ఉల్టా ఉదయ్:-...గంగశ్రీ 9676305949

 గంగాపురం అనే గ్రామంలో ఉదయ్ అనే అల్లరి పిల్లవాడు ఉండేవాడు. అతను చేసే పనులు అన్ని కూడా తారుమారుగా ఉండేవి. దీంతో ఒక్కోసారి నవ్వొస్తే, ఒక్కోసారి కోపం వచ్చేది. అందుకే అతనిని ఊర్లో అందరూ "ఉల్టా ఉదయ్" అనేవారు.
సురేఖ: "ఉదయ్, షాప్ కెళ్ళి పాల ప్యాకెట్, మసాలా ప్యాకెట్ తీసుకొనిరా"
ఉదయ్: "సరేనమ్మా" అంటూ, కుడి చెప్పు ఎడమ కాలికి, ఎడమ చెప్పు కుడి కాలికి వేసుకొని బయలుదేరాడు, దారిలో ఒకామె పెరుగమ్మ పెరుగూ.. అని అంటూ అమ్మడంతో. ఉదయ్ పాల పాకెట్ కు బదులుగా పెరుగు, పెరుగు అనుకుంటూ షాప్ కెళ్లాడు.
షాపతను: "ఏం కావాలి?" అన్నాడు; డబ్బా రేకు మీద కంకర రాయితో గీచినట్టు!
ఉదయ్: "ఒకటి పెరుగు ప్యాకెట్ ;  ఇంకోటి, ఊ...గుడ్ డే"
షాపతను: "ఇందా, ఇరవై రెండు రూపాయలు" అన్నాడు.
అమ్మ ఇచ్చిన డబ్బులు సరిగ్గా సరిపోవడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు!
సురేఖ: "ఉదయ్, నేనేం చెప్పాను, నువ్వేం తెచ్చావు?" అంది ఆవేశంతో
ఉదయ్: "నువ్వు చెప్పినవే తెచ్చినా"
సురేఖ: "అదే, నేనేం చెప్పినా?"
ఉదయ్: "నేను తెచ్చినవే చెప్పినవ్"
సురేఖ: "నువ్వేం తెచ్చినవ్?"
ఉదయ్: "నువ్వు చెప్పినవే తెచ్చిన"
సురేఖ: "వీడితో వేగలేక చస్తున్నాను." అంటూ గొణుక్కుంది.
              ఉదయ్ వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరూ టైలర్ పనిలో గిజిగాడు పిట్టలు. ఒకరోజు సురేఖ రెండు కవర్లు ఉదయ్ కి ఇస్తూ, "ఎల్లో కవర్ అంజలి అక్కకి, రెడ్ కవర్ కుమార్ అన్నకి ఇచ్చిరా"
అలాగేనని ఉదయ్ బయలుదేరుతుండగా,
ఎడమచేతిలో ఎల్లో ; కుడిచేతిలో రెడ్ కవర్లుంచి; "కుమార్ కుడి, కుమార్ కుడి" అంటూ నొక్కి చెప్పింది.
ఉదయ్: "కుమార్ కుడి, కుమార్ కుడి" అనుకుంటూ, ఎగురుకుంటూ వెళ్తుండగా, దారిలో జ్యోతక్క వాళ్లు ప్రసాదం పెడుతుండడంతో, రెండు కవర్లు రెండు వైపులా కింద పెట్టి రెండడుగులు ముందుకెళ్లి ప్రసాదం తీసుకొని, తిని, తిరిగి కవర్లు పట్టుకోవడంతో కవర్లు తారుమారయ్యాయి!
             కుడి చేతిలో కవర్ కుమార్, ఎడమ చేతిలో కవర్ అంజలి వాళ్ళింట్లో ఇచ్చి, ఏదో సాధించిన వాడిలా అమ్మకు విజయ యాత్ర విశేషాలు చెప్తుంటే, కొంచెం దూరం నుంచి కుమార్ ఎల్లో, అంజలి రెడ్ కవర్లతో రావడం చూసి బావిలా నోరెళ్ళబెట్టింది సురేఖ!