మంచి గుణం:---కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

 గణపతికి చిన్న వ్యాపారం ఉంది.ఆ వ్యాపారం కూడా నీతి,నియమం తో చేస్తూ ఊర్లో మంచి పేరు తెచ్చు కున్నాడు.ఉన్నంతలో ముగ్గురు బీద విద్యార్థులను చదివిస్తున్నాడు. నలుగురు బీద వాళ్ళకి ప్రతి ఆదివారం పౌష్టిక ఆహారం పెడుతున్నాడు.
      ఒకరోజు  వ్యపార నిమిత్తం పొరుగూరికి బండిమీద వెళ్ళి ఒక అడవి గుండా వస్తున్నాడు. ఇంతలో ఆకాశం మేఘావృతమై వాన పడ సాగింది.గణపతి బండిని ఆపి ఎక్కడైనా తలదాచుకుందుకు చోటు దొరుకుతుందేమో అని వెతక సాగాడు. దూరంగా ఒక చిన్న ఇల్లు కనబడింది.వెంటనే బండిలో ఆ ఇంటి వద్దకు వెళ్ళి "అయ్యా"అని గట్టిగా పిలిచాడు.
         లోపలి నుండి ఒక వృద్ధుడు బయటకు వచ్ఛి"అయ్యో, తడిసి పోతున్నావు, లోపలికి రా నాయనా,అని పిలిచి తల తుడుచుకుందుకు పొడి బట్ట ఇచ్చాడు.
       "భోజనం వేళ అయింది,కాస్త భోజనం వండుతాను తిను"అని చెప్పాడు.
    "తాత గారు మీకెందుకు శ్రమ,వాన తగ్గితే ఇంటికి వెళ్ళి భోంచేస్తాను"అని అన్నాడు గణపతి.
        "ఈరోజు నీవు నా అతిథివి,కాదనకు అరగంటలో వండుతాను,ఇద్దరం కలసి తిందాము" అన్నాడు వృద్ధుడు.
     "సరే తాత గారు"అని గణపతి ఒప్పు కున్నాడు.
       చెప్పినట్టుగానే వృద్ధుడు చకచకా అరగంటలో గుమగుమ లాడే వంటచేశాడు.
      "నాయనా, గుమ్మం బయట గంగాళంలో నీళ్ళు ఉన్నాయి కాళ్ళు చేతులు కడుక్కునిరా"అన్నాడు
గణపతి కాళ్ళు, చేతులు కడుక్కుని వచ్చి నేరుగా భోజనానికి కూర్చున్నాడు.
       వృద్ధుడు విస్తరి వేసి "దైవ ప్రార్థన చేసుకో,వడ్డిస్తాను"అని అన్నాడు.
        "తాత గారు,మీరు ఏమీ అనుకోకండి,నాకు దైవం మీద నమ్మకం లేదు,మంచిగా ఉంటే చాలు అని నమ్ముతాను"అని చెప్పాడు.
        వృద్ధుడు గణపతి వైపు ఆశ్చర్యంగా చూసి"మరి నీవు నీకు చేతనైనంతలో ఎవరికైనా సహాయం చేస్తుంటావా?" అని అడిగాడు.
         "నేను బీద విద్యార్థులను చదివిస్తున్నాను.కొందరు బీద వాళ్ళకి అన్నదానం చేస్తుంటాను"అని చెప్పాడు గణపతి.
         "చాలు నాయనా,నీవుచేసేవి ఉత్తమమైన పనులు"అని భోజనం వడ్డిస్తూ "ఇతనికి తెలియకుండానే తన మంచి పనులతో దైవాన్ని పూజిస్తున్నాడు"అని మనసులో అనుకున్నాడు వృద్ధుడు.
        వాన ఆగిపోయింది, చల్లని గాలి వీచింది.
                    
కామెంట్‌లు