అభ్యాసం ( పునఃకథనం) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒక ఊరికి ఆనందసేనుడు అని ఒక రాజు వుండేవాడు. ఆనంద సేనునికి తనను అందరూ పొగడాలని, మెచ్చుకోవాలని కోరిక. ఒకసారి రాణితో కూర్చుని మాట్లాడుతా వుంటే ఆమె భుజమ్మీద ఒక ఈగ వాలింది. రాజు రాణిని కదలవద్దని సైగ చేసి, కత్తి తీసి ఆమె భుజానికి ఏమీ కాకుండా సర్రున దాన్ని రెండు ముక్కలుగా నరికాడు.

తరువాత రాణిని చూస్తూ "ఎలా వుంది నా కత్తి విద్య" అని అడిగాడు. దానికామె “ఏముంది ప్రభూ! అభ్యాసం చేస్తే ఎవరయినా చేస్తారు" అంది. తనను మెచ్చుకోకపోగా అభ్యాసం చేస్తే ఎవరయినా చేస్తారు అన్నందుకు రాజుకు చానా కోపమొచ్చింది. వెంటనే ఆమెను అంతఃపురంలోనే బంధించి, అక్కడకు రావడం మానివేశాడు.
రాణి వున్న అంతఃపురంలో ఒక ఏనుగు వుంది. కొంతకాలానికి అది ఒక పిల్లను ఈనింది. రాణి ఒక పెద్ద పళ్లెం తెచ్చి అందులో ఏనుగు పిల్లను కూర్చోబెట్టి రోజూ ఎత్తడం మొదలు పెట్టింది.
మొదట్లో అది చానా కష్టంగా వుండేది. కానీ రోజూ అలా మోస్తా వుంటే ఆమెకు నెమ్మదిగా అలవాటయిపోయింది. సులభంగా చిరునవ్వుతో ఎత్తసాగింది.
ఆ ఏనుగు పిల్ల రోజు రోజుకీ పెరిగి పెద్దవసాగింది. రాణి రోజూ ఎత్తుతా వుండడంతో ఆమెకు ఎప్పుడూ పెద్దగా బరువు అనిపించలేదు. కొంతకాలానికి ఆ ఏనుగు పూర్తిగా పెరిగి పెద్దగయింది.
రాణి ఏనుగును అవలీలగా పైకి ఎత్తుతుందన్న విషయం నెమ్మదిగా రాజ్యమంతా తెలిసిపోయింది. ఆ విషయం తెలిసిన రాజు ఆశ్చర్యపోయాడు. "రాణేంది, ఏనుగునెత్తడమేంది" అంటూ వచ్చి చూశాడు. ఆమె రాజు ముందే అవలీలగా ఏనుగును పైకెత్తింది. అది చూసి రాజు “అంత బరువును అంత సులభంగా ఎలా పైకి లేపావు" అని అడిగాడు.
దానికి రాణి "ఏముంది ప్రభూ! అభ్యాసం చేస్తే ఎవరయినా చేస్తారు. పట్టుదల వుంటే సాధ్యం కానిది ఏముంది" అంది.
రాజుకు రాణి మాటలకు అర్థం అప్పుడు బోధపడింది.
“అనవసరంగా రాణిని ఖైదు చేశానే" అని బాధపడ్డాడు. ఆమెని విడిపించాడు. మరలా వారు ఎప్పటిలాగానే హాయిగా కాలం గడపసాగారు.