నమ్మకమే పునాది:-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  వెంకటాద్రి సేవా తత్పరుడు.ఎవరికి ఏకష్టం వచ్చినా ముందుంటాడు.అది పెళ్ళి అయినా,చావు అయినా.ఒక్కొక్కసారి తన డబ్బు ఖర్చు పెట్టి వారికి సహాయం చేసేవాడు.

        ఒక సంవత్సరం ఊర్లో ఒక వింత వ్యాధి ప్రభలింది! కొంతమంది పెద్దవారు,చిన్నపిల్లలు కూడా అజీర్ణం,కడుపునొప్పి, కళ్ళు మంటలతో బాధ పడసాగారు!

        ఊర్లో ఉన్న ఒక ఆసుపత్రి సరిపోవడం లేదు.అదిగాక అక్కడి వైద్యుడు మహా స్వార్థ పరుడు.

     విపరీతంగా మందులకు,చికిత్సకు డబ్బు వసూలు చేసేవాడు.అసలే విషమ పరిస్థితులు, బీదలకు మరీ జీవితం దుర్భరమయి పోయింది.

       ఈ పరిస్థితుల్లో వెంకటాద్రి తీవ్రంగా ఆలోచించి,తన కున్న పొలాల్లో ఒక ఎకరం అమ్మివేసి ఒక చిన్న వైద్యశాల నిర్మించి,పక్క ఊరిలో తనకు తెలిసిన వైద్యుణ్ణి తమ ఊరికి వచ్చి తన వైద్యశాలలో ఉచిత చికిత్స చేయమని ఆర్థించాడు.తను మంచి జీతం కూడా ఇస్తానని చెప్పాడు .ఆయన మంచితనం తెలిసిన వ్యక్తి కనుక రోజూ పొద్దున ఏడు గంటలనుండి రెండు గంటల వరకు వైద్యం చేసి తన ఊరుకు వెళతానని మాట ఇచ్చాడు వైద్యుడు.

        మాట ప్రకారం ఆ వైద్యుడు వెంకటాద్రి వైద్యశాలలో చికిత్స చేయ సాగాడు.వైద్యుడు చికిత్స చేస్తున్నంత సేపు వెంకటాద్రి వైద్యశాలలో ఉంటూ వైద్యుడికి సహాయ పడుతూ,ఆయన ఇచ్చే మందులను గమనిస్తూ తన వంతు సహాయం చేయ సాగాడు వెంకటాద్రి.

         ఒకరోజు అత్యవసర పనిబడి వైద్యుడు వైద్యశాలకు రాలేక పోయాడు.మరి పొద్దున నుండే రోగులు రాసాగారు.

       వెంకటాద్రి వైద్యుడు చేసే వైద్యం చూసి ఉన్నాడు కనుక,రోగుల రుగ్మతలను బట్టి మందులు ఇవ్వ సాగాడు.

          ఒక రోగి చేతి మీద వాపుతో వచ్చాడు. దేవుడి మీద భారం వేసి కంటి వాపుకు వాడే మందు ఇచ్చాడు.చిత్రంగా రెండోరోజుకు అతని చేతి వాపు తగ్గి పోయింది!

         మూడో రోజు వైద్యుడు వచ్చాడు,వెంకటాద్రి ఇచ్చిన మందులతో చాలా మందికి వారి రోగ బాధలు నయమయ్యాయి.

         చేతి వాపు రోగి వస్తూనే వెంకటాద్రి తాను ఇచ్చిన మందు చూపించి అది ఇచ్చినట్లు చెప్పాడు.అశ్చర్యపోవడం వైద్యుడి వంతు అయింది.ఎందుకంటే ఆ మందు సున్నితమైన కంటి వాపు మీద మాత్రమే పని చేస్తుంది,చేతి వాపు మీద పని చెయ్యదు,అయినా పని చేసింది!

       "వెంకటాద్రిగారు, మీది మంచి మనసు, రోగి మీ మీద పూర్తి నమ్మకం ఉంచి మందు వాడాడు.అందుకే అతనికి వాపు తగ్గి పోయింది,మంచివాళ్ళకి ఆ పై వాడి సహాయం కూడా ఉంటుంది.కానీ,నాది ఒక విన్నపం తమరు దయచేసి తెలియని జబ్బులకు తెలియని మందులు ఇవ్వకండి,ఒక్కొక్కసారి మందు పడక పోతే  రోగులకు తీవ్ర విపరీత గుణం కలగవచ్చు" చెప్పాడు వైద్యుడు.

          "అవును ఈ విషయం నాకు తెలుసు కానీ రోగి బాధ చూడలేక ఇచ్చాను,ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోగానీ మిడి మిడి జ్ఞానంతో వైద్యం చేయను"అని చెప్పి వెంకటాద్రి తాను చేసే సేవల్లో జాగ్రత్త వహించ సాగాడు.