స్వచ్ఛమైన మనసు:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్ నెంబర్.9491387977.

 మాధవాపురం అను ఊరిలో మాధవయ్య,మణయ్య అను ఇద్దరు రైతులు ఉండేవారు.మాధవయ్య పేద కుటింబీకుడు.ఆకలి విలువేంటో తెలిసినవాడు."అమ్మా ఆకలి.ఓ ముద్ద ఉంటే పెట్టు తల్లీ"అని నోరు తెరిచి ఎవరడిగినా తను తింటున్న పల్లెంలో నుండి ఓ ముద్ద తీసి పెట్టేవాడు.అందువల్ల ఆఊరి జనం అతన్ని గౌరవించి అతను ఎదురైనప్పుడల్లా అతనికి దండాలు పెట్టేవారు.
ఇక రెండో రైతైన మణయ్య ధనిక కుటుంబం నుండి వచ్చినవాడు.అహంభావం ఎక్కువ.పిల్లికి బిచ్చం పెట్టినవాడు కాడు.ఎవరికి సహాయం చేసినవాడు కాడు.అందువల్ల జనం అతనికి విలువనిచ్చే వారుకారు. వీధుల్లో అతను ఎదురైనా మందలించకుండ వెళ్ళిపోయేవారు.
దాంతో అతనిలో"వీల్లెందుకు నన్ను గౌరవించడం లేదు. అదే మాధవయ్యను ఎందుకు గౌరవిస్తున్నారు?" అన్న అనుమానం అతని మనస్సులో మొలకెత్తింది.తన అనుమానం నివృత్తి చేసుకొనుటకై తన మిత్రుడైన రమణయ్యను కలిసి తన బాధ చెప్పుకున్నాడు.వెంటనే రమణయ్య"చూడు మిత్రమా! మాధవయ్య దేహీ అని చేయిచాపిన వారికి తృణమో ఫణమో సాయం చేస్తాడు. అంతేగాకుండా తాను తినే దాంట్లో నుండి ఆకలి అని అడిగే వారికి ఓ ముద్ద పెడుతుంటాడు.దాంతోబాటు రోజూ గురు ఆశీర్వాదం తీసుకుంటాడు.కాన నీవు కూడా అలాచేయ్."అని సలహా ఇచ్చాడు.
          ఆ సలహాను పాటించి కొంత మారాడు అయినా అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళీ మితృని దగ్గరకెళ్ళి తన మీమాంసను వెళ్ళబుచ్చగా,"చూడు మిత్రమా!
మాధవయ్య గురువును పూజిస్తూ 
గురువుతోనే ఉంటున్నాడు.నీవు తక్షణం ఆ గురువును ఆశ్రయించు
అతనిలా గురువును పూజిస్తే నీ మనసులోని చింతలన్నీ తొలగిపోతాయి.అందరూ నిన్ను గౌరవిస్తారు."అని చెప్పగా వెంటనే గురువు ఆశ్రమానికి చేరి మాధవయ్యలా గురువు వద్ద చేరి
జీవించ సాగాడు.
             ఇలా ఇద్దరు కూడా ఆ గురువు వద్ద ఉండి ప్రతి రోజు గురువు చెప్పినట్లు భగవంతునికి పూజ,భజన చేసేవారు.అయితే మాధవయ్య ఎంతో సుఖంగా ఉండగా,మణయ్య మాత్రం ఎప్పుడు దుఃఖితుడుగానే ఉండేవాడు.
         కొన్నాళ్ళకు వారి గురువు మరణించాడు.ఆ తర్వాత ఇద్దరు శిష్యులైన మాధవయ్య,మణయ్యలు మరణించారు.సంయోగ వశాన ఆ ముగ్గురు స్వర్గంలో ఒక చోట కలుసుకున్నారు.అయితే వారి స్థితి భూలోకంలో ఉన్నట్లే ఉంది.భూమిపై  సుఖంగా బతికిన మాధవయ్య చనిపోయాక స్వర్గానికి పోయి సుఖంగానే ఉన్నాడు.భూమిపై అశాంతితో జీవించిన మణయ్య మాత్రం మరణాంతరం స్వర్గానికి పోయిన సుఖం అతనికి దక్కలేదు.అక్కడా అతనికి అశాంతే దక్కింది.అప్పుడు  చింతతో మణయ్య గురువు దగ్గరకు వెళ్ళి" గురుదేవా! ఈశ్వర భక్తితో స్వర్గం లో నాకు సుఖం దక్కుతుందని చెప్పారు కదా!నేను ఇక్కడ కూడా దుఃఖితుడనై ఉండటానికి కారణమేమో చెప్పండి" అని అడిగాడు.
          వత్సా! దైవభక్తితో స్వర్గమైతే ప్రాప్తిస్తుంది. కాని సుఖదుఃఖాలు ఇచ్చేది మనసు. స్వచ్ఛమైన మనసు గలవాడు నరకంలో గూడా సుఖంగానే ఉండగలడు.మన మనసును శుద్ధి చేసుకోకపోతే స్వర్గానికి చేరినా సుఖం దక్కదు." అన్నాడు గురువు.
          జీవుడు తన మనసును స్వచ్ఛంగా ఉంచుకోవడం అలవర్చుకోవాలి.సుఖసంతోషాలకు కావాల్సింది స్వఛ్ఛమైన మనసు మాత్రమే