టైం టేబుల్. (కథ):---గంగశ్రీ 9676305949
 శ్వేత: "అమ్మా! చూడే, చెల్లి నా జుట్ట లాగుతుంది."
చరిత: "లేదమ్మా! అక్కనే నా వీపు మీద డప్పు కొడుతుంది"
శ్వేత: "కాదమ్మా! చెల్లె అన్ని అబద్ధాలే చెప్తుంది"
చరిత: "అక్కే ఫస్ట్ నా బుక్స్ విసిరేసింది."
కవిత: "అబ్బబ్బా! ఏమల్లరి చేస్తున్నారే; ఈ పాడు కరోన వల్ల సంవత్సరం కాలంగా ఇంట్లోనే ఉంటూ, మీరు చేస్తున్న అల్లరికి నా మతి పోతుంది. ఊరుకున్న కొద్దీ మీ అల్లరి మరీ ఎక్కువైంది! ఒకరికొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, వస్తువులన్నీ చిందరవందరగా చేయడం; సర్దలేక నా ఒళ్ళు హూనమైతుంది".
శ్వేత: "నేను కాదమ్మా! ఫస్ట్ చెల్లే నన్ను కొట్టింది."
కవిత: ఊర్కోవే, వెధవల్లరి మీరూనూ, స్కూలుంటే చక్కగా తయారై తొమ్మిదింటి కల్లా బడికెళ్ళి, ఇంటికొచ్చి హోంవర్క్ చేసుకునెటోళ్ళు. "చదువు చుట్టచుట్టి గుట్టమీద పెట్టిండ్రు!" అంటూ బెదిరించింది కొంచెం కోపంతో.
వెంటనే పిల్లలిద్దరూ "పానీపూరి నోట్లో పెట్టుకున్నట్టు సైలెంటైపోయారు!"
కవిత: వెళ్లండి! వెళ్లి, మీ స్కూల్ బ్యాగ్ తెండి.
చరిత: "ఎందుకమ్మా స్కూల్స్ లేవుగా"
శ్వేత: "ఐనా మేము పాసయ్యామని టీవీలో చెప్పారుగా!; ఇప్పుడు సెలవులు ఇచ్చారు కదమ్మా"
కవిత: "సెలవులు ఇచ్చింది ఇంట్లో కొట్టుకోవడానికి కాదు; కరోన నుండి పిల్లల్ని కాపాడడానికి" అంది కోపంతో"!
చరిత: "ఇకనుంచి మేం తిట్టుకోం, కొట్టుకోం; బ్యాగొద్దు ఏమొద్దు"
కవిత: "ఏయ్ మొద్దు! అర్థం కావడం లేదా అంటూ గద్దించింది!"
అలా వెళ్లి ఇలా వచ్చారు పిల్లలిద్దరు స్కూల్ బ్యాగులతో!
కవిత: "జాగ్రత్తగా వినండి, ఇప్పుడు నేను మీకు ఇంట్లో టైం టేబుల్ తయారు చేస్తున్నా, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు స్కూల్ టైం టేబుల్ ప్రకారమే మీరు నడుచుకోవాలి. ప్రతి పీరియడ్ నడుస్తుంది, హోంవర్క్ కూడా ఉంటుంది. ఎవరు ముందు పూర్తి చేస్తే రోజూ వారికో సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది". అని ఇద్దరికీ టైం టేబుల్ తయారు చేసింది.
చరిత: "మరి ఆటలు!"
కవిత: "ఇంకా అడగలేదు అనుకుంటున్నా!"
శ్వేత: "కొంచెం సేపు ఆడుకోవాలి కదా"
కవిత: "సరే సరే, 4 నుండి 5:30 వరకు ఆటలు, 5:30 నుంచి 6:30 వరకు యోగ, 6:30 నుంచి 7:30 వరకు కథలు ఉంటాయి. ఇది రేపటినుండే ఫాలో కావాలి; వెళ్ళండి, వెళ్ళి తొందరగా తిని పడుకోండి" అంది.
సరేనంటూ డైనింగ్ వైపు నడిచారు పిల్లలిద్దరూ దీనంగా.!