ఒక్క రూపాయి (కథ):- ...గంగశ్రీ- 9676305949
 గంగాపురం గ్రామంలో రాజేష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతడు చదువులోనే కాదు అన్నింట్లో ఫస్టె. వారు పేదవారు, పెద్ద కుటుంబం కావడంతో ఏది కొందామన్న వల్ల నాన్న ఒప్పుకునేవాడు కాదు. చదువు ఖర్చులకు కూడా "ఈ పాటి చదువుకు ఆ పాటి ఖర్చా" అనేవాడు.
              తన క్లాస్మేట్స్ అందరూ క్లాస్ మేట్ బుక్స్, లక్సర్, రేనాల్డ్స్ పెన్స్ కొంటే, రాజేష్ కు మాత్రం వాళ్ల నాన్న చాలా చవవకైనవి కొనిచ్చేవాడు. మధ్యలో పెన్నో, కాపీనో నిండుకుంటే " కొనిచ్చి వారమన్నా కాలేదు అప్పుడే ఐపోయాయా; రాస్తున్నవా లేక పిచ్చి గీతలు గీస్తున్నవా" అంటూ గద్ధించేవాడు.
             మిగతా పిల్లలకు మంచి మంచి కాపీలు, పెన్నులు ఉన్నా అవి ఇప్పుడు కొన్నట్టే తాజాగా ఉండేవి. అందువల్ల వాళ్లకు మళ్ళీ మళ్ళీ కొనే అవకాశం వచ్చేది కాదు. వాళ్ళను చూపిస్తూ రాజేష్ వల్ల నాన్న మరింత కోపగించుకునేవాడు " మూణ్ణెళ్ల పరీక్షలన్నా కాలేదు మూడు పోంటీన్లు ఖాతమైనయ్" అంటూ ఒకరోజు కండ్లురిమాడు.
        చేసేది లేక మరునాడు హోమ్ వర్క్ చేయకుండానే రాజేష్ బడికి వెళ్ళాడు. హోమ్ వర్క్ చేయని వాళ్ళని నరేందర్ సార్ నిలబెట్టడంతో రాజేష్ కూడా నిలబడడంతో అందరూ నిర్ఘాంతపోయారు. అసలు విషయం చెప్పకుండా "రేపు తప్పకుండా చూపిస్తానని" మాస్టార్ని బతిమలాడు. సార్ "సరే"నన్నాడు.
             మళ్ళీ పెన్నులోకి ములికి కోసం రూపాయి అడిగితే వాళ్ళ నాన్న ఏమంటాడోనని భయపడి తీవ్రంగా ఆలోచించాడు. ఎక్కడైనా డబ్బులు దొరుకుతాయేమోననని ఇల్లంతా జల్లెడ పట్టాడు. మట్టి బెడ్డలు తప్ప ఎక్కడ ఒక్క రూపాయి కనిపించలేదు. అంతలోనే రాజేష్ కి తళుక్కున ఒక ఆలోచన వచ్చింది.
               రాజేష్ వాళ్ళ నాన్న అశోక్, వాళ్ళమ్మ సుగుణ రోజూ ఒక రూపాయి ఎవరో ఒకరు పూజ చేసేటప్పుడు వల్ల ఇష్టదైవమైన యాదగిరిగుట్ట నరసింహస్వామికి గల్లపెట్టెలో వేసేవారు. అది గుర్తొచ్చి ఇంట్లో ఎవరూ లేనిది చూసి పిన్నీసుతో చాకచక్యంగా రూపాయి బిళ్ళ తీసి జేబులో వేసుకుంటుండగా వాళ్ళమ్మ చూసి కళ్ళతోనే విషయం ఏంటని అడిగింది. రాజేష్ అసలు విషయం చెప్పడంతో "అలా చేయడం తప్పని, ఆ రూపాయిని మళ్ళీ గల్లా లోనే వేయించి, తన కొంగు చివరున్న ముడివిప్పి రెండు రూపాయలిచ్చి ములికితో పాటు నీకు ఇష్టమైంది కొనుక్కో అనగానే రాజేష్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
          "ఈ రోజు నుండి నీకు ఏ అవసరం ఉన్నా నన్నడుగు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పని చేయకు" అని దేవుడి ముందు రాజేష్ తో మాట తీసుకుంది. "సరే"నని మాటిచ్చాడు రాజేష్ తడిబారిన కళ్లతో...