బ్రహ్మర్షి విశ్వామిత్ర:-నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్యపర్యవేక్షకుడు, చిట్యాల, నల్గొండ,9542236764
 బ్రహ్మ మనుమడు కుశనాభుడు
కుశనాభుని మనుమడు విశ్వామిత్రుడు
విశ్వామిత్రుని మనుమడు భరతుడు
భరతుడేలిన భారత దేశ నామధేయం...

విశ్వానికి మిత్రుడు
నమ్మినవారికి విశ్వాసపాత్రుడు
గాధి కుమారుడు...
వశిష్ఠునిచే బ్రహ్మర్షిగ పిలువబడిన వాడు
కుశవంశంలో పుట్టిన కౌశిక రత్నం
ఆ మహోన్నత దివ్యనామం చరితార్థం...

మహా వజ్ర సంకల్పంతో 
సాధించలేనిది ఏదీ లేదని
చరిత్ర పుటల్లో దాగిన సజీవ సాక్ష్యం
అకుంఠిత దీక్ష దక్షతకు తార్కాణం....

ఓ మనిషి రాజర్షిగా మహర్షిగా                                         
 బ్రహ్మర్షిగా మారిన విశిష్ట వైనం
అహంభావం ఆవేశాగ్నుల
జయించిన అపూర్వ శాంతి స్వరూపం...

భారతీయ సంస్కృతికి 
పవిత్ర గాయత్రీ మంత్రం ప్రసాదించిన మహర్షి
త్రిశంకు మహారాజు కోసం
మరో స్వర్గాన్నే సృష్టించిన అపర బ్రహ్మ

పరమ శివునికై మహా తపస్సు చేసి
ధనుర్వేద విద్య నేర్చి
దివ్య శస్త్రస్త్రాలు సాధించిన కౌశికుడు
సీతారామ కళ్యాణ కారక పుణ్య పురుషుడు

అస్త్ర ప్రయోగ ఉపసంహార క్రమాలు నేర్పిన                                                                         
రామ లక్ష్మణుల రాజగురువు
వేదవిద్య బోధించిన సకలశాస్త్ర పారంగతుడు
బల అతిబల విద్యల నుపదేశించిన
తేజో గుణ సంపన్న ఋషి వర్యుడు

వెయ్యేళ్ళు బ్రహ్మకై తపస్సు చేసిన దివ్యాత్ముడు
హరిశ్చంద్రుని సత్యనిరతి పరీక్షించి
సత్యనిష్ఠ మహాత్యం చాటిన తపోనిష్ఠుడు