్నాడు.
         వీరయ్య,శివరామయ్య ఇద్దరూ కలసి కోళాంగిణీ ఆలయపూజారి వద్దకు వెళ్ళి దేవి ఆస్పిరిలోనే పుట్టినట్టు చెప్పారు.అక్కడే ఉన్న కొంత మంది భక్తులు "కాదు మా ఊరిలోనే మాత పుట్టింది"అన్నారు.ఈ విషయం శాంతియుతంగా ఉన్న  రెండు గ్రామలమధ్య చిచ్చుగా తయారయ్యింది! చిలికి చిలికి గాలి వానలా విషయం పెద్దదైపోయింది!
         ఒకరోజు ఊరిలో ప్రవచనాలు చెప్పేందుకు చంద్రశేఖర సరస్వతి అనే జ్ఞాని వచ్చాడు.కోళాంగిణీ దేవి పుట్టుకను గురించి రెండు గ్రామాలలో జరుగుతున్న అనవసరపు చర్చను గురించి తెలుసుకున్నాడు.వారి అజ్ఞానానికి ఆయన నవ్వు కన్నాడు.
         రెండు గ్రామాల పెద్దలను,పూజార్లను పిలిపించి ఒక సభ ఏర్పాటు చేసి ఈవిధంగా చెప్పాడు.
         "చూడండి,పెద్దలారా కోళాంగిణీ దేవత మహిమాన్వితురాలుగా మనందరికి తెలుసు,దేవత ఎక్కడ పుట్టినా అందరినీ తన కన్నబిడ్డల్లాగ కాపాడుతోంది,కష్టాలు తీరుస్తోంది.ఒక దేవుడైనా,దేవత అయినా ఆఖరికి అందరికీ మేలు చేసే వైద్యుడైనా,ప్రజలకు ఉపయోగపడే మందునో,వస్తువునో కనిపెట్టిన శాస్త్రజ్ఞడయినా ఎక్కడ పుట్టాడనేది అనవసరం,అతని వలన లేక ఆమె వలన జరిగే మేలును మాత్రమే మనం తలచుకోవాలి.దేవతలకి,దేవుళ్ళకి  వారు పుట్టిన ప్రదేశం మాఊరు,మా ప్రాంతం అని శత్రుత్వం పెంచుకుంటే,మనకన్నా అల్పజీవులు ఎవరూ ఉండరు,పెద్ద మనసుతో ఆలోచించండి"అని అందరికీ కనువిప్పు కలిగేలా చెప్పారు చంద్రశేఖర సరస్వతి.
         రెండుగ్రామాల పెద్దలు ఆలోచనలో పడిపోయి వారి సంకుచిత ఆలోచనలు తెలుసుకుని, చంద్రశేఖర సరస్వతికి నమస్కారాలు పెట్టి ఇక ఆ విషయానికి స్వస్తి చెప్పి,ఎప్పటిలాగే కోళాంగిణీ మాతను కొలుస్తూ
అందరూ సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లారు.
(ఇప్పుడు కూడా ఇటువంటి అల్ప విషయాల మీద టివి ల్లో చర్చలు వాదోప వాదాలు జరుగుతుంటాయి,ఇప్పటికైనా  ప్రాజ్ఞలు అర్థం చేసుకుని ఆలోచిస్తే కాలహరణం కాకుండా అందరికీ మంచిది)
                 ^^^^^^^^^^^^^